చింతమనేని సీన్ తేడా కొడుతుందా?

వివాదాలు, గొడవలు, ఫైటింగ్‌లే తనకు ఆభరణాలు, అలంకరణలుగా భావించే ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌రావుకు ఎన్నికల వేళ టెన్షన్ పట్టుకుందా ? అన్న చర్చ ఇప్పుడు దెందులూరు నియోజకవర్గంలోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ స్టార్ట్ అయ్యింది. చింతమనేని పైకి మేకపోతు గాంబీర్యాన్ని ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం ఇటీవల వరుసగా ఎదురు దెబ్బలతో డైలమాలో పడినట్టే కనిపిస్తోంది. లెక్కలేనన్ని వివాదాలతో పార్టీ, ప్రభుత్వం పరువు తీస్తోన్న చింతమనేనిని మోస్తోన్న చంద్రబాబుకు తాజా సంఘటనలతో ఆయన పేరు చెపితేనే చికాకు వచ్చేస్తోందట.
సీన్ రివర్స్ అయితే....
పైకి మేకపోతు గాంబీర్యంతో వ్యవహరించే చింతమనేని ఒక్కోసారి సీన్ రివర్స్ అయితే వెనక్కే వెళ్లిపోతాడు. సీఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నప్పుడు ఓ ఎస్ఐపై దాడి చేసిన కేసులో పోలీసులు తన కోసం తిరుగుతుంటే మనోడు తప్పించుకుని పరారయ్యాడు. సీఎం కిరణ్‌ను కలిసి నన్ను అనవసరంగా టార్గెట్ చేస్తున్నారని వాపోయాడు. కిరణ్ కూడా మనోడిని లైట్ తీస్కొని నువ్వు చేసిన పని నాకు తెలియదా అని చీవాట్లు పెట్టడంతో చివరకు ఏదోలా బెయిల్ తెచ్చుకుని సైలెంట్ అయ్యాడు.
వనజాక్షి విషయంలో.....
గత ఎన్నికల్లో వరుసగా రెండోసారి గెలవడం విప్ పదవి రావడతో మళ్లీ రెచ్చిపోతున్నారు. ఎమ్మార్వో వనజాక్షి విషయంలో తప్పుఒప్పుల సంగతి ఎలా ఉన్నా ఓ మహిళా ఎమ్మార్వోపై దగ్గరుండి మరీ దాడి చేయడం / చేయించడంతోనే చింతమనేని ఎలా వ్యవహరించారో అందరికీ తెలిసిపోయింది. ఈ చర్యను యావత్ ప్రజలందరూ ఖండించారు. చివరకు చంద్రబాబు సైతం వనజాక్షికి క్లీన్ ఇమేజ్ ఉండడంతో చింతమనేనికి చీవాట్లు పెట్టారు.
మరోసారి వార్తల్లోకి ఎక్కి.....
తాజాగా హనుమాన్‌జంక్షన్‌లో ఆర్టీసీ బస్సుపై ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారంలో చంద్రబాబు ఫోటో చిరిగి ఉండడం గమనించిన చింతమనేని ఆ బస్సును ఆపేసి వాళ్లను వేరే బస్సు ఎక్కించి, అక్కడ ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లను బండ బూతులు తిడుతూ చేసిన హంగామాతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అక్కడ బస్సు ఆపడం కరెక్ట్ కాదని చెప్పినందుకు ఓ వ్యక్తిపై చేయి చేసుకున్నాడు. చివరకు ఇది ప్రభుత్వానికి చాలా మైనస్ అయ్యింది. చంద్రబాబు పిలిచి పోతే నాకు ఓ నీ వల్ల ఓ సీటు పోతుందని అనుకుంటాను... ఇక నీ విషయంలో సహించలేనని చెప్పడంతో ఎవడైతే నాకేంటి అని బీరాలు పోయే ఈ ప్రభాకరుడు చివరకు బాధితుడి ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.
టెన్షన్ స్టార్ట్ అయిందా....?
అక్కడ ప్రభాకర్ క్షమాపణి చెప్పారా ? లేదా ? అన్నది పాయింట్ కాదు. ఆ బాధితుడి ఇంటికి వెళ్లడంతోనే అతడు తన తప్పు, పరాజయం అంగీకరించినట్లయ్యింది. ఇక తాజాగా ప్రభాకర్‌పై పోటీకి ప్రభాకర్‌కు వరుసకు సోదరుడు అయిన తన సొంత మండలానికే చెందిన కొఠారు అబ్బయ్య చౌదరి పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం అబ్బయ్య చౌదరి తండ్రి నియోజకవర్గ వైసీపీ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నా ప్రభాకర్ మీద రంగంలోకి దిగేది అబ్బయ్యే అంటున్నారు. అబ్బయ్య చౌదరికి ఇప్పుడు సొంత సామాజికవర్గంలో ఫాలోయింగ్ పెరుగుతుడడంతో ప్రభాకర్‌లో టెన్షన్ స్టార్ట్ అయ్యింది. గెలుపు ఓటములు ఎలా ఉన్నా మనోడు విచక్షణ కోల్పోతున్నాడా ? అనేలా నియోజకవర్గంలో సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా పెదవేగి మండలం పెదకడిమి గ్రామంలో వైసీపీ కార్యకర్తలు కొఠారు అబ్బయ్య చౌదరి ఫొటో ఏర్పాటు చేస్తేనే ప్రభాకర్ అనుచరులు తట్టుకోలేకపోయారు. ఈ ఫ్లెక్సీలో సీనియర్ ఎన్టీఆర్ ,కొడాలి నాని ఫొటోలు కూడా ఉన్నాయి.అసలే ప్రభాకర్ సొంత క్యాస్ట్, ఆయన మండలం, ఆయనకు బంధువు, సోదరుడు కావడంతో ఎక్కడ గట్టి పోటీ ఇస్తాడో ? అన్న ఆందోళన ఒకటి అయితే చివరకు వాళ్ల ఫ్లెక్సీలు పెట్టుకుంటే కూడా తట్టుకోలేని పరిస్థితి దెందులూరు నియోజకవర్గంలో ఉంది. అటు చంద్రబాబు వార్నింగ్‌లు, ఇటు గత రెండు ఎన్నికల్లో కంటే గట్టి ప్రత్యర్థి ఉండడంతో చింతమనేని సీన్ తేడా కొడుతోన్నట్టే కనపడుతోంది.