వర్క్ వీసాపై ట్రంప్ కన్ను

అమెరికా అధ్యక్షుడి నిర్ణయాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. రోజుకో వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకొస్తూ అటు అమెరికన్లను, ఇటు నాన్ అమెరికన్లకు నిద్ర లేకుండా చేస్తున్నాడీ ట్రంప్. వర్క్ వీసా సంస్కరణలపై ఇప్పుడు ట్రంప్ కన్ను పడింది. 2007లో తీసుకొచ్చిన ఈ బిల్లును మళ్లీ బయటకు తెచ్చాడు. ఈ బిల్లుతో హెచ్ 1 బి వీసీ సంస్కరణ కార్యక్రమాన్ని పునరుద్ధరించినట్లవుతుందని చెబుతున్నారు. దీనివల్ల నైపుణ్యం కలిగిన వారికే అమెరికాలో చోటు దక్కుతుంది.
ఇటీవలే ఇతర దేశాల నుంచి ఉద్యోగాల కోసం వచ్చే వారి రాకపై సవరణలు చేస్తూ కఠిన నిబంధనలతో కూడిన బిల్లును ట్రంప్ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. హెచ్ 1 బి వీసాలున్న వారి కనీస వేతనాన్ని 60 వేల డాలర్ల నుంచి 1,30, 000 డాల్లరకు పెంచుతూ బిల్లును దిగువ సభకు ముందుకు తీసుకొచ్చింది. దీంతోనే భారతీయ ఐటీ కంపెనీలు బిత్తరపోయాయి. ఇప్పుడు కొత్తగా మరో వర్క్ వీసా సంస్కరణలపైనా ట్రంప్ కన్నేయడంతో ఇక కష్టాలు ప్రారంభమైనట్లేనని భారతీయ ఐటీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తం మీద ట్రంప్ వరుస నిర్ణయాలతో ప్రపంచ దేశాలన్నీ అసహనానికి గురవుతున్నాయి. అగ్రరాజ్య అధిపతి కావడంతో ఏమి చేయలేని పరిస్థితి. అయితే ట్రంప్ నిర్ణయాలను అక్కడి న్యాయస్థానాలు కొంతవరకూ తిరస్కరించడం కొంతలో కొంత ఊరట కల్గిస్తోంది.
- Tags
- ట్రంప్