విశాఖ చెవిలో మళ్లీ కమలం?

విశాఖ రైల్వే జోన్ కు ఈసారి కూడా కేంద్ర బడ్జెట్ లో చోటు దక్కలేదు. ఈ దఫా సాధారణ బడ్జెట్ తో కలిపి రైల్వే బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో విశాఖ రైల్వే జోన్ వచ్చితీరుతుందని ఆ ప్రాంత వాసులు ఆశపడ్డారు. కాని చివరకు నిరాశే మిగిలింది. అరుణ్ జైట్లీ మొండిచేయి చూపించారు. దీంతో విశాఖలో ఆందోళన కు దిగాయి ప్రజాసంఘాలు.
వెంకయ్య ప్రకటనతో మళ్లీ ఆశలు...
విశాఖకే రైల్వే జోన్ ఇస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించడంతో ఈ బడ్జెట్ లో దానికి చోటు ఉంటుందని అందరూ భావించారు. ఎందుకంటే కేంద్రంలో కీలకంగా ఉన్న వెంకయ్య నాయుడు చెప్పడంతో ఈసారి ఖచ్చితంగా వస్తుందనుకున్నారు విశాఖ వాసులు. అయితే ఈసారి కూడా రైల్వే జోన్ ప్రస్తావనే లేక పోవడంతో మండిపడుతున్నారు స్థానికులు. విశాఖకు రైల్వే జోన్ కావాలంటూ కొన్నేళ్లుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వాలు దిగిరావడం లేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాతనైనా వస్తుందనుకుంటే బీజేపీ ప్రభుత్వం మూడేళ్లు ఈ సమస్యను సాగదీస్తుందని చెబుతున్నారు. విభజన చట్టంలో ఉన్నా రైల్వే జోన్ ను ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రంపై వివక్ష ఎందుకని ప్రశ్నిస్తున్నారు విశాఖ వాసులు. విశాఖ కంటే సదుపాయాలు, అనుకూలతలు లేని ప్రాంతాలకు రైల్వే జోన్లను కేటాయించిన కేంద్ర ప్రభుత్వాలు విశాఖను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తూర్పు కోస్తా రైల్వే డివిజన్ లో అత్యధిక ఆదాయాన్ని సమకూర్చుకునే డివిజన్ వాల్తేరు డివిజన్. దీన్ని ప్రత్యేకంగా జోన్ చేయడానికి కొన్ని రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో కేంద్రం దీన్ని నానుస్తూ వస్తోంది. త్వరలోనే ఉద్యమబాట పడతామని రైల్వే ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
గొప్పలొద్దు...జోన్ ఎక్కడ?
అమరావతి రైతులకు పన్ను మినహాయింపు ఇస్తే గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం అది కేవలం 22 వేల మందికే ప్రయోజనం చేకూరుతుందని గుర్తెరగాలంటున్నారు విశాఖ వాసులు. లక్షలాది మందికి ఉపయోగపడే విశాఖ జోన్ ను వదిలిపెట్టి అమరావతిని పట్టుకుని ఊరేగడం ఎంత వరకూ సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. కొన్ని ప్రజాసంఘాలు విశాఖలో ఆందోళనకు కూడా దిగాయి. వెంటనే పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. మొత్తం మీద కేంద్ర బడ్జెట్ ఏపీ వాసులను, ముఖ్యంగా విశాఖ వాసులను నిరాశపర్చింది. మరి వెంకయ్య విశాఖ జోన్ హామీ ప్రత్యేక హోదా మాదిరిగానే తయారవుతుందా? అన్న ఆందోళన చెందుతున్నారు.