జగన్...ఇక్కడ టీడీపీకి ఛాన్స్ ఇస్తాడా... లేదా.....?

దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ పుట్టిన ఊరు కృష్ణా జిల్లా నిమ్మకూరు. గతంలో గుడివాడ నియోజకవర్గంలో ఉండే నిమ్మకూరు నియోజకవర్గాల పునర్విభజనలో పామర్రు రిజర్వ్డ్ నియోజకవర్గంలో కలిసింది. పామర్రు పేరుతో కొత్త నియోజకవర్గం ఏర్పడడంతో ఆ మండలంలో ఉన్న నిమ్మకూరు గుడివాడ నుంచి వేరు అయ్యింది. ఇక గతంలో ఈ ప్రాంతం అంతా టీడీపీకి కంచుకోటగా ఉండేది. గతంలో ఎన్టీఆర్ కూడా ఈ ప్రాంతం నుంచి అసెంబ్లీకి ప్రాథినిత్యం వహించారు. ఇక వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా 148వ రోజు ఆదివారం పెనమలూరు నియోజకవర్గం జగన్ పామర్రు నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం అక్కడ జరిగిన బహిరంగ సభలో చంద్రబాబును టార్గెట్‌గా చేసుకుని నిప్పులు కురిపించారు.
రెండు ఎన్నికల్లనోనూ....
ఇక పామర్రు నియోజకవర్గం ఎన్టీఆర్ అడ్డా అయినా నియోజకవర్గం ఏర్పడ్డాక జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీ ఓడిపోయింది. ఇది నిజంగా ఆ పార్టీకి అవమానం లాంటిదే. 2009లో కాంగ్రెస్ ఉంచి పోటీ చేసిన డీవై.దాస్ ఏకంగా 16 వేల ఓట్లతో విజయం సాధించారు. నాడు టీడీపీ అభ్యర్థిగా ఓడిన ఉప్పులేటి కల్పన గత ఎన్నికలకు ముందు వైసీపీలోకి జంప్ చేసి ఆ పార్టీ తరపున 1000 ఓట్లతో వర్ల రామయ్యను ఓడించారు. ఆపరేషన్ ఆకర్ష్ నేపథ్యంలో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన కల్పన తన పూర్వాశ్రమం అయిన టీడీపీలోకి జంప్ చేసేశారు. దీంతో జగన్ పామర్రు జడ్పీటీసీ తనయుడు కైలా అనిల్‌బాబుకు నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు. పామర్రు జడ్పీటీసీ కూడా వైసీపీ చేతుల్లో ఉందంటే ఇక్కడ టీడీపీ బలహీనత స్పష్టమవుతోంది.
టీడీపీలో సీటు ఎవరికో...
ఇక్కడ వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే కల్పనకే సీటు ఇస్తారా ? లేదా ? మారుస్తారా ? అన్నది క్లారిటీ లేదు. కల్పన భర్తకు బాపట్ల ఎంపీ సీటు ఇచ్చి ఆమెను ఇక్కడ తప్పిస్తారని టాక్. ఇక ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య మళ్లీ ఇక్కడ నుంచి తానే పోటీ చేస్తానని చెపుతున్నారు. కల్పన కూడా తనదే టిక్కెట్ అని ధీమాతో ఉన్నారు. వీరిద్దరు కాకుండా గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన మాజీ ఎమ్మెల్యే డీవై.దాస్ టీడీపీలోకి వచ్చి ఆయనే పోటీ చేస్తారని నియోజకవర్గంలో తాజా సంఘటనలు చెపుతున్నాయి. ఓవరాల్‌గా టీడీపీ సీటు విషయంలో క్లారిటీ అయితే లేదు.
లోకేష్ స్ట్రాటజీ ఏంటి?
గత ఎన్నికల్లో స్టేట్‌లో ఓడినా పామర్రులో మాత్రం స్వల్ప ఓట్లతో వైసీపీ జెండాయే ఎగిరింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే పార్టీ మారడంతో కొత్త క్యాండెట్‌కు జగన్ బాధ్యతలు ఇచ్చారు. ఇక్కడ రెండు పార్టీల బలాబలాలు సమానంగానే ఉన్నా టీడీపీ అధికారంలోకి రావడంతో జరిగిన అభివృద్ధితో ఆ పార్టీ కాస్త బలోపేతం అయ్యింది. అదీ కాక కల్పన, రామయ్యతో పాటు మాజీ ఎమ్మెల్యే దాస్ కూడా టీడీపీలోకి వచ్చేస్తే అది టీడీపీకి చాలా ప్లస్ అవుతుంది. వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ గడ్డపై ఎలాగైనా పుసుపు జెండా రెపరెపలాడించాలని ఎన్టీఆర్ మనవడు, మంత్రి లోకేష్ ఇక్కడ ప్రత్యేకంగా దృష్టి సారించారు. లోకేష్‌తో పాటు ఆయన తల్లి నారా భువనేశ్వరి ఈ నియోజకవర్గంలో గ్రామాలనే దత్తత తీసుకున్నారు.పట్టిసీమ ప్రాజెక్టు వాటర్‌తో బాగా లబ్ధిపొందిన నియోజకవర్గాల్లో పామర్రు కూడా ఉంది. ఇది కూడా టీడీపీకి ప్లస్. ప్రస్తుతం నియోజకవర్గంలో బలాబలాలను బట్టి చూస్తే టీడీపీకి కాస్త ఎడ్జ్ కనపడుతున్నా మరి జగన్ ఎలాంటి వ్యూహాలతో ఇక్కడ మరోసారి టీడీపీని గెలుపునకు దూరం చేస్తాడు ? లేదా ? లోకేష్ స్ట్రాటజీలు ఇక్కడ తొలిసారిగా పసుపు జెండాను ఎగరవేయిస్తాయా ? అన్నది చూడాలి.