ఇద్దరు మంత్రుల అవినీతి చిట్టా ఇదిగో..!
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గులాబీ పార్టీలో గుబులు మొదలైంది. పలువురు మంత్రులు, నేతల అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండడంతో వచ్చే ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇన్నిరోజులుగా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై, పలువురు నేతల తీరుపై విమర్శలు, అవినీతి ఆరోపణలు చేసినా పట్టించుకోని సీఎం కేసీఆర్ ప్రస్తుతం వాటిని సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఇలాంటి పరిణామాలు మంచిదికాదని గ్రహించిన కేసీఆర్ నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై క్షేత్రస్థాయిలో నిఘావర్గాల ద్వారా సమాచారం తెప్పించుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
వివాదాస్పదంగా....
అయితే నేతలపై వస్తున్న ఆరోపణలతో వెంటనే చర్యలు తీసుకుంటనే తప్పును ఒప్పుకున్నట్లు అవుతుందనే భావనతో కేసీఆర్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఈ రెండు జిల్లాల్లో తప్ప మిగతా అన్న జిల్లాల్లోనూ దాదాపుగా టీఆర్ఎస్ మంచి పట్టుసాధించింది. గత ఎన్నికల్లో ఎక్కువసీట్లు గెలుచుకోగలిగింది. కానీ, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావుల వ్యవహారం ఈమధ్య వివాదాస్పదంగా మారింది.
జిల్లా కలెక్టరేట్ భూ సేకరణలో....
నూతనంగా ఏర్పడిన సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ నిర్మించడానికి అవసరమైన ప్రభుత్వ భూములు ఉన్నా.. తన భూముల్లోకి వచ్చే చూసుకుని కోట్లు కూటబెట్టారనే విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి కలెక్టరేట్‌ను తన భూముల్లోకి మార్చుకున్నారని ఆరోపిస్తున్నాయి. దీనిపై సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో రిపోర్టు తెప్పించుకుని మంత్రి జగదీశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పద్ధతి మార్చుకోకపోతే టికెట్ గల్లంతేనని గట్టిగా మందలించినట్లు సమాచారం. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు భూ ఆక్రమణల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఇసుక మాఫియాను పెంచిపోషిస్తున్నారని ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
నిఘా వర్గాలు అందించిన సమాచారంతో....
అదేవిధంగా ఓ బ్యాంకుకు కోట్లాది రూపాయులు జూపల్లి కుటుంబ సభ్యులు కుచ్చుటోపి పెట్టారని విరుచుకుపడుతున్నారు. అయితే ఈ మంత్రి కి సంబంధించిన విషయాలు కూడా సీఎం కేసీఆర్‌కు అందినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో నిఘా వర్గాలు అందించిన వాస్తవాలతో జూపల్లిపై కేసీఆర్ సీరియస్ అయ్యారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండగా ఇలాంటి ఏమిటంటూ తీవ్రంగా మందలించినట్లు ఆ పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో సిట్టింగులందరికీ సీఎం కేసీఆర్ టికెట్లు ఇవ్వరనే వాదనకు బలం చేకూరుతోంది. ఇదే సమయంలో ఈ ఇద్దరితోపాటు మరికొందరు మంత్రులు కూడా తీవ్ర ఆందోళనలో పడిపోయినట్లు సమాచారం.