నోటు దెబ్బ : హుండీలన్నీ నిండిపోతాయి!
నోటు మీద పడిన వేటు దెబ్బకు జరిగే పరిణామాల్లో ఒక ప్రధానమైనదిగా జనంలో దానగుణం పెరుగుతుందనే అంచనాలు కూడా సాగుతున్నాయి. నల్లడబ్బును మార్చుకునే అవకాశం లేని చాలా మంది ఆ డబ్బును ధార్మిక కార్యక్రమాలకు అనధికారికంగా ఖర్చు చేసేయవచ్చునని, విరాళాలుగా, చందాలుగా ఇచ్చేయవచ్చునని అనుకుంటున్నారు. డబ్బును వృథా చేసుకునే బదులు ఏ దేవుడి హుండీలోనో వేసేస్తే కనీసం పుణ్యమైనా దక్కుతుందనే భావన నల్లడబ్బు కుబేరుల్లో ఏర్పడుతున్నదని నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో పల్లెల్లో ఉండే చిన్న చిన్న ఆలయాల నుంచి తిరుమల వంటి పెద్ద పుణ్యక్షేత్రాల వరకు హుండీ ద్వారా భక్తులు సమర్పించుకునే నగదు మొత్తాల విలువ అమాంతం పెరుగుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.
ధార్మిక కార్యక్రమాల్లో కూడా వివిధ స్వచ్ఛంద సంస్థలు లాంటి వాటికి ఇవ్వడంలోనూ జనానికి కొంత ఇబ్బంది ఉంటుంది. అక్కడ రసీదులు పుచ్చుకోవడం, అంత పెద్ద మొత్తాలు ఎవరు ఇచ్చారనేది రికార్డు కావడం జరుగుతుంది. మళ్లీ ఆ నగదుకు తామే జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది!
అదే దేవుడి హుండీ విషయానికి వస్తే.. అందులో ఎవరు ఎన్నికోట్లు వేసినా సరే... ఎవరెంత వేసారని అడిగే దిక్కుండదు. దేవుడికి సమర్పించుకుంటే ఆయన రూపేణా ధార్మిక కార్యక్రమాలకే ఖర్చవుతుంది గనుక.. పుణ్యం దక్కుతుందని నల్లడబ్బున్న వాళ్లు అటు వైపు ఎగబడే అవకాశం ఉంది. నగదును వైట్ గా మార్చుకునే అవకాశం లేనప్పుడు ఇలాంటి ప్రత్యామ్నాయాలు మినహా మరొక మార్గం వారికి లేదని పలువురు అంచనా వేస్తున్నారు.
రాబోయే రోజుల్లో ఆలయాల్లోని దేవుళ్లకు జాక్ పాట్ తగిలినట్టేనని, ఇబ్బడి ముబ్బడిగా హుండీ కానుకల రూపేణా డబ్బులు అనూహ్యంగా వచ్చి పడిపోతాయని జనం అనుకుంటూ ఉన్నారు.