జేసీ తనయుడి రాజకీయ ఫీట్లు.. అదరహో!

జేసీ.. అనగానే వెంటనే అనంతపురం... జేసీ బ్రదర్స్ హవా.. రాజకీయాల్లో వాళ్ల హల్చల్. ఎంతటివారినైనా 'నువ్వు' అని సంబోదించే గట్స్. . ఇలా ఇవన్నీ ఒక్కసారిగా తెరమీదికి వస్తాయి. నిజమే కదా! వారు అలానే ఉన్నారు కదా!! ఈ విషయం లో మాత్రం ఎలాంటి సందేహాలకూ అవకాశం లేదని అనేవారూ ఉన్నారు. అయితే, రాజకీయాలు భూచక్రం లాంటివి నిలకడగా ఒకే చోట ఉండిపోవు. ఒకేలాగా తిరగబోవు కూడా! ఇప్పుడు జేసీల పరిస్థితి కూడా అలానే ఉంది. జేసీ బ్రదర్స్ ప్రభాకర రెడ్డి, దివాకర్ రెడ్డిల పరిస్థితి ఇప్పుడు అనంతంలో పెద్దగా ఏమీ బాగోలేదని సాక్షాత్తూ సీఎం చంద్రబాబుకే నివేదికలు అందుతున్నాయి. అంటే.. వారు ఎంతగా ఫేమ్‌ను కోల్పోయారో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే సమయంలో మాజీ నేతల తనయులు ఇప్పుడు అనంతలో పట్టు బిగిస్తున్నారు.
జేసీకి కష్టమేనా?
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వారు దూసుకుపోతున్నారు. ఇప్పుడు ఇలాంటి వారే జేసీ కుటుంబానికి సవాలుగా మారుతున్నారు. దీంతో జేసీ కుటుంబంలోని చాలా మంది ఆయా నేతల ప్రాపకం కోసం తహతహలాడిపోతున్నారని తాజాగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల చంద్రబాబు తన పుట్టిన రోజును ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు కేంద్రంపై పోరు దినంగా ప్రకటించారు. తాను విజయవాడలో పెద్ద ఎత్తున 12 గంటల దీక్ష కూడా చేశాడు. ఈ క్రమంలోనే అన్ని జిల్లాల్లోనూ నేతలు దీక్షలకు దిగాలని పిలుపునిచ్చారు. అధినేత ఆదేశానుసారం నేతలు కూడా దీక్షలకు దిగారు. అదేవిధంగా అనంతపురంలోనూ నేతలు దీక్షలు చేశారు. ఈ క్రమంలోనే జేసీ తనయుడు వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశిస్తున్న పవన్ కుమార్ రెడ్డి చేసిన ఓ పని ఇప్పుడు జేసీ కుటుంబ రాజకీయాల్ని ప్రశ్నార్థకం చేసింది.
చీరల పంపిణీకి హాజరై.....
అనంతపురం నగరంలో క్లాక్‌టవర్ దగ్గర మంత్రుల ఆధ్వర్యంలో ఉపవాసదీక్ష జరిగింది. దీనికి పోటీగా మాజీ ఎంపీ కేఎం సైఫుల్లా ఇంటి దగ్గర ఆయన కుమారుడు జకీవుల్లా చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దీనికి ఎంపీ దివాకర్‌రెడ్డి కుమారుడు జేసీ పవన్‌కుమార్ రెడ్డి హాజరయ్యారు. వందలాది మంది మహిళలు.. పార్టీ నాయకులు.. కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. అనంతపురం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న పవన్.. తన వర్గాన్ని పెంచుకోవడానికి వ్యూహాలు రచించుకుంటున్నాడు.
అందుకోసమే వెళ్లారా?
అయితే, జేసీ హవా తగ్గిపోయి.. సైఫుల్లా వర్గం హవా పెరుగుతున్న నేపథ్యంలో ఈర్గాన్ని మచ్చిక చేసుకునే పనిలోపడడం తీవ్ర వివాదంగా మారింది. పార్టీలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జకీవుల్లాకు నగరంలో గట్టి పట్టు ఉంది. బలహీనంగా ఉన్న జేసీ వర్గం జకీవుల్లాకు దగ్గర కావడంతో ఇప్పటి వరకు జేసీ వర్గంలో కీలకంగా ఉన్న నేతలు తలలు పట్టుకుంటున్నారు. అటు అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కూడా జేసీ వర్గాన్ని ఏ మాత్రం కేర్ చేయడం లేదు. కీలకమైన నగరంలో జేసీ వర్గం నామామాత్రంగా మారిపోయింది. ఈ క్రమంలో పవన్‌కుమార్ రెడ్డి ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తే పరిస్థితి అంత సలువుగా అయితే ఉండేలా లేదు. ఇక, జేసీ బ్రదర్స్ హవా పూర్తిగా డౌన్ అయిపోయిందన్న చర్చకూడా మొదలైంది.