ముస్లిం మహిళలు మోదీకి జై కొడతారా?

మంచీ చెడూ అనే తర్కం జోలికి వెళ్లకుండా ఉంటే.. మొత్తానికి సాంప్రదాయపు కట్టుబాట్లలో ఎక్కువగా చిక్కుకుని ఉండే సామాజిక వర్గంలో ముస్లిం మహిళలు కూడా ఉంటారు. వారి మతపరమైన ఆచారాపు కట్టుబాట్ల జోలికి మనం వెళ్లడం లేదు. కాకపోతే.. మారుతున్న సామాజిక పరిస్థితుల్లో ఇస్లాంను అధికారిక మతంగా ఆచరించే, ముస్లిం దేశాలుగా ప్రపంచ గుర్తింపు ఉన్న అనేక దేశాలు.. తమ మతపరమైన ఒక ఆచారాన్ని అనాగరికమైనదిగా గుర్తించిన తర్వాత.. సెక్యులర్ దేశంగా పేరున్న మనం మాత్రం ఇంకా దాన్నే పట్టుకుని వేళ్లాడుతుండడం గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం.
ముస్లిం మత పెద్దలు కొందరు తలాక్ నిషేధాన్ని వ్యతిరేకించడం బుద్ధిపూర్వకంగా చేస్తున్న పని అనుకోవడానికి కూడా వీల్లేదు. ఆ ప్రయత్నం భాజపా చేస్తున్నది గనుక, అది హిందూ పార్టీగా ముద్ర ఉన్నది గనుక (వేయాలి గనుక), వారు ముస్లిం వ్యతిరేకులనే ప్రచారం చేయాలి గనుక.. తలాక్ నిషేధ నిర్ణయాన్ని అడ్డుకుంటున్నట్లుగా ఉంది.
ఆ విషయం పక్కన పెడితే.. ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికల ముంగిట తలాక్ నిషేధ నిర్ణయాన్ని మోదీ ప్రకటించడం అనేది.. అది కూడా యూపీలో జరిగిన సభలో తలాక్ మీద తమ ప్రభుత్వ దృఢవైఖరిని వెల్లడించడాన్ని ఒక సాహసంగా భావించాలి. ఎందుకంటే.. యూపీ రాజకీయాలు కులమతాల ప్రాతిపదికనే డిసైడ్ అవుతాయి. ముస్లింలు కూడా యూపీలో ఫలితాలను తారుమారు చేయగలిగేంత పెద్ద ఓటు బ్యాంకు అన్నది అందరికీ తెలిసిన సంగతే. అందుకే యూపీలోని రాజకీయ పార్టీలన్నీ ముస్లింల ప్రాపకానికి ఎగబడతాయి. అలాంటి నేపథ్యంలో.. ముస్లిం మతపెద్దలు వ్యతిరేకిస్తున్న నిర్ణయాన్ని తీసుకోవడం మోదీకి లాభిస్తుందా? అనేది కీలకం!!
అయితే యూపీ ఎన్నికల్లో భాజపా లబ్ది పొందడం అంటూ జరిగితే గనుక.. ఖచ్చితంగా అక్కడ మతపరమైన క్రాస్ ఓటింగ్ జరిగింది అని భావించాల్సి ఉంటుంది. తలాక్ నిషేధానికి కట్టుబడి ఉన్న మోదీ ప్రభుత్వానికి ముస్లిం మహిళలు ఓటింగ్ లో మద్దతు ఇచ్చి ఉంటారని భావించాల్సి వస్తుందేమో. ఇప్పటిదాకా ఇంట్లో ఎవరికి వేయమని పురమాయిస్తే.. వారికే ఓటు వేసే సంస్కృతి అక్కడి మహిళల్లో ఉండవచ్చు గాక.. కానీ… తమ జీవితాలకు స్వేచ్ఛను ఆత్మగౌరవాన్ని ప్రసాదించే నిర్ణయాన్ని మోదీ ప్రభుత్వం తీసుకున్నందుకు ముస్లిం మహిళలు బాహాటంగా జై కొట్టకపోయినా.. భాజపాకు అనుకూలంగా ఓటు వేసినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ముస్లిం ఓట్ బ్యాంక్‌లో పురుషుల ఓట్లు, మహిళా ఓటు బ్యాంక్‌ను వేర్వేరుగా చీల్చడంలో మోదీ సక్సెస్ అవుతారో లేదో చూడాలి.