రాయలసీమ నుంచి అమరావతికి మార్గమిదే...

రాయలసీమ ప్రాంతాన్ని నవ్యాంధ్ర రాజధాని నగరానికి అనుసంధానం చేయడానికి అనంతపురం నుంచి అమరావతికి నూతన ఎక్స్‌ప్రెస్ మార్గాన్ని నిర్మిస్తున్నారు. దీనికోసం గుంటూరు జిల్లాలో భూసేకరణకు సంబంధించి కసరత్తు మొదలైంది. రహదారి నిర్మాణంలో భాగంగా ఏయే రెవెన్యూ గ్రామాల్లో భూసేకరణ చేయాలి? ఎంతభూమి సేకరించాలన్న విషయమై స్పష్టత వచ్చింది. మొత్తం 8 మండలాల పరిధిలో 31 గ్రామాల్లో 4వేల ఎకరాలు భూమి సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ప్రాధాన్య ప్రాజెక్టుగా చేపడుతుండడంతో భూసేకరణకు ప్రత్యేకంగా యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. రాజధాని నిర్మాణానికి భూములు సేకరించిన పద్ధతిలోనే భూసమీకరణ కింద భూములు సేకరించాలని నిర్ణయించారు. అయితే రైతులు ముందుకు రాని ప్రాంతాల్లో భూసేకరణ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. రాయలసీమ నుంచి రాజధాని ప్రాంతానికి కీలకమైన మార్గం కావడంతో వీలైనంత తొందరగా పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. జిల్లా కలెక్టర్లు చొరవ చూపి రహదారి వెళ్లే ప్రాంతాల్లో పారిశ్రామిక హబ్‌లు, వివిధ వస్తువుల తయారీ యూనిట్లు నెలకొల్పడానికి అవకాశమున్న ప్రాంతాలను గుర్తించాలని సూచించింది. దీంతోపాటు పర్యటకంగా అభివృద్ధి చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని ఆదేశించింది.
120 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా...
అనంతపురం-అమరావతి రహదారి నిర్మాణంతోపాటు రహదారి వెంట భవిష్యత్తులో రైలుమార్గం ఏర్పాటుకు అవసరమైన భూమిని కూడా సేకరిస్తారు. రహదారి నిర్మాణంతో రవాణా సౌకర్యాలు మెరుగుపడుతున్నందున పారిశ్రామికంగా అభివృద్ధి చెందే ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేయనున్నారు. స్థానిక వనరుల లభ్యతను అనుసరించి సంబంధిత వస్తుతయారీ యూనిట్ల ఏర్పాటుకు గల సాధ్యాసాధ్యాలపై జిల్లా కలెక్టర్ నివేదిక పంపాల్సి ఉంది. రైతుల నుంచి భూసమీకరణ పద్ధతిలో భూములు తీసుకుని రహదారి వెంబడి అభివృద్ధి చేసిన ప్రాంతాల్లో భూమి కేటాయించనున్నారు. రహదారితోపాటు పరిసర ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. గ్రీన్‌ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్ మార్గాన్ని 120కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళ్లడానికి వీలుగా నిర్మాణం చేపడతారు.
భూసమీకరణ దిశగా...
అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ మార్గం నిర్మాణంలో భాగంగా గుంటూరు జిల్లా పరిధిలో 80.430కిలోమీటర్ల మేర రహదారి నిర్మిస్తారు. ప్రకాశం జిల్లా నుంచి వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలంలో మార్గం ప్రారంభమై తుళ్లూరు మండలంలో అమరావతి నగరానికి అనుసంధానంతో పూర్తవుతుంది. వినుకొండ, నరసరావుపేట, చిలకలూరిపేట, తాడికొండ నియోజకవర్గాల పరిధిలో రహదారి ప్రయాణిస్తుంది. ఈనియోజకవర్గాల పరిధిలో భూసమీకరణ చేయాల్సి ఉంది. రైతులు భూసమీకరణకు ముందుకువస్తే వారికి ప్రాధాన్యత ఇచ్చి సమీకరిస్తారు. భూ సమీకరణకు ముందుకురాని రైతులకు కొత్తగా వచ్చిన భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించి భూములు సేకరిస్తారు. ఈ మార్గంతో రాజధాని నుంచి పల్నాడు ప్రాంతానికి రవాణాసౌకర్యాలు మెరుగుపడనున్నాయి. ప్రస్తుతం ఉన్న మార్గాలతో పోల్చితే అమరావతి-అనంత ఎక్స్‌ప్రెస్ వే దగ్గరిదారి అవుతుందని అంచనా వేస్తున్నారు. భూసమీకరణ లేదా భూసేకరణకు సంబంధించిన ప్రాథమిక కసరత్తు మొదలైంది.
భూసేకరణ చేసే మండలాలివే...
నూజెండ్ల, వినుకొండ, చిలకలూరిపేట,నాదెండ్ల, ఫిరంగిపురం,మేడికొండూరు,తాడికొండ, తుళ్ళూరు భూసేకరణ చేసే గ్రామాల సంఖ్య : 31