స్వర్ణ భారతిలో ఏం చేస్తున్నారంటే...?

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. ఇటీవలి కాలంలో వెంకయ్య నాయుడు సొంత ట్రస్టు ద్వారా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. మొదట నెల్లూరు జిల్లాకు పరిమితమైన వెంకయ్య నాయుడు కుటుంబానికి చెందిన స్వర్ణభారత్ ట్రస్టు ఆయన కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విజయవాడ సమీపంలోని ఆతుకూరులో కూడా ప్రారంభించారు. వెంకయ్యనాయుడు జాతీయ స్థాయిలో ఇమేజ్ ఉన్న నాయకుడు..... ఆయనకు కుటుంబ వ్యాపారాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. హిందీ., ఇంగ్లీష్., తెలుగు భాషల్లో అనర్ఘళంగా ఉపన్యసించగల వెంకయ్య నాయుడు చాలా సందర్భాల్లో వివాదారహితంగానే వ్యవహరిస్తారనే పేరుంది.
నిన్న మొన్నటి వరకూ...వెంకయ్యపైనే ఆశలు...
అయితే ప్రత్యేక హోదా విషయంలో పార్లమెంటు సాక్షిగా జరిగిన పోరాటంలో వెంకయ్య చూపిన చొరవ ఆంధ్రాలో ఆయనకు గొప్ప ఇమేజ్ తెచ్చిపెట్టింది. అధికార పార్టీ నేతలే ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు లోక్‌సభ అమోదం పొందిన ఏపీ పునర్విభజన బిల్లుకు సవరణల కోసం రాజ్యసభలో చివరి వరకు పోరాడారు. అయితే ఆయన పెట్టిన సవరణలు ఏవి డివిజన్‌కు వెళ్లకపోవడాన్ని పక్కన పెడితే రాజ్యసభలో ఆయన చూపిన ఆరాటం మాత్రం ఏపీ ప్రజలకు గుర్తుండి పోయింది. హైదరాబాద్‌ను కోల్పోయి., రాజధాని కూడా లేని దుస్థితిలో ఏర్పడుతున్న కొత్త రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని వెంకయ్య నాయుడు పోరాడితే ప్రధాని మన్మోహన్ ఐదేళ్లు హోదా ఇస్తామంటే., పదేళ్లు., పదిహేనేళ్లు కావాలని వెంకయ్య నినదించారు. వెంకయ్య ఏం మాట్లాడుతున్నారో కూడా తెలీని స్థితిలో ప్రస్తుత క్యాబినెట్ సహచరుడు సుజనా చౌదరి కూడా ఆయన ప్రసంగానికి పదేపదే అడ్డుతగులుతూ వచ్చారు. రాష్ట్రానికి కావాల్సిన సవరణల విషయంలో వెంకయ్య చేసిన ప్రతిపాదనల్లో చాలా అంశాల్లో ఓటింగ్ జరగడానికి ., డివిజన్‌కు వెళ్ళడానికి వీలున్నా ఆంధ్రాకు చెందిన టీడీపీ., కాంగ్రెస్ ఎంపీలు ఏ మాత్రం చొరవ చూపలేకపోయారు. దీనికితోడు తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన సభ్యులు సభ జరిగినంత సేపు గందరగోళం., ప్లకార్డులు ప్రదర్శన చేస్తూనే ఉన్నారు. రాజ్యసభలో సభ్యుల ముందస్తు అవగాహనతో ఏం జరిగిందో తెలియదు కాని., వెంకయ్య నాయుడుకు మాత్రం ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో గట్టి నిబద్ధత ఉందని అంతా నమ్మారు.
వెంకయ్యదే బాధ్యత.......
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం., వెంకయ్యనాయుడుకు మంత్రి పదవి దక్కడం ఓ ఎత్తైతే ప్రత్యేక హోదా విషయంలో జరిగిన పరిణామాలకు వెంకయ్య కూడా బాధ్యత వహించాల్సి వచ్చింది. పదవిలోకి వచ్చిన తొలినాళ్లలో హోదా వస్తుందంటూ నమ్మబలికిన వెంకయ్య నాయుడు రెండేళ్ల తర్వాత హోదా రాదంటూ చావు కబురు చల్లగా చెప్పారు. ఆ నిర్ణయం వెంకయ్య నాయుడు స్వయంగా తీసుకోకపోయినా ఆయన ప్రతిష్టను మాత్రం బాగా మసకబార్చింది. రాష్ట్రానికి వచ్చిన ప్రాజెక్టులు ఆయన కృషి వల్లేనని బీజేపీ., టీడీపీలు ప్రచారం చేసినా, ఇతర పార్టీలు మాత్రం దానిని విశ్వసించలేదు.
విస్తరించిన స్వర్ణభారతి.....
ప్రత్యేక హోదా ప్రతిపాదన అటకెక్కుతున్న సమయంలోనే వెంకయ్య నాయుడు కుమార్తె ఆధ్వర్యంలో నడుస్తున్న స్వర్ణభారత్ ట్రస్టు సేవా కార్యక్రమాలను విస్తరించడం ప్రారంభించారు. ఇదే సాదాసీదాగా కాకుండా భారీ ఎత్తున కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా బడా సంస్థల సహకారంతో విస్తరించడం మొదలైంది. మొదట విజయవాడ ఏడాది తర్వాత హైదరాబాద్‌లో ట్రస్టు సేవలు ప్రారంభమయ్యాయి. ఇక ట్రస్టు ఆధ్వర్యంలో తరచూ జరిగే కార్యక్రమాలకు ఢిల్లీ నుంచి వెంకయ్యనాయుడు., కేంద్రమంత్రులు., ముఖ్యమంత్రి ఇలా ఎవరో ఒకరు హాజరవుతూనే ఉన్నారు. ట్రస్టు కార్యక్రమాల్ని పరిశీలించేందుకు వెంకయ్య నాయుడు వచ్చే సమయంలో కొన్ని సందర్భాల్లో ప్రత్యేక విమానాల్లో కూడా రాకపోకలు సాగించడం విశేషం. ఈ పరిణామాలన్నింటిని చూసే పవన్ కళ్యాణ్ వెంకయ్యపై విమర్శలు గుప్పించినట్లు అర్ధమవుతుంది. నిజానికి వెంకయ్యనాయుడు సొంత ట్రస్టు కార్యక్రమాలు లాభరహితంగా చేస్తున్నా అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఆయన వైఖరిలో వచ్చిన మార్పు ప్రత్యర్ధులకు కలిసొచ్చింది.