మమ అనిపించనున్న చంద్రబాబు!
ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దగ్గరపడుతోంది. చంద్రబాబునాయుడు ఎదుట మీడియా శుక్రవారం నాడు ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు, కేబినెట్ విస్తరణ గురించి కేబినెట్ భేటీలోనే చర్చించి డిసైడ్ చేస్తాం అని ఆయన వెల్లడించారు. నిజానికి చంద్రబాబునాయుడు నిర్ణయాల పట్ల కేబినెట్ లో విరుద్ధమైన కనీసం భిన్నమైన అభిప్రాయాలు వెల్లడి కావడం అంటూ ఎన్నడూ ఉండదు. కేబినెట్ భేటీ జరుగుతూ ఉండగా, ఏవైనా కొన్ని ప్రభుత్వ నిర్ణయాల విషయంలో ఎవరైనా కొన్ని అనుమానాలు వ్యక్తం చేసినా సరే... వాటిని తొక్కిపారేయడం చంద్రబాబు నైజం అని ఎరిగిన వారు చెబుతుంటారు. అలాంటి చంద్రబాబునాయుడు , తాము కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని అన్నారంటే.. అందరి ద్వారా ఒకసారి మమ అనిపించిన తర్వాతే నిర్ణయాన్ని బయటపెట్టవచ్చునని అంతా అనుకుంటున్నారు.
శుక్రవారం నాడు పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఏపీలో కార్యక్రమాల్లో కూడా పాల్గొనేందుకు గవర్నర్ నరసింహన్ విజయవాడకు వెళ్లారు. ఈ సందర్భంగా నరసింహన్ తో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారి మధ్య మంత్రివర్గ విస్తరణకు సం బంధించిన చర్చలు కూడా జరిగినట్లుగానే ఊహాగానాలు రేగాయి. అయితే బేటీ తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడినప్పుడు.. విస్తరణ అంశంపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని మాత్రమే వెల్లడించారు.
ఒకవైపు లోకేష్ ను అడిగితే.. తాను కేబినెట్ లో చేరే విషయమై పార్టీ నిర్ణయం తీసుకుంటుంది.. పార్టీ ఆదేశాలను శిరసావహిస్తా.. అని అంటారు. మరోవైపు చంద్రబాబును అడిగితే.. కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది... చర్చించి చేస్తాం అని చెబుతారు. నాయకుల మాటలకు అర్థాలే వేరులే అని జనం అనుకుంటున్నారు.