హోదా దక్కని కారణంగా ఏపీ కోల్పోతుందేమిటి?

కేంద్రంలోకి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పబ్లిక్ ఫైనాన్స్ ., ఆర్ధిక అభివృద్ధి నమూనా వ్యూహాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ప్రణాళిక సంఘాన్ని., జాతీయ అభివృద్ధి మండలిని రద్దు చేస్తూ మోడీ నిర్ణయం తీసుకున్నారు. వాటికి ప్రత్యామ్నాయంగా నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేశారు. గతంలో ప్రణాళికా సంఘం ప్రణాళికా పరిణామం., ప్రాధాన్యతలు., పంపకాలు మొదలైన వాటిని నిర్ధారించేది. నీతి ఆయోగ్‌కు అందుకు భిన్నమైన విధివిధానాలు ఏర్పాటు చేశారు. ప్రణాళిక నిధుల ప్రసక్తే లేకుండా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకుండా అందరిని సమానంగా చూడాలని నీతి ఆయోగ్ నిర్ణయించింది. 14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రంగా ఎవరిని పరిగణించాల్సిన పని లేకుండా అయా రాష్ట్రాలకు ఉన్న వనరులు., అవసరాలను విడివిడిగా విశ్లేషించి రాష్ట్రాల వారీగా లోటుపాట్లను పూరించాలని నిర్ణయించింది.
ప్రత్యేక గ్రాంట్......
14వ ఆర్ధిక సంఘం కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పన్నుల ద్వారా సమకూరే ఆదాయంలో రాష్ట్రాలకు ఇచ్చే వాటాను 32శాతం నుంచి 42శాతానికి పెంచుతూ నిర్ణయించింది. దీంతో పాటు కొన్ని రాష్ట్రాలకు ఉన్న ఆర్ధిక లోటును భర్తీ చేసేందుకు ప్రత్యేక గ్రాంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ గ్రాంట్ గతంలో ప్రత్యేక హోదా ఉన్న 11 రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్, బెంగాల్., కేరళా రాష్ట్రాలకు ఇవ్వాలని నిర్ణయించారు. కేరళా., బెంగాల్‌కు ఏడాది పాటు ఈ గ్రాంట్ లభిస్తే ఆంధ్రాతో పాటు మిగిలిన 11 రాష్ట్రాలకు ఐదేళ్ల పాటు గ్రాంట్ లభిస్తుంది. ఇలా ఐదేళ్ల కాలంలో ప్రత్యేక గ్రాంట్ రూపంలో ఏపీకి రూ. 22,500కోట్లు లభిస్తాయి. అయితే ఇది ప్రత్యేకంగా ఇచ్చిన వెసులుబాటు కాదు. విభజనతో ఏర్పడే ఆర్ధిక లోటును భర్త చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని చట్టంలో పేర్కొనడంతో 11రాష్ట్రాల సరసన ఏపీ చేరింది.
చౌహాన్ ఫార్ములా......
ప్రణాళిక సంఘం రద్దు కావడానికి ముందు ఆర్ధిక సంఘం ప్రణాళికేతర అంశాలైన జీతాలు, వ్యయం., సంక్షేమం మొదలైన నిధులపై అజమాయిషీ చేసేది. ప్రణాళికా సంఘం., పంచవర్ష ప్రణాళికలు లేకపోవడంతో ప్రణాళికా నిధులు ఏమయ్యాయనే సందేహం వస్తుంది....ఈ సమస్య పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం మధ్య ప్రదేశ్ సిఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ రూపొందించిన ఫార్ములానే చౌహాన్ ఫార్ములాగా వ్యవహరిస్తున్నారు. ఈ ఫార్ములా ప్రకారం అందుబాటులో ఉన్న నిధుల్ని వివిధ రాష్ట్రాలకు జనాభా., పేదరిక స్థాయి., కొండ ప్రాంతం., షెడ్యూల్ కులాలు., గిరిజన జనాభా మొదలైన అంశాలను పరిగణలోకి తీసుకుని పంచాలని నిర్ణయించారు. ఈ నిధుల్ని రెండు పద్ధతుల్లో ఇవ్వాలని నిర్ణయించారు. మొదటి విభాగంలో సీఎఎస్పీ (సెంట్రల్లీ అసిస్టెడ్ స్టేట్), సీఈఏపీ ( సెంట్రల్లీ ఎక్స్టర్న ల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్)కింద నిధుల కేటాయింపు జరుగుతుంది. వీటిలో సీఎఎస్పీ కోటాలో ఇచ్చే నిధులే ఎక్కువ. అన్ని రాష్ట్రాలకు 60శాతం నిధుల్ని సీఎఎస్పీ ద్వారా ఇస్తారు. కానీ ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు 90శాతం నిధులు పొందుతాయి. ఈ 11రాష్ట్రాల జనాభా-విస్తీర్ణం ప్రాతిపదికన చూస్తే కేంద్రం వాటికి అదనంగా ఇచ్చే 30శాతం నిధుల ప్రభావం తక్కువే....
