సోనియాకి ఏమైంది?

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కి ఏమైంది? సోనియా అనారోగ్యంగా ఉన్నారా? లేక రాజకీయాలపై అనాసక్తిని చూపుతున్నారా? టెన్ జన్ పథ్ దాటి ఎందుకు సోనియా రావడం లేదు. ఇవన్నీ కాంగ్రెస్ కార్యకర్తల్లో దేశవ్యాప్తంగా తలెత్తుతున్న ప్రశ్నలు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతుంటే సోనియాగాంధీ ప్రచారానికి ఎందుకు రాలేదంటున్నారు. ముఖ్యంగా పంజాబ్, ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాల్లో కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ కు అండగా ఉండాల్సిన సమయంలో సోనియా ఎందుకు మౌనంగా ఉన్నారు.
ప్రచారానికి దూరం....
మూడు నెలల క్రితం ఉత్తరప్రదేశ్ అమేధీ నియోజకవర్గంలో పర్యటించిన సోనియా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. తర్వాత పార్లమెంటు సమవేశాలకు కూడా హాజరయ్యారు. గోవా, పంజాబ్ లో ప్రచారం ముగిసింది.ఈ రాష్ట్ర ఎన్నికల్లో ప్రచారంలో సోనియా పాల్గొనలేదు. కేవలం రాహుల్ ఒక్కరే ప్రచార బాధ్యతను నెత్తినేసుకున్నారు. ఇక మిగిలింది అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కూడా సోనియా ఇంతవరకూ కన్పించలేదు. రాకపోవచ్చు కూడా. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రాహుల్, ప్రియాంకలే ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్నరాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో కూడా సోనియా ప్రచారం చేయకపోవడంతో కాంగ్రెస్ వర్గాలు డీలా పడ్డాయి. టెన్ జన్ పధ్ నుంచి సూచనలు, అభ్యర్ధుల ఎంపికలో మాత్రమే సోనియా పరిమితమయ్యారని కాంగ్రెస్ సీనియర్ నేతలు చెబుతున్నారు. ప్రచారంలో ఎందుకు పాల్గొనడం లేదన్నదానికి ఎవరి వద్దా సమాధానం లేదు.
రాహుల్ కోసమేనా?...
అయితే సోనియా ప్రచారం చేయకపోవడానికి మరొక కారణం ఉందంటున్నారు. రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పజెప్పటానికే తాను ఇంటికే పరిమితమయ్యారని కొందరు చెబుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాహుల్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. క్షణం తీరిక లేకుండా రోడ్ షో లు నిర్వహిస్తున్నారు. భవిష్యత్ రాహుల్ దే కాబట్టి ఐదు రాష్ట్రాల ప్రచార బాధ్యతను రాహుల్ పై సోనియా పెట్టారని అంటున్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రాహుల్ కి అధికారికంగా పగ్గాలు అప్పచెప్పాలని సోనియా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో సోనియా గాంధీ పాల్గొనడకపోవడంపై మాత్రం కాంగ్రెస్ శ్రేణుల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
- Tags
- సోనియా గాంధీ