ఆ పనులు జగన్ చేస్తే .....?

రాష్ట్రంలో రాజకీయాలు చాలా చిత్రంగా మారిపోయాయి. అధికార పార్టీ నాయకుడు, ప్రభుత్వాధినేత చంద్రబాబు ఏం చేసినా.. కరెక్టుగాను, విపక్షం ఏం చేసినా.. తప్పుగాను భలే రేంజ్లో రాజకీయాలు సాగుతున్నాయి. వినేవాడు ఉంటే.. చంద్రబాబు ఏమైనా చెబుతాడని ఇటీవల ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారు వ్యాఖ్యలు సంధించారు. ఇది నిజమే అనిపిస్తుంది.. తాజాగా జరిగిన వ్యవహారాలను చూస్తే.! రాష్ట్రంలో మూడు రోజుల క్రితం చంద్రబాబు వ్యవహరించిన శైలి.. నిజంగానే ఆక్షేపణీయం! ఆయన రెండు ప్రధాన తప్పటడుగులు వేశారు. ఒకటి.. రాష్ట్రం పెథాయ్ తుఫాన్ దెబ్బకు అతలాకుతలం అవుతుంటే.. ఆయన మాత్రం తగుదునమ్మా అంటూ.. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ సీఎంల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.
రాజేతో పలకరింపులతో.....
అది ఒక్కటే జరిగి ఉంటే... పెద్దగా చెప్పుకొవాల్సిన అవసరం ఉండేది కాదు. రాజకీయంగా ఇటీవల కాలంలో ముఖ్యంగా నంద్యాల ఉప ఎన్నికల తర్వాత నుంచి అంటే.. దాదాపు ఏడాది కాలంగా కేంద్రంలోని బీజేపీపై చంద్రబాబు నిప్పులు చెరుగుతున్నారు. బీజేపీ అంటేనే దేశానికి పాకిస్తాన్ కంటే శత్రువు అనే రేంజ్లో ఆయన ప్రచారం చేస్తున్నారు. అంతే కాదు, బీజేపీ నాయకుడు, నిన్న మొన్నటి వరకు కలిసి తిరిగిన మాజీ కేంద్ర మంత్రి ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇటీవల ఏపీ పర్యటనకు వస్తే.. చంద్రబాబు ఆయనకు ఎక్కడ స్వాగతం చెప్పాల్సి ఉంటుందోనని తప్పించు కున్నారు. మరి అలాంటి చంద్రబాబు.. ఇటీవల రాజస్థాన్లో అదే బీజేపీ నాయకురాలు ఆ రాష్ట్ర మాజీ సీఎం వసుంధర రాజేతో ఎంతో ముచ్చటగా మాట్లాడి,.. చేతులు పట్టుకుని, మురిపెంగా పలకరించుకుని దాదాపు అరగంట పాటు ఆమెతో చర్చలు జరిపారు.
అదే జగన్ చేసి ఉంటే....
నిజానికి కరడుగట్టిన బీజేపీ నాయకురాలుగా వసుంధరకు పేరుంది. మరి అలాంటి ఆమెతో బాబు కరచాలనం చేసి ముచ్చట్లు పెట్టుకోవచ్చా? అంతేకాదు, వెళ్లింది కాంగ్రెస్ కార్యక్రమమైనా.. చంద్రబాబు ఎక్కువగా గడిపింది మాత్రం బీజేపీ నేతలతోనే! మరి ఇదేనా ఆయన బీజేపీపైనా, మోడీపైనా చేసే 'ధర్మపోరాటం?'. బీజేపీ ముక్త్ భారత్ అంటూనే బీజేపీ నేతలతో కలిసి కదులుతున్న బాబు నైజంపై ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. అయితే,ఇక్కడే మరో విషయం స్పష్టంగా తెరమీదికి వస్తోంది. ఇదే పనిని జగన్ చేసి ఉంటే? అనే ది తాజాగా తెరమీదికి వస్తోంది. ఇక, టీడీపీ నాయకులు ఊరూవాడా రోడ్ల మీదికి వచ్చి శోకండాలు పెడుతూ యాగీ చేయరా? అనేది ప్రజల ప్రశ్న. తెలంగాణాలో కేసీఆర్ గెలిచారని, ఎవరో ఫ్లెక్సీలు పెడితే.. దానిని కూడా జగన్కు అంటగట్టి యాగీ చేసిన నాయకులు.. ఇలాంటి పనులు జగన్ చేస్తే.. ఊరుకుంటారా? !! ఏదేమైనా .. చంద్రబాబు రాజనీతిలో మరో పేజీ బాగా అర్ధమైంది!
- Tags
- andhra pradesh
- ap politics
- janasena party
- k.chandrasekharrao
- nara chandrababu naidu
- pawan kalyan
- telugudesam party
- vasundhara raje
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- కె. చంద్రశేఖర్ రావు
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- వసుంధర రాజే
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