సెక్షన్ 30 : ఓ రకం ఎమర్జెన్సీకి సంకేతం కాదా?
జనం అభిప్రాయాల పీక నొక్కేలాగా.. ఇందిరాగాంధీ ఈ దేశంలో విధించిన ఎమర్జన్సీ గురించి ఇప్పటికీ అడపాదడపా చర్చలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లోకి తెచ్చిన సెక్షన్ 30 అనేది ఏమిటి? విపక్షాలు ఆందోళన చెందుతున్న ప్రకారం.. గమనిస్తే ఇది ఒక రకం ఎమర్జన్సీ సంకేతం లాంటిదే ఏమో అనే అనుమానాలు పలువురికి కలుగుతున్నాయి. సెక్షన్ 30 అనేది ప్రభుత్వ వ్యవహారాలు, పోకడలు, నిర్ణయాలు దారి తప్పుతున్నప్పుడు వాటికి వ్యతిరేకంగా గళమెత్తగల ఉద్యమాల పీక నొక్కే ప్రయత్నం లాగా కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో సభలు,సమావేశాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదంటూ సెక్షన్ 30ను అమల్లోకి తెస్తున్నట్లు డీజీపీ సాంబశివరావు ప్రకటించారు. సెక్షన్ 30 అమల్లో ఉందనే నెపంతో ప్రజలు తమ సమస్యలపై శాంతియుతంగా నిరసనలు తెలియజేయడానికి కూడా ప్రభుత్వం, పోలీసులు అనుమతించడం లేదంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తీవ్రంగా విమర్శిస్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కార్పొరేట్ కంపెనీల రాకకు వ్యతిరేకంగా ప్రజాందోళనలు తారస్థాయిలో జరుగుతున్నాయి. దివిస్, గోదావరి ఆక్వాపార్క్ వంటి కంపెనీలకు ఈ దెబ్బ ఘాటుగానే తగులుతోంది. ఆ ప్రజా ఉద్యమాలను పోలీసులు ఎప్పటికప్పుడు అణిచి వేస్తూనే ఉన్నారు. తాజాగా అసలు ఆందోళనలు, ఉద్యమాలే జరగకుండా సెక్షన్ 30 రాష్ట్రమంతా అమల్లోకి తెస్తున్నట్లు పోలీసు బాస్ ప్రకటించారు. దీనిని వామపక్షాలు నిశితంగా విమర్శిస్తున్నాయి.
ఇలా జనం గొంతెత్తి విమర్శించగల స్వేచ్ఛే లేకుండా చేసేయడాన్ని ఒక రకం ఎమర్జన్సీ పోకడల్లాగానే పలువురు భావిస్తున్నారు. రాజ్యాంగం కల్పించే ప్రాథమిక హక్కుల్ని ప్రభుత్వం కాలరాస్తున్నట్లుగా ఈ నిర్ణయం ఉన్నదంటూ వామపక్షాలు విమర్శిస్తున్నాయి. మరి తనది చాలా పారదర్శకమైన పాలన అని చెప్పుకునే నారా చంద్రబాబునాయుడు .. ప్రజల నోటికి తాళం వేసే ఇలాంటి సెక్షన్ ప్రయోగం విషయాన్ని పునరాలోచిస్తారా లేదా? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా ఉంది.