ఓర్నీ...వాటిని కూడా కబ్జా చేస్తారా !!

బలమున్న వాడిదే రాజ్యం. రాజకీయాల్లోనూ అంతేనేమో. మంత్రులు సామంతులు తరువాతనే మిగిలిన వారంతా. ఇపుడు విశాఖ జిల్లాలోనూ అదే జరుగుతోందనిపిస్తోంది. నోరున్న నాయకులు లేని చోట సీటు కబ్జా చేసేందుకు మంత్రుల తనయులు పోటీ పడుతూంటే వారికి మద్దతుగా తండ్రులు ముందుకు వస్తున్నారు. విశాఖ రూరల్ జిల్లాలో ఉన్న రెండు సీట్లలో అలా మంత్రులు సుపుత్రుల కన్ను పడింది. అందులో ఒకటి సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోడవరం అయితే, రెండవది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మాడుగుల. చోడవరం నుంచి పోటీకి మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ ప్రయత్నాలు చేసుకుంటూంటే మాడుగుల సీటు మీద సీనియర్ మంత్రి అయ్యన్న పాత్రుడు కుమారుడు కన్నేశారు.
ఫ్లెక్సీలతో ప్రచారం....
ఇక మాడుగులలో సీన్ చూస్తూంటే అయ్యన్న కుమారుడు విజయ్ పాత్రుడికి టికెట్ ఖరారు అయిపోయినట్లుగా అపుడే ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు పెట్టేశారు. ఈ మధ్యనే జరిగిన విజయ్ పుట్టిన రోజు వేడుకలను ఆర్భాటంగా నిర్వహించిన పార్టీ నాయకులు ఇపుడు మరి కాస్తా ముందుకు వచ్చి ఫ్లెక్సీల యుద్ధానికి తెర తీశారు. వచ్చే ఎన్నికల్లో విజయ్ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తారని చెప్పకనే చెబుతూ టీడీపీలోని ఓ వర్గం మంత్రి కొడుక్కి అపుడే రాచ బాట వేస్తోంది. ఇక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడి మీద మంత్రి అయ్యన్నపాత్రుడు నేరుగా బాణాలు ఎక్కుపెడుతూ మాడుగులపైన తన దృష్టిని గట్టిగానే పెట్టారు. ఇక మరో మంత్రి గంటా శ్రీనివాసరావు తన కుమారుడికి చోడవరం సీటు కోసం చేయని ప్రయత్నం లేదు. ఇందుకోసం ఆయన ఏకంగా సిట్టింగు ఎమ్మెల్యే రాజుకే ఎసరు పెట్టేలా పావులు కదుపుతున్నారు. దాంతో రాజు గారు బేజారవుతున్నారు.
ఆశావహులది అరణ్య రోదనేనా...?
జిల్లాలో పార్టీని ఇద్దరు మంత్రుల చేతిలో చంద్రబాబు పెట్టారు. వారి మాటకు విలువ ఇస్తున్నారు. అయితే మంత్రులు మాత్రం తమ పుత్ర ప్రేమతో సీనియర్లను, ఆశావహులను పక్కన పెడుతున్నారన్న అసంతృప్తి పార్టీలో వ్యక్తం అవుతోంది. మాడుగుల విషయానికి వస్తే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయనే ప్రస్తుతం ఇంచార్జిగా ఉన్నారు. తనకు సీటు వస్తుందని కూడా ఆయన ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇపుడు మంత్రి కొడుకు రేసులోకి రావడంతో ఈ బిగ్ ఫైట్ ని ఎలా ఎదుర్కోవాలన్న అంతర్మధనంలో పడిపోయారు. చోడవరం సిట్టింగు ఎమ్మెల్యే రాజు ది ఇదే పరిస్థితి. తనకు మళ్ళీ టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నా ఎవరూ వినే వారు లేరు. జిల్లాలోని మంత్రులే సీటు కబ్జాకు రెడీ అయిపోతూంటే ఇక మొర ఆలకించేదెవరన్నది తమ్ముళ్ళ ఆవేదనగా ఉంది. చంద్రబాబు ఎంతవరకు మంత్రుల డిమాండ్లకు తలవొగ్గుతారో చూడాల్సి ఉంది.
- Tags
- andhra pradesh
- ap politics
- ayyannapathrudu
- chodavaram constiuency
- ganta srinivasarao
- janasena party
- madugula constiuency
- nara chandrababu naidu
- pawan kalyan
- raviteja
- telugudesam party
- vijaypathrudu
- visakhapatnam district
- y.s. jaganmohan reddy
- ysr congress party
- అయ్యన్న పాత్రుడు
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- గంటా శ్రీనివాసరావు
- చోడవరం నియోజకవర్గం
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- మాడగుల నియోజకవర్గం
- రవితేజ
- విజయ్ పాత్రుడు
- విశాఖపట్నం జిల్లా
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