‘సర్వే’ జనా: సంపాదనమస్తు
అందరూ బాగుండాలి. సంపన్నులు కావాలి. సకల సంపదలతో తులతూగాలి. సర్వసౌఖ్యాలు అనుభవించాలి. ఇది ఇండియన్ ఫిలాసఫీ. పొలిటికల్ సైకాలజీ కూడా అదే. అందరినీ అందలం ఎక్కిస్తాం. అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తామన్న ప్రణాళికలతోనే నాయకులు పగ్గాలు చేపడుతున్నారు. 2019 నాటికి ఆంధ్రప్రదేశ్ లో తలసరి ఆదాయం పదిలక్షల రూపాయలకు చేర్చాలనేది ఏపీ సీఎం చంద్రబాబునాయుడి స్వప్నం. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అత్యధిక ఆదాయం కల సంపన్న రాష్ట్రంగా మార్చాలన్నది కేసీఆర్ ఆశయం. దేశంలోని రైతన్నల ఆదాయాన్ని రానున్న అయిదేళ్లలో రెట్టింపు చేయాలన్నది మోడీ మార్గనిర్దేశం. ఇవన్నీ దార్శనిక ద్రుక్పథంతో నాయకులు చేస్తున్న ఆలోచనలు. అందుకోవచ్చు లేకపోనూ వచ్చు. అయితే ఏం కోరుకుంటామో దానిని అరచేతిలో పెట్టి అందించే అక్షయ పాత్రలు మనకు ఈ మధ్య కాలంలో సిద్ధమైపోతున్నాయి. ఊరించే విజయాలను, మైమరపించే స్వప్నాలను ప్రియదర్శిని వంటి సర్వేల దర్పణంలో సాక్షాత్కరింప చేస్తున్నారు. ఆహా ఏమి భాగ్యం. అరచేతి స్వర్గం.
సత్యాసత్యాల సంగతెలా ఉన్నా.. తమ స్పాన్సర్స్ లక్ష్యాలకు అనుగుణంగా లెక్కల వడ్డింపులు చేసేందుకు మాత్రం రంగం సిద్ధం చేస్తున్నారు సర్వేక్షకులు. సర్వేజనా: సుఖినో భవన్తు అన్నట్లుగా ‘యద్భావం తద్భవతి’ ఎవరు ఏది కోరుకుంటే అది వండి వార్చేస్తున్నారు. ‘వేర్ దేర్ ఈజ్ ఏ విల్ ..దేర్ ఈజ్ ఏ వే’ కలలే కదా కనండి..కాసింత ఖర్చవుతుందంతే. ఎందుకు నెగ్గుతాం. ఎలా నెగ్గుతాం. ఏ సామాజిక వర్గం మనవైపు ఎందుకుమొగ్గుతోంది. ఇలాంటి శాస్త్రీయ విశ్లేషణలతో సహా తార్కికంగా గెలుపు గుర్రాల కళ్లాలను మనకు అప్పగించేందుకు అంతర్జాతీయ స్థాయి నుంచి లోకల్ వరకూ సర్వేక్షకులు సిద్ధంగా ఉన్నారు. వారి సేవలకు ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాల్లో డిమాండ్ పెరుగుతోంది.
మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు ఇప్పటికే ఒక దఫా సర్వేలు జరిపించేశాయి. ఎవరైతే సర్వేలు జరిపించుకున్నారో వారికే ఓటర్లు పట్టం గట్టబోతున్నారంటూ నికార్సుగా తేల్చేశాయి సర్వేలు. కేసీఆర్ దెబ్బకు ఠారెత్తిపోతున్న మూడు కుంపట్లు,ఆరు నాయకత్వాల కాంగ్రెస్ తెలంగాణ నాయకత్వం చేయించుకున్న సర్వేలో 75 సీట్లు హస్తం ఖాతాలో జమ కానున్నట్లు తేలిందని పీసీసీ అధ్యక్షుడే స్వయంగా ప్రకటించేశారు. అంటే ఇక రెండేళ్లు ఆగితే అధికారం తమదేననేది వారి సర్వే సారాంశం. అధికార టీఆర్ఎస్ ఒక ప్రఖ్యాత జాతీయ సంస్థద్వారా చేయించుకున్న సర్వేలో 88 సీట్లు టీఆర్ఎస్ కు లభిస్తాయని తేలిందట. లీకుల ద్వారా పత్రికల్లో వచ్చిన సమాచారం ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తోంది. అంత ఉద్యమ వేడిలోనూ రాష్ట్రం ఏర్పడ్డాక లభించిన 63 సీట్ల విజయం కంటే 2019 లో లభించనున్న విజయమే పెద్దది కాబోతోందన్న మాట. ఇక అటు ఆంధ్రప్రదేశ్ లో 2050 వరకూ తెలుగుదేశమే అధికారంలో ఉండాలని చెబుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా చేసుకున్న సర్వేలో సైతం 2019లో 125 సీట్లవరకూ టీడీపీకి వస్తాయని తేలిందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. 30 మంది ప్రస్తుత ఎమ్మెల్యేల టిక్కెట్లు మారిస్తే ఈ ఫిగర్ కు ఎటువంటి ఢోకాలేదనేది టీడీపీ వర్గాల విశ్వాసం. . తమ ఖాతాలో 112 సీట్లు వస్తాయని పార్టీ మూడునెలల కు ఒకసారి అంచనా వేయిస్తోందని ప్రతిపక్ష వై.సి.పి నమ్మకంగా చెబుతోంది. తాజా సర్వేలో ఈ సంఖ్య 120 కి చేరిందని తమను అడిగినవారికి, అడగని వారికి ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తాజాగా లగడపాటి రాజగోపాల్ చేసినట్లుగా చెబుతున్న సర్వే సంఖ్యలను కూడా తమ అంచనాకు ఆధారంగా చూపిస్తున్నారు. మొత్తం అన్ని రాజకీయ పక్షాలూ అధికారం ఖాయమనే అంటున్నాయి, మరి ప్రతిపక్షంలో కూర్చొనేవారెవరో ఒక్క అంచనాలోనూ తేలడం లేదు. సర్వేలకు గిరాకీ పెరగడంతో ఆయా సంస్థలకు నాలుగు డబ్బులు గిట్టుబాటవుతున్నాయి. లోకల్ గా నియోజకవర్గ స్థాయి సర్వేకి 25వేల రూపాయలు , 100 నియోజకవర్గాల పరిధిలో పార్టీకి సర్వే చేసి పెట్టాలంటే పాతికలక్షల రూపాయలు ఛార్జీగా వసూలు చేస్తున్నారు. అదే జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న నీల్సన్, చాణక్య వంటి సంస్థల కొలాబరేషన్ తో సర్వే అయితే మాత్రం కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయల వరకూ ఖర్చవుతోంది. శాంప్లింగ్ సైజును బట్టి ఈ ఖర్చులో కొంత అటు ఇటు ఉంటుంది. ఈ జోరు మరో రెండేళ్లు కొనసాగే పరిస్థితే కనిపిస్తోంది. ఈ అంచనాల వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లడం ఖాయం. సంపాదించుకున్నవాడికి సంపాదించుకున్నంత లాభం తెచ్చే పెట్టుబడి లేని తెలివైన వ్యాపారం. ‘అంకెల గడి..గణాంకాల గారడీ.. అంచనాల సుడి..అద్భుతాల ఒడి’..రండి బాబూ రండి..పైకాన్ని బట్టే ఫలితం ..పైసలు చెల్లిస్తే తిరగబడుతుంది మీ అద్రుష్టం..నోట్లు కొట్టండి ..సీట్లు పట్టండి...