ఉండవల్లి రహస్యమిదే......!!

చంద్రబాబు నాయుడు ఈసారి కొంత దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను కూడా మూడు నెలలు ముందుగానే ప్రకటించి వారికి ప్రచారానికి తగిన సమయం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ఉండవల్లిలోని ఆయన నివాసంలో రహస్యంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండు రోజుల తర్వాత నుంచి ఈ కసరత్తు ప్రారంభమయిందని టీడీపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. మొత్తం ఐదు రకాల సర్వేలు తెప్పించుకుని చంద్రబాబు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. సర్వే నివేదికల ఆధారంగా తొలి జాబితాను సంక్రాంతికి ముందే ప్రకటించాలని చంద్రబాబు సుదీర్ఘ కసరత్తులే చేస్తున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
కొద్దిరోజులుగా కసరత్తు.....
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరుగుతున్న ఈ కసరత్తులో మంత్రి నారా లోకేష్ కీలకభూమిక పోషిస్తున్నారు. ఆయనే నియోజకవర్గాల నుంచి పార్టీ క్యాడర్ నుంచి సమాచారం తెప్పించి చంద్రబాబుకు నివేదికలు ఇస్తున్నారు. నియోజకవర్గంలో కులాల సమీకరణలతో పాటు ప్రత్యర్థి బలం బలహీనతలను కూడా జోడించి ఈ నివేదికలను లోకేష్ టీం రూపొందించినట్లు తెలుస్తోంది. దీంతోపాటు మరో నాలుగు సంస్థల ద్వారా కూడా చంద్రబాబు సర్వే చేయిస్తున్నారు. ఈ ఐదు నివేదికలను దగ్గరపెట్టుకుని చంద్రబాబునాయుడు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
నోటిఫికేషన్ కంటే ముందే....
ఫిబ్రవరి చివరి నాటికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. అందుకోసం అభ్యర్థుల తొలి జాబితాను జనవరి నెలలో సంక్రాంతికి ముందుగానే చంద్రబాబు విడుదల చేయనున్నట్లు సమాచారం. సాధారణంగా చంద్రబాబు అభ్యర్థుల ఎంపికపై మీనమేషాలు లెక్కిస్తారు. అన్ని రకాలుగా బేరీజు వేసుకున్న తర్వాతే నామినేషన్ కు ముందు మాత్రమే అభ్యర్థులను ప్రకటిస్తారు. కానీ ఈసారి మాత్రం ముందుగానే కొందరు అభ్యర్థులను ప్రకటించాలని రెడీ అయిపోయారు. 175 నియోజకవర్గాల్లో తొలుత 60 మంది అభ్యర్థుల జాబితాను చంద్రబాబు ప్రకటించే అవకాశముంది. అంటే ఎలాంటి వివాదాలు లేని నియోజకవర్గాలే తొలిజాబితాలో ఉండబోతున్నాయి.
చెబుతారు.. ప్రకటించరు...
ఇక ఫిబ్రవరి నాటికి 150 నియోజకవర్గాల పూర్తి జాబితాను రూపొందించుకోవాలని భావిస్తున్నారు. అయితే అభ్యర్థుల పేర్లు ఖరారయినప్పటికీ వాటిని బహిరంగంగా ప్రకటించకూడదన్న నిర్ణయానికి వచ్చారు. నేరుగా అభ్యర్థిని పిలిచి ప్రచారం చేసుకోవాలని, ప్రజల చెంతనే ఉండాలని చెబుతారు. దీనివల్ల రెబల్స్ బెడద, నియోజకవర్గంలో అసంతృప్తుల స్వరం విన్పించదని అధినేత ఆలోచన. నేతలు గోడ దూకకుండా ఉండాలని అభ్యర్థులను నిర్ణయించినా ప్రకటించకుండా గోప్యత పాటించనున్నారు. జనవరి నెలలో మాత్రం కొందరు అభ్యర్థుల పేర్లను వెల్లడించే అవకాశముంది. మొత్తం మీద చంద్రబాబు తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా కసరత్తులు చేస్తున్నారన్నది పార్టీ వర్గాల టాక్.
- Tags
- andhra pradesh
- ap politics
- candidates selecton
- janasena party
- nara chandrababu naidu
- nara lokesh
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- అభ్యర్థుల ఎంపిక
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- నారా లోకేష్
- పవన్ కల్యాణ్
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