హాల్ టిక్కెట్లు రాకపోవడంలో కొత్త కోణమిదే...

కళాశాల యాజమాన్యం, ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం వందలాది మంది విద్యార్థుల భవిష్యత్ ను అంధకారంలోకి నెట్టింది. హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఉన్న వాసవి కాలేజీలో దాదాపు 300 మంది విద్యార్థులకు హాల్ టిక్కెట్లు అందలేదు. బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. హాల్ టిక్కెట్లు అందకపోవడంతో మంగళవారం విద్యార్థులు ఆందోళన చేశారు. అయినా ఫలితం లేదు. బుధవారం పరీక్షకు విద్యార్థులను అనుమతించలేదు. దీంతో 300 మంది విద్యార్థుల భవిష్యత్ అంధకారంలోకి నెట్టివేసినట్లయింది.
ఐదు లక్షలు లంచం అడిగారట....
వాస్తవానికి సూర్యపేటలో వాసవి కళాశాల ఉండేది. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ కళాశాలను హైదరాబాద్ వనస్థలిపురానికి యాజమాన్యం తరలించింది. ట్రాన్స్ ఫర్ ఉత్తర్వులను కూడా ఆర్ఐఓ నుంచి పొందింది. హాల్ టిక్కెట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే లాగిన్ ఐడీ కళాశాలకు ఇవ్వాల్సి ఉంది. లాగిన్ ఐడి ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు అధికారులు తిరస్కరించారట. తమకు ఐదు లక్షలు లంచం ఇస్తేనే లాగిన్ ఐడి ఇస్తామని చెప్పడంతో కళాశాల యాజమాన్యం ఆలోచనలో పడిందంటున్నారు. అలా ఇవ్వకుంటే విద్యార్థికి ఐదు వేల రూపాయల లేట్ ఫీజు చెల్లించాలని చెప్పారట. కళాశాల యాజమాన్యం కూడా ఐదు లక్షలు ఇచ్చేందుకు ఇష్టపడలేదు. చివరి నిమిషంలో ఇస్తారులే అన్న నమ్మకంతో ఉంది. చివరకు విద్యార్థుల జీవితాలు బలయి పోయాయి. ఇంటర్ బోర్డు అధికారులు, కళశాల యాజమాన్యం కలిసి చేసిన నిర్లక్ష్యమే విద్యార్థులకు శాపంగా మారింది. కేవలం లంచాలకు ఆశపడి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారని ఇంటర్ బోర్డు అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అశోక్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు హాల్ టిక్కెట్లు అందివ్వలేకపోయిన కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెడతామన్నారు. ఇప్పుడు హాల్ టిక్కెట్లు రాకపోవడానికి అసలు కారణాన్ని యాజమాన్యం బయటపెట్టింది. ఇప్పుడు ఎవరిపై చర్యలు తీసుకోవాలన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే విద్యార్థులకు విద్యాసంవత్సరం వృధా కాకుండా అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీలో రాసేందుకు అనుమతిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఎంసెట్ కు కూడా హాజరయ్యే వెసులుబాటు కల్పిస్తామన్నారు. మొత్తం మీద వాసవీ కళాశాల విద్యార్థులకు హాల్ టిక్కెట్లు రాకపోవడానికి కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంతో పాటు అధికారుల లంచగొండితనం కూడా కారణమనే చెప్పొచ్చు.