‘‘సింహ’’ గడ్డం గీసుకోక తప్పదా...??

నందమూరి కుటుంబానికి కంచుకోటలో అనూహ్యంగా రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత తెలుగుదేశం పార్టీకి తిరుగులేని నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ లో ఒక్కటే ఒకటి. అది హిందూపురంనియోజకవర్గం. నారా చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత కుప్పం నియోజకవర్గం కూడా అదే రీతిలో మారింది. అయితే కుప్పంలో నేటికీ ఆ పార్టీకి తిరుగులేదు. అయితే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ఇప్పుడు రెండు విధాలుగా బాలయ్య బాబుకు దెబ్బపడుతుందంటున్నారు.
నందమూరి కుటుంబానికి.....
హిందూపురం నియోజకవర్గం చరిత్ర తీసుకుంటే...1985, 1989,1994లో జరిగిన ఎన్నికల్లో నందమూరి తారకరామారావు హ్యట్రిక్ విజయాలు సాధించారు. 1996 లో జరిగిన ఉప ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ ఇక్కడి నుంచి గెలుపొందారు. ఆ తర్వాత హిందూపురంలో నందమూరి కుటుంబం పోటీచేయలేదు. ఆ తర్వాత 1999, 2004, 2009లో పోటీ చేసిన సి.సి. వెంకట్రాముడు, రంగనాయకులు, అబ్దుల్ ఘనిలు టీడీపీ నుంచి గెలిచారు. గతఎన్నికల్లో తిరిగి నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ బరిలోకి దిగి 16, 196 ఓట్ల భారీ ఆధిక్యతతో గెలుపొందారు.
అబ్దుల్ ఘని వెళ్లిపోవడంతో...
అయితే గతకొంతకాలంగా ఇక్కడ బాలయ్య బాబుపైన వ్యతిరేకత స్పష్టంగా కన్పిస్తుంది. నియోజకవర్గంలో ఉండరని, ప్రజలకు అందుబాటులో ఉండరనేది బాలయ్య మీద ప్రధాన అభియోగాలు. దీనికి తోడు ఇప్పుడు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని పార్టీని వీడి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఈ నియోజకవర్గంలో నందమూరి కుటుంబ చరిత్ర తిరగబడుతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హిందూపురం నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు ప్రభావం చూపనున్నారు. వీరి సంఖ్య అధికంగా ఉండటంతో వీరు అబ్దుల్ ఘని వైపు వెళతారా? లేక బాలయ్య పక్కనే ఉంటారా? అన్నది కూడా తేలాల్సి ఉంది. బీజేపీ తో తెగదెంపులు చేసుకున్నాం కాబట్టి ముస్లింసోదరులు తమ వెంటే ఉంటారని టీడీపీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది.
పవన్ దెబ్బ కూడా....
మరోవైపు ఈనియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గ ఓటర్లు కూడా ఎక్కువేనని చెప్పాలి. పవన్ కల్యాణ్ అనంతపురం పర్యటనలో కూడా హిందూపురం నుంచి ఆ సామాజిక వర్గం నేతలు ఎక్కువగా పాల్గొనడం కూడా టీడీపీ నేతలను కలవర పరుస్తోంది. జనసేనకు ఇక్కడ సమర్థవంతమైన నాయకత్వం లేకపోయినా... ఓట్లు చీల్చే అవకాశం ఉందంటున్నారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఇక్కడ పోటీకి దిగితే తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకుకు భారీగా చిల్లుపడుతుందంటున్నారు. ఇలా బాలయ్య బాబు ఒకవైపు పవన్ కల్యాణ్, మరోవైపు జగన్మోహన్ రెడ్డిల వ్యూహంలో చిక్కుకుపోతారా? అన్న సందేహాలను ఆ పార్టీ నేతలే వ్యక్తం చేస్తుండటం గమనార్హం. మొత్తం మీద హిందూపురంలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు బాలయ్య బాబు విజయంపై ఏ మేరకు ప్రభావం చూపుతాయో చూడాల్సి ఉంది.
- Tags
- abdul ghani
- ananthapuram district
- andhra pradesh
- ap politics
- hindupuram constiuency
- janasena party
- nandamuri balakrishna
- nara chandrababu naidu
- pawan kalyan
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- అనంతపురం జిల్లా
- అబ్దుల్ ఘని
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నందమూరి బాలకృష్ణ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
- హిందూపురం నియోజకవర్గం