యూత్ తుఫాన్ విశాఖ తీరాన్ని చేరేనా? దాటేనా?

విశాఖలో గురువారం ఏం జరగబోతుందనేదే ఇప్పుడు అంతా చర్చ. ఏపీ యూత్ నిరసన కార్యక్రమం చేపడుతుందా? లేదా? పోలీసులు యువతను నిరోధించగలుగుతారా? లేదా? ప్రశ్నలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని జనం మదిలో తలెత్తుతున్న ప్రశ్నలివి. గురువారం జరగబోయే నిరసన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నిరసనకు రాజకీయ పక్షాలు కూడా తోడవ్వటంతో అన్ని పార్టీల క్యాడర్లు విశాఖకు చేరుకునే అవకాశముంది. ప్రధానంగా వైసీపీ అధినేత జగన్ తాను విశాఖలో జరిగే కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొంటానని ప్రకటించారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఏపీ యూత్ కు మద్దతిచ్చేందుకు విశాఖ వెళ్లాలని నిర్ణయించుకున్నారట. గురువాం ఉదయం ఫ్లైట్ టిక్కెట్ కూడా బుక్ అయిందని చెబుతున్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి కూడా విజయవాడలో బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి గురువారం నిరసనను తెలియజేస్తామని ప్రకటించింది. ప్రభుత్వం అరెస్ట్ లు చేసినా భయపడబోమని చెప్పింది. ఆంధ్రయూనివర్సిటీ, నాగార్జున, వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి విద్యార్థులు ఇప్పటికే విశాఖ చేరుకున్నారు.
వ్యూహం మార్చారా?
అయితే ఆందోళనకారులు వ్యూహం మార్చునున్నట్లు తెలిసింది. ప్రభుత్వం ఆర్కే బీచ్ లోకి అనుమతించకపోతే వేరే వేదికను కూడా విద్యార్థులు ముందుగానే ఎంచుకున్నట్లు సమాచారం. బీచ్ కు దగ్గరలోనే తమ నిరసనను తెలియజేసేలా ప్లాన్ చేసుకున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ స్థలం మార్పు జరిగితే ఆ విషయాన్ని గురువారం ఉదయం నుంచి సోషల్ మీడయా ద్వారా తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం ఎంత అణగదొక్కినా..తమ నిరసన మాత్రం ఆగబోదని ఏపీ యూత్ నేతలు చెబుతున్నారు. రేపు ఏం జరుగుతుందో మీరే చూస్తారుగా? అని సోషల్ మీడియాలో పోలీసులకు సవాల్ కూడా విసురుతున్నారు. దీంతో విశాఖలో హైఅలెర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. ఏపీ కేబినెట్ కూడా నిరసనకు అనుమతివ్వకూడదని నిర్ణయించడంతో విశాఖ తీరమంతా భారీగా పోలీసులను మొహరించారు.
నిరసనలకు అనుమతి నో.....
గురువారం విశాఖ ఆర్కే బీచ్ లో ప్రత్యేక హోదా కోరుతూ ఏపీ యువత నిరసనకు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో విశాఖలో ఎటువంటి నిరసన ప్రదర్శనలకు అవకాశం ఉండదని పోలీసులు చెబుతున్నారు. తమ పిల్లలను కూడా బయటకు పంపవద్దని పోలీసు ఉన్నతాధికారులు తల్లిదండ్రులను హెచ్చరించారు. తర్వాత జరిగే పరిణామాలకు తమది బాధ్యత కాదంటున్నారు పోలీసు అధికారులు. ఈ నెల 27, 28వ తేదీల్లో విశాఖలో అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు ఉన్నందున తాము ఎటువంటి నిరసనలకూ అనుమతివ్వబోమని విశాఖ పోలీస్ కమిషనర్ యోగానంద్ తేల్చి చెప్పారు. భాగస్వామ్య సదస్సుకు రెండు వేల మంది విదేశీ ప్రతినిధులు, 12 మంది వాణిజ్య శాఖ మంత్రులు పాల్గొంటున్నారని, ప్రతిష్టాత్మకమైన ఆ కార్యక్రమం ఉన్నందున తాము నిరసనలకు అనుమతించేది లేదన్నారు. వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే కొవ్వుత్తు ర్యాలీ కోసం పోలీసులకు దరఖాస్తు చేసుకుంది. అయితే పోలీసులు దీనికి అనుమతి నిరాకరించారు.
ఎయిర్ పోర్ట్ లోనే అరెస్ట్ లా?
బీచ్ రోడ్డులో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. బీచ్ రోడ్లకు వచ్చే అన్ని మార్గాల వద్ద చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేస్తున్నారు. ఐడీ కార్డు లేనిదే బీచ్ రోడ్డులోకి ఎవరినీ అనుమతించడం లేదు. సందర్శకులను కూడా రానివ్వడం లేదు.జనసేన అధినేత పవన్ కల్యాణ్ నుగాని, వైసీపీ అధినేత జగన్ ను గాని విశాఖ ఎయిర్ పోర్ట్ లోనే అరెస్ట్ చేయాలని పోలీసులు నిర్ణయించారు. వారిని ఎయిర్ పోర్ట్ నుంచి కదలనిచ్చేది లేదని చెబుతున్నారు. అందుకే విశాఖ ఎయిర్ పోర్ట్ వద్ద కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం మీద గురువారం విశాఖలో ఏం జరగనుందోనన్న టెన్షన్ ఇటు ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే విద్యార్థులపై తొందరపడి చర్యలకు దిగవద్దని పోలీసులకు పైస్థాయి నుంచి ఆదేశాలు జారీ అయినట్లు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విశాఖే ఇప్పడు హాట్ టాపిక్. విశాఖలో యూత్ నిరసన తుఫానుగా మారనుందా? అది ఆర్కే బీచ్ తీరాన్ని చేరనుందా? దాటనుందా? తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.