సర్కారు చేయాల్సింది ఇంకా చాలా ఉంది
పెద్ద నోట్ల రద్దుతో జనం కొన్ని రోజులు కొన్ని రకాల ఇబ్బందులు పడాల్సి ఉంటుందని , రద్దు సంగతి ప్రకటించిన సమయంలోనే ప్రధాని మోదీ వెల్లడించారు. మారుమూల పల్లెటూరులో ఉండే... నల్లధనంతో ఎలాంటి సంబంధం ఉండని సామాన్యులకు కూడా తమ నిర్ణయం వలన కొన్ని ఇబ్బందులు ఉంటాయని మోదీ సర్కారు పెద్దలు అప్పటికే ఊహించారు. ఆమేరకు కొన్ని నిత్యావసరాల విషయంలో నోట్ల విషయంలో వెసులుబాటు కల్పించారు. 11వ తేదీ రాత్రి వరకు చెల్లుబాటు అయ్యేలా కొన్ని ప్రాంతాలను పెట్రోలు బంకులు, ప్రభుత్వ పన్నుల చెల్లింపులు, పాల కేంద్రాలు, రైల్వే, బస్ టికెట్లు ఇలాంటివన్నీ పాతనోట్లు 11వ తేదీ రాత్రి వరకు ఇచ్చుకోవచ్చునని మినహాయింపులు ఇచ్చారు. రెండు రోజులు ఏటీఎంలు పనిచేయకుండా చేశారు. ఒకరోజు బ్యాంకులు మూసేశారు. అయితే రెండోరోజున బ్యాంకులు, మూడోరోజున ఏటీఎంలు వాటి అసలైన స్థాయిలో సేవలందించేలా చర్యలు తీసుకున్నారా అంటే శూన్యం.
అదే సమయంలో.. రెండోరోజునే.. టోల్ ట్యాక్సుల దెబ్బ సర్కారుకు తెలిసి వచ్చింది. దాన్ని 11వ తేదీ రాత్రి వరకు దేశవ్యాప్తంగా రద్దు చేశారు. నిజానికి ఇవాళ్టికి కూడా సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలకు ఎలాంటి వెసులుబాటు లభించడం లేదు. ఈ నేపథ్యంలో టోల్ టాక్సుల గందరగోళం పెరగకుండా.. టోల్ రద్దును 14వ తేదీ అర్ధరాత్రి వరకు అమలయ్యేలా ప్రభుత్వం పొడిగించింది. ప్రభుత్వం ఇంకా చాలా చర్యలు తీసుకుంటున్నది. కేంద్రం ప్రత్యేకంగా రాష్ట్రాలకు లేఖలు రాసి అన్ని బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాల్సిందిగా సూచనలు చేసింది.
అయితే ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు జనాన్ని కష్టాల బారినుంచి బయటపడేయడానికి సరిపోతాయా? అనేది ఇప్పుడు చాలా కీలకమైన ప్రశ్న. నిజానికి కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. తమ హఠాత్ నిర్ణయం వల్ల ఊహించిన దానికంటె చాలా ఎక్కువగా, పెద్దస్థాయిలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా చేయవలసిన ఏర్పాట్లు చాలా ఉన్నాయని ప్రజలు కోరుతున్నారు. ఎలాంటివంటే..
- ప్రస్తుతం పెట్రోలు బంకులు వంటి చోట్ల పాతనోట్లు ఇచ్చే వెసులుబాటు 11వ తేదీ రాత్రి వరకు మాత్రమే ఉంది. ఇలాంటి వెసులుబాటును మరో వారం రోజుల పాటు పొడిగించాలి. లేకపోతే జనానికి చాలా ఇబ్బంది ఎదురవుతుంది.
- బ్యాంకుల్లో అకౌంట్ హోల్డర్ కేవైసీ వివరాలు అన్నీ పక్కాగా ఉన్నా కూడా వారి అకౌంట్లలో డబ్బు వేసుకోవడానికి ప్రతినిధులను పంపితే తిరస్కరిస్తున్నారు. నిజానికి ప్రతినిధులను పంపి డబ్బు వేసుకోవచ్చునని కేంద్రం పేర్కొంది. కానీ బ్యాంకులు ఇలా అడ్డంగా వ్యవహరిస్తున్నాయి.
- చిన్ననోట్లను పెద్దసంఖ్యలో బ్యాంకులకు చేరవేయాల్సిన అవసరం ఉంది.
- పెద్దనోట్ల చెల్లుబాటును 11వ తేదీ వరకు మాత్రమే అనుమతించారు. ఆయా అన్ని ప్రాంతాల్లోనూ కనీసం మరో వారం రోజుల వరకు ఈ వెసులుబాటు ఇవ్వాలి. టోల్ టాక్సు రద్దు కూడా కనీసం మరో వారం ఉండాలి.
- గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి ఇప్పటికీ దేశంలో ఇలాంటి గందరగోళం ఒకటి జరుగుతున్నట్లుగా తెలియకుండాపోయే అవకాశం కూడా ఉంది. అలాంటి నేపథ్యంలో కొన్ని ఎక్కువ రోజులు చెల్లుబాటు చేసుకోవడానికి వసతి కల్పించడం చాలా అవసరం.
... ఇలా ప్రాక్టికల్ గా ఎదురవుతున్న సమస్యలు, ప్రజల కష్టాలను గమనిస్తూ.. కొన్ని కొన్ని కొత్త మినహాయింపులు కల్పిస్తూ.. ప్రభుత్వం మరిన్ని ఏర్పాట్లు చేయకపోతే... నల్లధనం నిషేధం కోసం మోదీ సర్కారు ప్రయత్నిస్తున్నదంటూ ఈ కష్టాలను సహించిన ప్రజలంతా అదే సర్కారును ఛీకొట్టే ప్రమాదం ఉంటుంది.