Wed Sep 27 2023 15:07:49 GMT+0000 (Coordinated Universal Time)
మహిళా సదస్సు ఉపన్యాసాలకే పరిమితమా?
By Telugu Post13 Feb 2017 5:32 AM GMT

అమరావతి వేదికగా కొత్త చరిత్రను సృషిస్తామంటూ ఆర్భాటంగా నిర్వహించిన జాతీయ మహిళా పార్లమెంటు లక్ష్యసాధనలో విఫలమైంది. కీలకమైన మహిళా సాధికారితపై చర్చలు అంతంత మాత్రంగానే సాగాయి. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి స్పష్టమైన కారక్రమాన్ని రూపొందించుకోవడంలోనూ సదస్సు విఫలమైంది. రిజర్వేషన్లను అడ్డుకుంటున్న వారి పేర్లను ప్రకటించాలన్న ప్రతినిధుల డిమాండ్లనూ పట్టించుకోకుండా రాబోయే ఎన్నికల్లో మాకు సంపూర్ణ మెజార్టీ ఇవ్వండి రిజర్వేషన్లు ఇస్తామంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేసిన విజ్ఞప్తి వివాదాస్పదంగా మారింది. మహిళల హక్కులపై చర్చించాల్సిన సమయంలో ఎన్నికల రాజకీయాలు చేస్తారా అన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఇక వేదికపై చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు కుటుంబసభ్యులకు స్థానం కల్పించడం, వారితోనే ఉపన్యాసాలు చేయించడం కూడా వివాదాస్పదంగా మారింది. ఇక సదస్సులో కీలక పాత్ర పోషించే అవకాశం కూడా ప్రభుత్వ అనుకూల వర్గాలకే ప్రాధాన్యత ఇవ్వడం అంతే చర్చనీయాంశంగా మారింది. మూడు రోజుల సదస్సులో భాగంగా చివరిరోజు డిక్లరేషన్ ఉంటుందని అధికారయంత్రాంగం పదేపదే ప్రకటించింది. ఆ డిక్లరేషన్ ప్రకటనా చివరకు వాయిదా పడింది. దీనిపై ప్రశ్నించిన విలేకరులకు 'సదస్సులో వచ్చిన అన్ని అంశాలను క్రోడీకరించడానికి కొంత సమయం పడుతుందని, అందువల్ల కొన్ని రోజుల తరువాతే డిక్లరేషన్ ఉంటుంది' అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఎన్ని రోజులు పడుతుందన్న విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్ప లేదు. అయితే, మహిళా పార్లమెంటు తరపున వెలువరించే కీలకమైన డిక్లరేషన్ ప్రతినిధుల ముందు ఉంచకుండా, వారి ఆమోదం లేకుండా ఎలా ప్రకటిస్తారన్నది అర్ధంకాని స్థితి. ఈ నేపథ్యంలోనే జాతీయ మహిళా పార్లమెంటు ఫక్తు టిడిపి కార్యక్ర మంలా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. మూడు రోజుల పాటు పవిత్రసంగమంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టిడిపికి చెందిన నాయకుల కుమార్తెలకు, వారి కుటుంబ సభ్యులు, అనుబంధ వ్యాపార సంస్థలకు ప్రాధాన్యత లభించింది. మహిళా హక్కుల గురించి దేశమంతా తిరిగి పోరాటం చేస్తున్న వామపక్ష నేతలు., హక్కుల కార్యకర్తలను విస్మరించడంపై సదస్సు ప్రారంభంలోనే విమర్శలు వ్యక్తమయ్యాయి. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా, కోడెల శివప్రసాదరావు కుమార్తె, బాలకృష్ణకుమార్తె బ్రహ్మణికి పెద్దపీట వేశారు. మహిళా మంత్రులను సైతం విదేశీ అతిథులకుశాలువాలు కప్పేందుకు మాత్రమే వినియోగించారు.
వ్యాపార వేత్తలకు పెద్దపీట.....
