మోదీ నిర్ణయంతో విభేదిస్తున్న చంద్రబాబు!

నోట్ల రద్దు అనే విషయంలో నరేంద్రమోదీ తీసుకున్న హఠాత్ నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా ప్రత్యేకించి రాజకీయ నాయకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నిర్ణయం లో నేరుగా లోపాలు చూపలేకపోయినా, ఆచరణలో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఒత్తిడిని అధిగమించడం ప్రభుత్వానికి చేతకాదని అంటున్నాయి. అదే సమయంలో ఎన్డీయే పక్ష పార్టీలన్నీ కూడా మోదీ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో.. తెలుగుదేశానికి చెందిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం ఒక విషయంలో మోదీ నిర్ణయంతో తీవ్రంగా విభేదిస్తున్నారు. నిజానికి 500, 1000 రూపాయల నోట్ల రద్దు గురించి ఎప్పటినుంచో కేంద్రంతో ప్రయత్నాలు చేస్తూ... ఇటీవలి కాలంలో ఈ నోట్ల రద్దు గురించి ప్రధానికి లేఖ కూడా రాసి సంచలనం సృష్టించిన వ్యక్తి చంద్రబాబు. ఈ పెద్ద డినామినేషన్ నోట్లు ఉన్నందువల్లనే రాజకీయాల్లో అవినీతి పెరిగిపోతోందని, ఎన్నికల్లో ప్రజలను ప్రలోభపెట్టి ఓట్లను కొనుగోలు చేసే విషసంస్కృతి పెరిగిపోతోందని కూడా చంద్రబాబునాయుడు అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఈ నోట్ల వల్ల జేబులో లక్షలు పెట్టుకుని వెళ్లి గుట్టు చప్పుడు కాకుండా గంటల్లో ఓటర్లకు పంచేసి వచ్చేస్తున్నారంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇవి నిషేధిస్తే రాజకీయ అవినీతి తగ్గుతుందని కూడా చెప్పారు.
అయితే చంద్రబాబునాయుడు మోదీ నిషేధ నిర్ణయం రాగానే దాని పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాకపోతే.. త్వరలోనే ప్రభుత్వం విడుదల చేయబోతున్న 2000 రూపాయల కొత్త నోటు విషయంలో ఆయనకు ఇంకా అభిప్రాయ భేదాలు ఉన్నాయి. 2000 నోటు అనేది అవసరమా? అనే విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని చంద్రబాబునాయుడు విబేదిస్తున్నారు. నిజానికి చంద్రబాబు రాసిన లేఖ ఎఫెక్ట్ ఆచరణలో లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికీ ప్రభుత్వం 500 నోట్లను నిషేధించలేదు. కేవలం పాత నోట్లను రద్దుచేసి కొత్త నోట్లను మార్చుకోవాల్సిందిగా చెప్పినదంతే. ఆ డినామినేషన్ మారడం లేదు. అదే సమయంలో 1000 నోట్ల స్థానే.. 2000 నోట్లు రాబోతున్నాయి. దీనివల్ల పెద్ద మొత్తాలు కలిగి ఉండే వారికి అదొక ఎడ్వాంటేజీ అవుతుంది. అంటే చంద్రబాబు భయపడిన అవినీతి ప్రబలే కారణాలను మోదీ సర్కారు పరిగణనలోకి తీసుకోలేదనే అనుకోవాలి.
ఆ నేపథ్యంలోనే చంద్రబాబు 2000 నోట్ల పట్ల వెలిబుచ్చుతున్న అసంతృప్తి ప్రధానంగా చర్చకు వస్తోంది. పెద్ద నోట్ల రద్దు వలన తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజలు అలవాటు పడగలరని ఆయన అంటున్నారు. రానున్న రోజుల్లో 200 రూపాయల నోట్లు తెచ్చినా సౌకర్యంగా ఉంటుంది. కానీ 2000 నోట్లతో మళ్లీ ప్రమాదాలు ఉన్నాయి. కేంద్రం దీనిని గుర్తించాలని అని చంద్రబాబు కోరుతున్నారు. మరి చంద్రబాబు ఆలోచిస్తున్న దృక్పథాన్ని మోదీ అర్థం చేసుకుంటారో లేదో.. ఆయన అనుమానిస్తున్న తరహా అవినీతి ప్రబలకుండా పెద్ద నోట్లే లేని పరిస్థితిని కల్పిస్తారో లేదో చూడాలి.