సీఏఈపీ అంటే ఏంటి.....?
కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులను వివిధ రాష్ట్రాలలో ప్రపంచ బ్యాంకు లేదా ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి తెచ్చిన రుణాలతో అమలు చేస్తుంటుంది. అలాంటి సందర్భాల్లో 60శాతం ఖర్చును కేంద్రం భరిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు 40శాతం భరిస్తాయి. అదే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో 90శాతం ఖర్చు భారాన్ని కేంద్రం., 10శాతం రాష్ట్రాలు భరిస్తాయి. ప్రత్యేక హోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటి వరకు రెండే రెండు ఈఏపీ లను అమలు చేశారు. వ్యవసాయ రంగంపై 1998-2004 మధ్య కాలంలో ఒక ప్రాజెక్టు., 2006-13/14 మధ్య ప్రపంచ బ్యాంకు నిధులతో మరో ప్రాజెక్టును అమలు చేశారు. మరోవైపు కేంద్రంతో సంబంధం లేకుండా గతంలో రాష్ట్రాలు నేరుగా ప్రపంచబ్యాంకు నుంచి అప్పులు తెచ్చుకునేవి. అయితే ఆ ఖర్చు మొత్తాన్ని రాష్ట్రాలే భరించాల్సి వచ్చేది. ఈ అప్పులకు సార్వభౌమత్వ భరోసాను మాత్రమే ఇచ్చేది. అయితే బయటి దేశాల్లో పెరిగిన వడ్డీ రేటు., అంతర్జాతీయ మార్కెట్ల ఒడిదుడుకులు., కఠినమైన షరతులు.,కార్యక్రమాల్లో నిర్దిష్టత., పనులు పూర్తి కాకుంటే జరిమానాలకు భయపడి రాష్ట్రాలు నేరుగా ప్రపంచ బ్యాంకు రుణాలను తీసుకోవడం మానేశాయి.
ఏపీకి ప్రత్యేక హోదా పరిస్థితి ఏంటి....?
రాష్ట్ర విభజన సమయానికి దేశంలో ప్రత్యేక హోదా అమలులో ఉంది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలుగా వాటిని పిలవడం లేదు. కొండ ప్రాంత రాష్ట్రాలుగా., సరిహద్దు రాష్ట్రాలుగా కొన్ని సదుపాయాలను పొందుతున్నాయి. గతంలో హోదా ఉన్న రాష్ట్రాలు గాడ్గిల్-ముఖర్జీ ఫార్ములా ప్రకారం 30శాతం ప్రణాళిక నిధుల్ని పొందేవారు. ఇప్పుడు చౌహాన్ ఫార్ములా ప్రకారం నిధులు పొందుతున్నారు. చౌహాన్ ఫార్ములా ప్రకారం కొండ ప్రాంతాలు, సరిహద్దు రాష్ట్రాల్లో 90శాతం సీఏఎస్‌పీ కోటాలో పొందుతారు. జూన్ 2014 తర్వాత దేశంలో ప్రత్యేక హోదా విధానాన్ని రద్దు చేసినందున ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్రం మొండికేస్తూ వచ్చింది. ఈ విషయాన్ని 2015 చివరి వరకు కేంద్రం మరుగున పెడుతూ వచ్చింది. మరోవైపు ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు మాత్రం నేడోరేపో తీపి కబురు వస్తుందని ప్రజల్ని నమ్మించారు. ప్రత్యేక హోదానే రద్దు చేసినపుడు ఏపీలో కొత్తగా హోదా అమలు చేయడం అసాధ్యమని సీఎఎఎస్సీలో ఏపీకి రావాల్సిన 30శాతం అదనపు నిధులైనా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేంద్రాన్ని అభ్యర్ధిస్తూ వచ్చారు. అయితే బడ్జెట్లో అందుకు ఎలాంటి అవకాశం లేదని ఆ ప్రతిపాదన కూడా కేంద్రం బుట్టదాఖలు చేసింది. ఏపీకి వెసులుబాటు ఇస్తే., మిగిలిన రాష్ట్రాలు కూడా అడుగుతాయని., హోదాను రద్దు చేసిన ప్రధాన ఉద్దేశ్యం నీరుగారుతుందని ఢిల్లీ పెద్దలు చెప్పడం ప్రారంభించారు. చివరకు సీఎఎస్పీ కోటాలో హోదా లేకపోవడం ఏపీ కోల్పోయే 30శాతం నిధులు సీఈఏపీ రూపంలో ఇవ్వాల్సిందిగా చంద్రబాబు ప్రతిపాదించారు. సీఈఏపీ అన్ని రాష్ట్రాలకు వేర్వేరుగా ఉన్నందున బడ్జెట్లో అదనపు కేటాయింపులు అక్కర్లేదని ప్రతిపాదించడంతో కేంద్రం దానికి అంగీకరించింది. అయితే దీనికి ఎలాంటి చట్టబద్దత లేదు. నిజానికి సీఈఏపీ ద్వారా చేపట్టే ప్రాజెక్టులకు 5నుంచి 7 ఏళ్ల మారిటోరియం పొందుతాయి. అంటే అప్పు తీసుకున్న తర్వాత 5 నుంచి ఏడేళ్ల వరకు చెల్లింపులు జరగవు. ఆ తర్వాత 10-15ఏళ్ల కాలవ్యవధిలో అప్పులు తీర్చాల్సి ఉంటుంది.
