బాబుకు కొత్త మిత్రులు దొరుకుతున్నారే...!!!

అసలే మిత్రులు లేరనుకుంటున్న ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి కొత్త నేస్తాలు తోడవుతున్నారు. ఇప్పటి వరకూ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే ఎన్నికల్లో చంద్రబాబు దిగుతారని అందరూ భావించారు. ఆంధ్రప్రదేశ్ లో గత నాలుగున్నరేళ్లుగా జరుగుతున్న ఉద్యమాలు, ఆందోళనలు చూస్తుంటే అదే అన్పించింది. గత ఎన్నికల్లో తనకు చేయూతనిచ్చిన జనసేన పార్టీ చంద్రబాబును వదిలి వెళ్లిపోయింది. అలాగే తనతో కలసి ఉన్న బీజేపీని చంద్రబాబు దూరం చేసుకున్నారు. ఇక వైసీపీ అధినేత జగన్ తాను ఒంటరిగానే ఎన్నికల్లో బరిలోకి దిగుతానని ఎప్పుడో స్పష్టం చేశారు.
ఒంటరిగా పోటీ చేస్తారనుకున్నా....
అయితే చంద్రబాబుకు ఒంటరిగా ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయలేదు. ఏదో ఒక పార్టీతో కలసి మాత్రమే వెళ్లారు. ఏపీ కంటే ముందు తెలంగాణ ఎన్నికలు రావడంతో బాబుకు అదృష్టం కలసివచ్చినట్లయింది. చంద్రబాబుకు కాంగ్రెస్ అండగా దొరికింది. తెలంగాణలో బలంగా ఉన్న కాంగ్రెస్ కు తాను మద్దతిచ్చి విజయావకాశాలపై ఆశలు పెంచారు చంద్రబాబు. ఇక ఆంధ్రప్రదేశ్ లో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమయ్యింది. రెండు పార్టీలూ వచ్చే ఎన్నికల్లో కలసి వెళతారని అందరూ భావిస్తున్నారు. అదే నూరు శాతం జరిగే అవకాశమూ ఉంది.
తెలంగాణ ఎన్నికలతో....
ఇక తాజాగా బాబు కూటమిలోకి మరో పార్టీ కూడా జాయిన్ అయిందనే చెప్పుకోవాలి. తెలంగాణలో సీపీఐ, తెలంగాణ జనసమితి, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కలసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసందర్భంగా సీపీఐ సీనియర్ నేత నారాయణ, చంద్రబాబు నాయుడులు కలసి హైదరాబాద్ లో జరగిన పలు రోడ్ షోలలో పాల్గొన్నారు. నారాయణ స్వయంగా కూకట్ పల్లి లో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు, నారాయణల మధ్య చర్చలు జరిగినట్లు చెబుతున్నారు. వచ్చే ఏపీ ఎన్నికల్లో కూడా టీడీపీతో కలసి నడిచేందుకు సీపీఐ సిద్ధమయినట్లు చెబుతున్నారు. చంద్రబాబునాయుడు కాంగ్రెస్ తో కలవడం వల్లనే సీపీఐ బాబుకు దగ్గరయినట్లు తెలుస్తోంది.
సీపీఐ కలిసి వచ్చేందుకు.....
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోసీపీఐ మాత్రం జనసేనతో కలసి నడవాలని నిర్ణయించుకుంది. సీపీఐ,సీపీఎం, జనసేన వంటి పార్టీలు కూటమిగా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. అయితే ఇప్పటి వరకూ పవన్ దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. పైగా తాను ఒంటరిగా పోటీ చేస్తామంటున్నారు. ఈనేపథ్యంలో సీపీఐ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, కాంగ్రెస్ తో కలసి నడిచే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏపీలో తొలుత కమ్యునిస్టులు వైసీపీతో కలసి పనిచేశారు. అయితే రాష్ట్రపతి ఎన్నికల తర్వాత వాళ్లు జనసేన వైపు మొగ్గారు. మళ్లీ నాలుగు సీట్లు సాధించుకోవాలంటే టీడీపీతో కలసినడవడమే మేలన్న అభిప్రాయానికి సీపీఐ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండాలంటే సీపీఐని కలుపుకుని పోవడమే మేలని చంద్రబాబు భావిస్తున్నారు. మొత్తం మీద తెలంగాణ ఎన్నికల పుణ్యమా అని బాబుకు ఏపీలోకొత్త మిత్రులు దొరకుతున్నారు. ఏపీలో ఎన్నికల నాటికి మరెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.
- Tags
- andhra pradesh
- ap politics
- cpi
- indian national congress
- janasena party
- nara chandrababu naidu
- narayana
- pawan kalyan
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- నారాయణ
- పవన్ కల్యాణ్
- భారత జాతీయ కాంగ్రెస్
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
- సీపీఐ