వెగటు పుట్టిస్తున్న రోజా విమర్శలు
సినిమాల్లో పేలే పంచ్ డైలాగుల్ని రాజకీయాల్లో వాడుకోవడం బాగానే ఉంటుంది.. కానీ దానికి కూడా ఓ హద్దు ఉంటుంది.. హద్దు మీరిపోతే వెగటు పుడుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా శుక్రవారం నాడు అలాంటి వాతావరణాన్నే కల్పించారు. మామూలుగానే దూకుడుగా మాట్లాడుతూ.. అత్యంత తీవ్రమైన పదజాలంతో రాజకీయ ప్రత్యర్థుల్ని దూషిస్తూ చెలరేగడంలో రోజా తనదైన శైలిని చూపిస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. నిజానికి అలాంటి నోటి దూకుడు వ్యవహారమే ఆమె మీద అసెంబ్లీ లో ఎంట్రీ దక్కకుండా ఏడాది పాటు సస్పెన్షన్‌కు కూడా కారణమైంది.
అయితే ప్రెస్‌మీట్ అనేది ఎటూ అసెంబ్లీ కాదు గనుక.. తన ఇష్టానుసారం చెలరేగిపోవచ్చునని రోజా అనుకున్నట్లుగా ఉంది. అందుకే ఎడా పెడా విమర్శలు చేశారు. ‘ఆగడు’సినిమాలో మహేష్ బాబు డైలాగును నారా లోకేష్ ను వెటకారం చేయడానికి వాడుకుంటూ ’డిక్కీ బలిసిన డాష్‘ అని వ్యాఖ్యానించడం... నారా లోకేష్ ’సిమ్ కార్డ్ లేని సెల్‌ఫోన్ లాంటివాడు‘ అని వ్యాఖ్యానించడం తీవ్రమైన ప్రతివిమర్శలకు దారితీసేలా ఉన్నాయి.
నిజానికి ‘అవకాశం ఉంటే తాను అమెరికాలో పుట్టాలని కోరుకునే వాడిని’ అన్న చంద్రబాబు వ్యాఖ్యల మీద విమర్శించడానికి రోజా ఈ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఆ ఒక్క పాయింటు మీదనుంచి డైవర్ట్ అయిపోకుండా.. చంద్రబాబు మాటలు దేశాన్నే అవమానించినట్లుగా ఉన్నాయంటూ ఆయనను ఎంత తీవ్రంగా తప్పుపట్టినా సబబుగానే ఉండేది. అయితే.. చంద్రబాబు మీదనుంచి లోకేష్ మీదకు తన దృష్టి మళ్లించి.. అది కూడా లోకేష్‌ను జగన్ తో పోల్చడానికి అవకాశమే లేదంటూ.. ఆ స్థాయిలేదంటూ.. పైన చెప్పిన విమర్శలు చేసింది రోజా.
అయితే రోజా మాట్లాడిన తీరు మీద ఆమె సొంత పార్టీ నాయకుల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె మాటలు ఎమ్మెల్యే స్థాయికి తగినట్లుగా కాకుండా, ఏవగింపు కలిగించేలా ఉన్నాయని పలువురు అంటున్నారు. ఇలాంటి చవకబారు మాటల వల్ల ప్రతిసారీ పార్టీ ఇబ్బందుల్లో పడుతోందని, దీంతో జగన్ ను మరికొన్ని రోజుల పాటూ తెలుగుదేశం నాయకులంతా అడ్డగోలుగా తిట్టడానికి ఆస్కారం కల్పించడం తప్ప సాధించేది ఏమీ లేదని వైకాపా నాయకులు పలువురు అభిప్రాయపడుతున్నారు.