బాబూ నందమూరి ఫ్యామిలీ ఏమంటోందో విన్నావా..?
ఏపీ సీఎం చంద్రబాబుకు నమ్మిన బంటు వంటి నందమూరి ఫ్యామిలీ ఇప్పుడు ఆయనపైనా, ఆయన పార్టీపైనా, ఆ పార్టీ నేతలపైనా రివర్స్ అవుతోందా? టీడీపీ అంటేనే భయపడే పరిస్థితి ఉందని ప్రచారం చేస్తోందా? అంటే తాజా పరిణామాలు ఔననే అంటున్నాయి. వాస్తవానికి నందమూరి ఫ్యామిలీ అంటే.. నందమూరి బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వీళ్లు మాత్రమే కాదు.. దివంగత ఎన్టీఆర్ పుట్టి పెరిగిన నిమ్మకూరులో నందమూరి ఇంటి పేరున్న కుటుంబాలు వందల సంఖ్యలో ఉన్నాయి. ఆయా కుటుంబాల ఓట్లు కూడా బాగానే ఉన్నాయి. ఆది నుంచి అన్నగారికి అండగా నిలిచిన ఈ కుటుంబాలు ఆ తర్వాత చంద్రబాబుకు అండగా ఉన్నాయి. అయితే, ఇటీవల కాలంలో అధికార పక్షంపై తీవ్ర వ్యతిరేకత పెంచుకుంటున్నాయి.
టీడీపీ నేతలు దోచుకుంటున్నారని.....
దీనికి ప్రధాన కారణం.. తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఫలాలూ అందకపోగా, తాము ఎంతో గౌరవించుకునే నిమ్మకూరు గ్రామాన్ని నాశనం చేస్తున్నారని, టీడీపీ నేతలు దోచుకుంటున్నారని వారి వాదన. ఈ విషయాలను నేరుగా నందమూరి ఫ్యామిలీనే మీడియాకు వివరిస్తుండడం గమనార్హం. తాజాగా వైసీపీ అధినేత, చంద్రబాబుకు బద్ధ శత్రువు వైఎస్ జగన్కు ఈ నందమూరి ఫ్యామిలీ భారీ ఎత్తున స్వాగతం పలికింది. జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రస్తుతం ఎన్టీఆర్ పుట్టిన జిల్లా కృష్ణాలో ఆయన పుట్టిన ప్రాంతం నిమ్మకూరులో జరుగుతోంది. సోమవారం ఆయన ఈ ప్రాంతంలోకి ప్రవేశించగానే ఊహించని విధంగా నందమూరి ఫ్యామిలీ నుంచి ఘన స్వాగతం లభించింది. దీంతో జగన్ అమితానందానికి లోనయ్యారు.
వైఎస్ జగన్ తో నందమూరి ఫ్యామిలీ.....
ఈ సందర్భంగా నందమూరి వెంకటేశ్వరరావు బంధువులు నందమూరి ప్రభు తదితరులు వైఎస్ జగన్తో మాట్లాడారు. నిమ్మకూరులో జరుగుతున్న అవినీతి, అక్రమాలను స్వయంగా జగన్కు చూపించారు. నీరు-చెట్టు పథకం కింద చెరువును 50 అడుగుల లోతు తవ్వుతున్నారని చెప్పారు. ఎనిమిదిన్నర లక్షల ఖర్చుతో చెరువును తవ్వుతూ.. తవ్విన మట్టి ఒక ట్రాక్టర్కు 350 రూపాయలు, లారీకి 600 రూపాయలకు అమ్ముకుని తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొక్లెయిన్లతో మట్టి తవ్విన దృశ్యాలను వైఎస్ జగన్ చూపించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. నీరు చెట్టు పథకంలో చెరువుల పూడిక తీతలో భాగంగా మూడు నుంచి నాలుగు అడుగులు తవ్వుతారని చెప్పారు. కానీ పథకం పేరు చెప్పి 50 అడుగులు తవ్వి మట్టిని అమ్ముకుంటున్నారని తెలిపారు. అంతేకాకుండా మళ్లీ లేబర్ను పెట్టి తవ్వించామని చెప్పి ప్రభుత్వం నుంచి డబ్బును తీసుకుంటున్నారని సర్కారు అవినీతి ఎండగట్టారు. మొత్తానికి ఈ పరిణామం కృష్ణా జిల్లా టీడీపీ వర్గాల్లో చర్చకు దారితీసింది.
ఎంపీ కొనకళ్లపై బంధువుల ఫిర్యాదు...
ఎన్టీఆర్ భార్య బసవతారకం బంధువులు బందరు ఎంపీ కొనకళ్ల నారాయణపై జగన్కు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. పామర్రు నియోజకవర్గంలో జగన్ యాత్ర కొనసాగుతుండగా ఎన్టీఆర్ సతీమణి బసవతాకరకం బంధువులుగా చెప్పుకుంటున్న కాట్రగడ్డ శివలీల, వంశీకృష్ణలు బందరు ఎంపీ కొనకళ్లపై ఆరోపణలు చేస్తూ వినతిపత్రం ఇచ్చారు. కొనకళ్ల అండతో ఆయన మేనల్లుడు పామర్తి అనిల్ తమపై వేధింపులకు పాల్పడుతున్నారని... రియల్ ఎస్టేట్ వ్యవహారంలో తమ కొడుకు, కోడలితో పాటు ఇద్దరు చిన్నారులను పోలీసుల చేత కిడ్నాప్ చేయించారని...వారిని విడిచిపెట్టేలా చూడాలని వారు కోరారు.