ఈ సమావేశానికి పిలిచిన వక్తలందరూ కూడా వేలకోట్ల లావాదేవీలు నిర్వహించే సిఈఓలను, వ్యాపారవేత్తలను ఆహ్వానించారు. అలాగే ప్రకృతి పొద్దార్నూ పిలిచారు. పేపరు మిల్లుల వ్యవస్థను దెబ్బతీసి రైతుల ఉపాధిని గండికొట్టిన వారిలో పొద్దార్ కంపెనీ కీలకంగా ఉంది. 3000 మంది కార్మికులను రోడ్డుపాల్జేశారనే విమర్శలున్నాయి. ఆమెను తీసుకొచ్చి ప్రసంగం ఇప్పించారు. అదే సమయంలో వేదికపై మాట్లాడినవారందరూ వారి కుటుంబాల గురించి చెప్పుకున్నారే మినహా మహిళా సాధికారిత గురించి మాట్లాడిందేమీ లేదు. పని ప్రాంతాల్లో నిముషాల ఆధారంగా పనిచేయించి హక్కులను కనీసం పట్టించుకోని సంస్థల యజమానులు యువతకు ఏం చెబుతారనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమైంది. అన్ని కార్యక్రమాల మాదిరే టిడిపి సొంత కుటుంబ వ్యవహారంలా దీన్ని నడిపించారు. ఈ సదస్సుకు కన్వీనర్‌గా ఉన్న రాహుల్ వి కరాద్ రాజకీయాలకు అతీతమని చెప్పినప్పటికీ ఖచ్చితంగా టిడిపి నాయకత్వానికి అనుబంధం ఉన్న వారికే ఎక్కువ ప్రాధాన్యతిచ్చారనే విమర్శలున్నాయి. వక్తలు కూడా వ్యాపార సదస్సులో మాట్లాడిన తీరుతో మాట్లాడటమే మినహా సాధికారిత అంశాలను ఎక్కడా ప్రస్తావించలేదు. రాష్ట్రం అప్పుల్లో ఉందని చెబుతూనే ఇలా కోట్లాది రూపాయలు వెచ్చించి కార్యక్రమాలు నిర్వహించడం ఏమటనే ప్రశ్నలు వచ్చాయి.మహిళా సాధికారిత అంటూనే వందలాది మంది మహిళలతో శానిటేషన్ పనులు చేయించారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన మంత్రులైతే భోజన సమయంలో దీనిపైనే చర్చించుకున్నారు. అలాగే వాలంటీర్లుగా వచ్చిన విద్యార్థులకు భోజనం కూడా సరైన సమాయానికి ఇవ్వలేదు. మహిళా పోలీసులైతే గంటల తరబడి నిలబడి సరైన సమయానికి భోజనం లేక నానా అవస్థలు ఎదుర్కొన్నారు. తొలిరోజు నలుగురు మహిళా కానిస్టేబుళ్లు స్ఫృహతప్పిపడిపోయారు.
విద్యార్ధినుల ఆందోళన....
ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహిళా సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్ధులను తరలించారు. రవాణా కోసం ఇంజినీరింగ్ కాలేజీలను బెదిరించి బస్సులు నడిపారు. అధికారిక లెక్కల ప్రకారం 22వేల మంది ఈ సదస్సులో పాల్గొంటే అందులో సగం మందికి కూడా పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు. సదస్సు ముగిసిన సమయంలో విద్యార్ధులు సర్టిఫికెట్ల కోసం పడిగాపులు కాసారు. తోపులాట జరగడంతో అది కూడా నిలిపివేశారు. సర్టిఫికెట్లు ఇచ్చే వరకు కదలమంటూ విద్యార్ధినులు మొండికేయడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. మూడ్రోజుల పాటు కాలేజీ మానుకుని ఎక్కడెక్కడి నుంచో వస్తే తమను మోసం చేశారని విద్యార్ధినులు విజయవాడ పోలీస్ కమిషనర్ సవాంగ్‌ను చుట్టుముట్టారు. వారికి సమాధానం చెప్పలేక అరగంటకు పైగా విద్యార్ధినుల మధ్య చిక్కుకుపోయారు. ఇక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులు., వృత్తి నిపుణులు నిర్వాహకులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడురోజులపాటు జరిగిన గ్రూపు చర్చలు నిర్వహించిన తీరును తప్పు పట్టారు. సదస్సు నిర్వహించిన హాలులో పెద్ద మైకు సిస్టం ఉండగా, మిగిలిన వారందరూ వాటి ముందే ఎక్కడివారక్కడ గ్రూపులుగా కూర్చున్నారు. అందులో ఎవరు ఏం మాట్లాడుతున్నారో పక్కన వాళ్లకు వినిపించని విధంగా చర్చలు సాగాయి. చర్చల నిర్వహణకు ఒక ప్రొఫార్మా కూడా తయారు చేయలేకపోయారని ఆరోపించారు.
Next Story