రాహుల్ అలా చేస్తే.. అది దేశద్రోహమే!
‘తాను నోరువిప్పితే అది భూకంపమే’ అని ప్రకటించడం ద్వారా రాహుల్ గాంధీ శుక్రవారం నాటి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. విమర్శలు ప్రతివిమర్శలు, ప్రతిదాడులకు ఆస్కారం కల్పించారు. ఎప్పుడూ మౌనంగా ఉండే రాహుల్ హఠాత్తుగా ఇలా భూకంప సృష్టికి ఎందుకు తెగిస్తున్నట్టు? నిజంగానే ప్రజల కష్టాలు తీర్చడంలో మోదీ సర్కారు వైఫల్యాల పట్ల ఆయనలో అసహనం పెరిగిందా? లేదా, ఏదో కాస్త ఎట్రాక్టివ్ గా ఉండడం కోసం అలాంటి కామెంట్ చేశారా? ఆ చర్చ ఒక ఎత్తు అయితే.. ఈ సందర్భంగా రాహుల్ ఓ కీలకమైన సంగతి చెప్పారు. నోట్ల రద్దు వెనుక పెద్దకుంభకోణం ఉన్నదని, దీని వెనుక ఉన్నదేమిటో తాను సభలో వివరిస్తానని రాహుల్ గాంధీ అంటున్నారు. అక్కడే అసలు మతలబు దాగి ఉంది.
రాహుల్ చెబుతున్నట్లుగా నోట్ల రద్దు వెనుక పెద్ద కుంభకోణం ఉన్నదనే అనుకుందాం. దానికి సంబంధించిన వివరాలు రాహుల్ వద్ద ఉన్నాయనే అనుకుందాం. అయితే పార్లమెంటులో మాత్రమే బయటపెడతానని ఆయన భీష్మించుకుని కూర్చుంటే.. జాతికి ద్రోహం జరుగుతుంది కదా? పార్లమెంటులో అవకాశం రాకపోతే, ప్రెస్ మీట్ లోనైనా రాహుల్ బయటపెట్టాల్సిందే. పెట్టి ఆ కుంభకోణం గురించి ప్రజల్ని జాగృత పరచాల్సిందే. మోదీ సర్కారు తప్పు చేస్తూ ఉంటే గనుక.. దాన్ని చక్కదిద్దాల్సిందే. దాని వల్ల దేశానికి మేలు జరుగుతుంది.
ఆ విషయం పట్టించుకోకుండా రాహుల్.. తనకు పార్లమెంటులో అవకాశం ఇస్తేనే కుంభకోణం గురించి వివరాలు చెబుతా.. అని మంకుపట్టు పడితే ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అయితే చర్చ జరగాలనే మాట చెబుతూ.. అసలు పార్లమెంటును జరగనివ్వకుండా.. వ్యవహరిస్తున్న తమ పార్టీ వైఖరిని ఆయన ఎలా సమర్థించుకుంటారో గానీ.. అసలేమీ చెప్పకుండానే.. నేను మాట్లాడితే భూకంపం వచ్చేస్తుందని పసలేని బెదిరింపులకు దిగితే నవ్వుల పాలయ్యే ప్రమాదం ఉంటుంది.