సర్వధా శ్రేయస్సే : ఎవరి కోణంలో వారు చూస్తున్నారు!
![సర్వధా శ్రేయస్సే : ఎవరి కోణంలో వారు చూస్తున్నారు! సర్వధా శ్రేయస్సే : ఎవరి కోణంలో వారు చూస్తున్నారు!](https://telugu.telugupost.com/wp-content/uploads/sites/2/2016/10/modi.jpg)
పెద్ద నోట్లను నిషేధిస్తూ మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల ఫలితాలు బహుముఖంగా ఉండబోతున్నాయి. నిజానికి సామాన్యులు ఊహించని, మన ఊహకు అందే అవకాశం కూడా లేని అనేక కోణాల్లో ఈ నిర్ణయం యొక్క ప్రభావం ఉండబోతున్నదని అర్థమవుతోంది. విపక్షాలు సామాన్యుల కష్టాల గురించి ప్రస్తావిస్తూ మోదీ హఠాత్ నిర్ణయం గురించి విమర్శిస్తున్నప్పటికీ ఇలాంటి నిర్ణయం తప్ప , పరిస్థితుల్ని చక్కదిద్దడానికి వేరే గత్యంతరం లేదని ఇబ్బందులు పడుతున్న ప్రజలు కూడా ఆమోదిస్తున్నారు.
నోట్ల నిషేధం గురించి హోం మంత్రి రాజ్నాధ్ సింగ్ మాట్లాడుతూ పాకిస్తాన్ కు ఈ నిర్ణయంతో కంగారు పుడుతున్నదనే కోణంలోనే ప్రధానంగా వ్యాఖ్యానించారు. దేశంలో చెలామణీ అవుతున్న నకిలీ కరెన్సీ గరిష్టంగా పాకిస్తాన్ లోనే ముద్రణ అవుతున్నదని, ఆ నకిలీ కరెన్సీ ని ఉగ్రవాదులకు అందివ్వడం ద్వారా భారత దేశంలో శాంతి భద్రతలపరంగానూ, ఆర్థికంగానూ కూడా అస్థిరత సృష్టించడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నదని, తాజాగా మోదీ నిర్ణయంతో పాకిస్తాన్ భయపడుతున్నదని హోం మంత్రి విశ్లేషించారు.
అదే సమయంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాత్రం.. దేశంలో అంతర్గతంగా ఉన్న అవినీతి మరియు నల్లడబ్బు కోణాన్నే ప్రధానంగా స్పృశించడం విశేషం. ఈ నిర్ణయంతో దేశంలో ఉన్న అవినీతి పరులంతా వణికిపోతున్నారనేది అరుణ్ జైట్లీ చెబుతున్న మాట. ప్రజల జీవనశైలి, ఖర్చు పెట్టే అలవాట్లలో కూడా ఇలాంటి నిర్ణయం మార్పు తెస్తుందని జైట్లీ ఆర్థిక కోణంలో విశ్లేషిస్తున్నారు.
అదే చంద్రబాబునాయుడు లాంటి వారి విషయానికి వస్తే.. పెద్ద నోట్ల వల్ల సాధ్యం కాగల రాజకీయ అవినీతి మీద మాత్రమే ఆయన దృష్టి ఉంది. ఎన్నికల సమయంలో పెద్దనోట్లతో ప్రజలను ప్రలోభ పెడుతున్నారనే కోణంలోనే ఆయన ఎక్కువగా మాట్లాడుతున్నారు. నిషేధం బాగుంది గానీ.. 2000 రూపాయల నోట్ల ను తీసుకురావడం అవసరమా? అంటూ చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు.
నిజానికి నోట్ల హఠాత్ నిషేధం వలన సామాన్య ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే.. జనంలో మోదీ నిర్ణయం పట్ల వ్యతిరేకత మాత్రం వ్యక్తం కాకపోవడం విశేషం గా చెప్పుకోవాలి. ఈ ఇబ్బందులు కొన్ని రోజులు భరిస్తే.. దేశంలో అవినీతి సొమ్ము, నల్లడబ్బును కట్టడి చేయడం సాధ్యమవుతుందనే విశ్వాసం వారికి కలుగుతుండడం విశేషం.
మొత్తానికి పెద్దనోట్ల నిషేధం అనేది దేశం మీద బహుముఖంగా ప్రభావం చూపిస్తోంది. ప్రజలు దీనికి అలవాటు పడుతున్నారు. ఇవాళ్టి నుంచి కొత్త నోట్లు లభ్యమయ్యే అవకాశం కూడా ఉన్నందున ప్రజల కష్టాలు తొందర్లోనే తీరిపోతాయని కూడా జనం అనుకుంటున్నారు.