వైకాపా ఎమ్మెల్యేలను ఏం చేయబోతున్నారో?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనుంచి తెలుగుదేశం ప్రభుత్వం మీద విరుచుకుపడడంలో చాలా దూకుడుగా ఉండే ఎమ్మెల్యేల పరిస్థితి ప్రమాదంలో ఉన్నదా? కారణాలు ఏవైనా సరే.. పర్యవసానంగా వైకాపా ఎమ్మెల్యేల్లో చాలా మంది శాసనసభకు దూరంగా ఉండాల్సిన దుస్థితి ఏర్పడుతుందా? ఏమో తాజా పరిణామాలను గమనిస్తున్నప్పుడు అలాంటి సందేహాలేకలుగుతున్నాయి. వర్షాకాల సమావేశాల సమయంలో దుడుకుగా వ్యవహరించారనే ఆరోపణల మీద 12 మంది వైకాపా ఎమ్మెల్యేలను విచారించే ప్రయత్నం చేస్తున్న హక్కుల కమిటీ వారి మీద ఏమైనా చర్య తీసుకోవడానికి సిఫారసు చేయవచ్చుననే అంచనా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆసాంతం రసాభాసగానే జరిగాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేవరకు మడమ తిప్పేది లేదు అనే నినాదంతో గట్టిగా పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ సమావేశాల్లో గందరగోళాన్ని సృష్టించింది. హోదా కోరుతూ సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాల్సిందేనని పట్టుబట్టింది. పాలక పక్షం పట్టించుకోకపోవడంతో.. దాదాపుగా ప్రతిరోజూ కూడా వైకాపా ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకెళ్లి ఆందోళనలు నిర్వహించారు. అయితే ఇదంతా గడచిపోయిన పరిణామాలు.
వర్షాకాల సమావేశాల్లో అసెంబ్లీలో దుడుకుగా వ్యవహరించారంటూ 12 మంది వైకాపా ఎమ్మెల్యేలకు శాసనసభ హక్కుల కమిటీ ఇటీవల నోటీసులు ఇచ్చింది. వీరిని విచారణకు పిలిచింది. ఆ సమయంలో విచారణకు ముగ్గురు గైర్హాజరయ్యారు. వెళ్లిన వారు కూడా.. హోదాకు తాము కట్టబడే ఉంటామని, తమ శాంతియుత ఆందోళనలను కూడా హక్కుల కమిటీ తప్పుపట్టాలని చూస్తోందని ఎదురుదాడికి దిగారు. గైర్హాజరైన ముగ్గురికి హక్కుల కమిటీ మళ్లీ నోటీసులిచ్చి శుక్రవారం విచారించింది. వారిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక్కరే వచ్చారు. కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కరరెడ్డి రెండోసారి కూడా గైర్హాజరయ్యారు.
అయితే మొత్తం ఈ 12 మందికీ మరోసారి నోటీసులు ఇచ్చి, ఆ తర్వాతే స్పీకరుకు తమ సిఫారసులు అందజేయాలని హక్కుల కమిటీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే రాష్ట్రానికి హోదా కోసం శాంతియుతంగా డిమాండ్ చేసిన తమకు ఇలాంటి నోటీసులు తగవంటూ వైకాపా ఎమ్మెల్యేలు రాద్ధాంతం చేస్తున్నారు.
మరోవైపు సభలో దుడుకుగా స్పందించే విపక్ష సభ్యులను సభకే దూరంగా ఉంచాలనే వ్యూహంతోనే ఇదంతా జరుగుతున్నట్లు కొందరు అంటున్నారు. వీరిమీద కూడా అంతిమంగా కొంతకాలం వర్తించేలా సస్పెన్షన్ వేటు వేస్తారని ఊహిస్తున్నారు. ఇప్పటికే నగరి ఎమ్మెల్యే రోజా పై విధించిన సస్పెన్షన్ అలాగే కొనసాగుతోంది. మరి ఇన్ని విచారణల తర్వాత ఈ 12 మంది వైకాపా ఎమ్మెల్యేలను ఏం చేయబోతారన్నది ఆసక్తికర అంశంగా చర్చ జరుగుతోంది.