లౌక్యంగా మాట్లాడి సస్పెన్స్ పెంచిన పవన్ కల్యాణ్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన ప్రసంగాల్లో మాట్లాడే సమయంలో నేను అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదు. డబ్బు కోసం రాలేదు. సినిమాల్లోనే నాకు ఎక్కువ డబ్బు వస్తుంది. ఆ డబ్బును వదులుకుని మీకోసం ఏమైనా చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను అని పదేపదే చెబుతుంటారు. రాజకీయంగా తనకు ఎలాంటి తెలివితేటలు లేవని చెప్పుకుంటూ ఉంటారు. రాజకీయంగా ఇప్పటిదాకా ఎన్నికల బరిలో అరంగేట్రం చేయని నేతగా ఒక మోతాదు వరకు ఆయన మాటలు నిజమే కావొచ్చు గానీ.. రాజకీయ లౌక్యం ప్రదర్శించడంలో ఆయన ప్రొఫెషనల్ రాజకీయ వేత్తలను మించిపోయినట్లే కనిపిస్తోంది. అనంతపురం ప్రసంగంలో చిన్న అంశాల ద్వారా ఆయన ప్రజల్లో ఒక సస్పెన్స్ కు బీజం వేసి.. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీల్లో కూడా తన గురించి పదేపదే చర్చ జరిగే పరిస్థితిని సృష్టించారంటే అతిశయోక్తి కాదు.
ఇంతకూ ఆయన ఏం చెప్పారంటే.. 2019 ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీచేస్తానని ప్రకటించారు. అనంతపురం సభా వేదికగా తొలిసారిగా ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం గురించిన మాట అధికారికంగా వెలువడింది. అయితే తాను ఎక్కడినుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగేది మాత్రం పవన్ కల్యాణ్ వెల్లడించలేదు. అనంతపురం వాసులకు తాను అండగా ఉంటానని, వారికోసం పాటు పడతానని, వారి కరవును దూరం చేయడానికి నిపుణుల సలహాలతో పోరాటాలు చేస్తానని ఇలా చాలా విషయాలు పవన్ కల్యాణ్ చెప్పారు. అయితే అనంతపురం జిల్లానుంచే ఎమ్మెల్యే బరిలో ఉంటానా? లేదా? అనే మర్మం ఆయన ముడివిప్పలేదు.
నిజానికి పవన్ కల్యాణ్ ఏలూరులో ఓటరుగా నమోదు కావడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు అనంత మీద తన ప్రేమను చాటుకోవడానికి అన్నట్లుగా ఇక్కడే వచ్చే ఏడాది పార్టీ తొలి కార్యాలయం ప్రారంభిస్తా అన్నారు. ఎన్ని చెప్పినా.. ‘ఎక్కడినుంచి పోటీ’ అనే సీక్రెట్ మాత్రం ముడి విప్పలేదు. దీంట్లో రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చోపచర్చలు నడుస్తున్నాయి. పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లోనూ తెలుగుదేశానికి మిత్రపక్షంగానే రంగంలోకి దిగుతాడా.. స్వతంత్రించి ఒక్కడే బరిలోకి దిగుతాడా? ఎక్కడినుంచి పోటీచేస్తాడు? నిన్న చెప్పిన మాటలను బట్టి అనంతకు అండగా ఆ జిల్లానుంచి పోటీచేస్తాడా? లేదా, తనకు అనుకూల బలం బలగం మొత్తం ఉండేలా పశ్చిమగోదావరిలో ఓటరుగా నమోదు అవుతున్నట్లే అక్కడినుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తాడా.. వంటి చర్చలు సాగుతున్నాయి. మొత్తానికి పవన్ కల్యాణ్ పార్టీలు, నేతల్లో భలే సస్పెన్స్ మిగిల్చారే అని అంతా అనుకుంటున్నారు.