అప్పు చేసినా...తప్పు లేదు.....
ఇక రెండోది కేంద్రమైనా., రాష్ట్రమైనా ఎఫ్ ఆర్ బీఎం ( ఫైనాన్షియల్ రెగ్యులేషన్ అండ్ మేనేజ్ మెంట్) కు లోబడే ఏటా ఎంత మేరకు అప్పు చేయవచ్చనేది నిర్ణయిస్తారు. సాధారణంగా జీడీపీ., లేదా రాష్ట్ర జీఎస్‌డిపీలో 3.5శాతం వరకు అప్పుకు పరిమితిగా పరిగణిస్తారు. ఈ నిబంధనను కేంద్రం అతిక్రమించినా రాష్ట్రాలు మాత్రం ఈ పరిధి దాటడానికి వీల్లేదు. సమాఖ్య వ్యవస్థ నిబంధనల మేరకు రుణాలపై ఈ పరిమితి విధించారు. ఓవైపు తీవ్రమైన ఆర్ధిక లోటు మరోవైపు అభివృద్ధి లేమితో సతమతమవుతున్న కొత్త రాష్ట్రానికి అదనంగా నిధులు ఇచ్చేందుకు కేంద్రం ఓ ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. దీని ప్రకారం సీఎఎస్పీలో కోల్పోయే మొత్తానికి ఈఏపీ కోటాలో ఏపీ రుణం తీసుకుంటే దానిని కేంద్రం చెల్లిస్తుంది. స్థూలంగా చూస్తే రాష్ట్రం తీసుకునే రుణాన్ని కేంద్రం టేకోవర్ చేస్తుంది. ఉదాహరణకు ఏపీ ప్రతి ఏటా 10వేల కోట్లు సీఎఎస్పీకింద ఖర్చు చేస్తుంది. ఇందులో 6వేల కోట్ల రుపాయలు కేంద్ర ప్రభుత్వ వాటా అయితే నాలుగు వేల కోట్లు రాష్ట్రం చెల్లిస్తుంది. ఒకవేళ ఏపీకి ప్రత్యేక హోదా ఉంటే 9000 వేలకోట్లు కేంద్రం., వెయ్యి కోట్లు రాష్ట్రం చెల్లించాల్సి వచ్చేది. హోదా లేకపోవడం వల్ల ఏపీ కోల్పోయే 3వేల కోట్లను సీఈఏపీ కింద రాష్ట్ర ప్రభుత్వం రుణం తీసుకుంటే దానిని తీర్చే బాధ్యత కేంద్రం తీసుకుంటుంది. ఇలా 5 నుంచి ఏడేళ్ల పాటు ఏటా 3వేల కోట్ల రుపాయల అదనపు నిధులు రాష్ట్రానికి వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సీఈఏపీద్వారా రాబోయే 5-7 ఏళ్లలో ఏడాదికి 3వేల కోట్లు ఏపీ ఖజానాకు చేరతాయి.
ఇంతకీ సీఈఏపీలు ఏటా లభిస్తాయా? ...., నష్టం భర్తీ సరే......రాయితీలు ఏటా లభిస్తాయా? .......తర్వాత భాగంలో
- Tags
- ప్రత్యేక హోదా