Fri Oct 04 2024 06:02:04 GMT+0000 (Coordinated Universal Time)
భవానీ ఐలాండ్కూ..టెండర్ పెట్టాశారోచ్...
ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో లాభాల బాటలో నడుస్తున్న భవానీ ద్వీపంలోని బడ్జెట్ కాటేజీలను ప్రైవేటుపరం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఏపీటీడీసీ ఉన్నతాధికారులతో చర్చించకుండా పీపీపీ విధానంలో పర్యాటక శాఖ టెండర్లు పిలిచింది. వీటన్నింటినీ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టనుంది. కాటేజీలను పొందిన కాంట్రాక్టు సంస్థ 100 వరకు స్టార్ హోటల్స్ స్థాయిలో కాటేజీలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. భవానీ ఐలాండ్‌లో మరో 100 ఎకరాలకు పైగా నిరుపయోగంగా వుండగా అభివృద్ధి చేసిన కాటేజీలను అప్పగించటమేమిటన్నది ఇప్పుడు అసలు ప్రశ్న....
ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నా....
భవానీ ఐల్యాండ్‌లో మొత్తం 28 కాటేజీలున్నాయి. వీటిలో ఆరు నాన్ ఏసీ, మిగిలినవన్నీ ఏసీ కాటేజీలు. నాలుగు ట్రీ టాప్ కాటేజీలున్నాయి. 24 జీ ప్లస్ 1 కాటేజీలు. జీప్లస్-1 కాటేజీల్లో గ్రౌండ్ భాగాన్ని వరదలను దృష్టిలో ఉంచుకుని వదిలిపెట్టారు. 2009లో వరదల తర్వాత కాటేజీలు దెబ్బతిన్నాయి. వాటిలో కేవలం 8 కాటేజీలను ఆధునికీకరించగా మిగిలినవి ప్రతిపాదనలు పంపినా ఆమోదానికి నోచుకోలేదు. అయినా ఈ కాటేజీలు పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కు పెద్దమొత్తంలోనే ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. 2016 - 17 ఆర్థిక సంవత్సరంలో రూ.3కోట్ల టర్నోవర్ బిజినెస్ జరిగింది. 2015 -16 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 30 శాతం వృద్ధి వుంది. రెండు రెస్టారెంట్లు, నాలుగు ట్రీ టాప్ కాటేజీలు, 24 జీ ప్లస్-1 కాటేజీలు, వినోద ప్రదర్శనలు, బోటింగ్ ద్వారా భారీ వృద్ధి వచ్చింది. ఈ ఏడాది మొత్తం రూ.3 కోట్ల టర్నోవర్‌లో ఖర్చులు రూ.2 కోట్లు తీసేయగా రూ.కోటి వరకు ఆదాయం సమకూరింది.
ఆస్తులన్నీ ప్రైవేటుకు ......
భవానీ ద్వీపంలో ప్రస్తుత రెండు రెస్టారెంట్స్, కాన్ఫరెన్సహాల్, నాలుగు ట్రీ టాప్ కాటేజీలు, 24 జీ ప్లస్-1 కాటేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు సంస్థకు కట్టబెడతారు. వీటి నిర్వహణ చూస్తూనే.. ఇలాంటి వాటిని భవానీ ద్వీపంలోనే మరో 100 వరకు కాటేజీలను ఆ సంస్థ నిర్మాణం చేపట్టవలసి ఉంటుంది. కాటేజీలలో ఉన్న ఫర్నిచర్ అంతా ప్రైవేటు సంస్థకు అప్పగిస్తారు. వీటి ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి.. నిర్వహణతో పాటు సిబ్బందిని నియమించటం అన్నీ అదే సంస్థ చేపట్టవలసి ఉంటుంది.
అప్పగింతపై విమర్శలు..
ఏపీటీడీసీ నేతృత్వంలో విజయవంతంగా నడుస్తున్న బడ్జెట్ హోటల్స్ - కాటేజీలను ప్రైవేటుపరం చేయడంపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యులు రూ.40 చెల్లిస్తే బోటులో భవానీ ఐల్యాండ్‌కు చేరుకుని ఆహ్లాదం పొందే పరిస్థితి ఉంది. రూ.150 లోపే థాలీ, దమ్ బిర్యానీ వంటివి అందుబాటులో ఉంటున్నాయి. కాటేజీలు కూడా అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటున్నాయి. వాటిని ఏపీటీడీసీ అభివృద్ధి చేసి సామాన్యుల నుంచి మరింత ఆదరణ చూరగొనటం ద్వారా మరింత ఆదాయాన్ని మూటకట్టుకునే అవకాశం ఉంటుంది. బడ్జెట్ హోటల్స్‌ను పీపీపీ స్టార్ రేంజ్లో అభివృద్ధి చేయాలని ఇస్తే.. సామాన్య ప్రజలకు అందుబాటులో వుంటాయా అని పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. భవానీ ద్వీపంలో మరిన్ని స్టార్ రేంజ్ హోటల్స్ కమ్ కాటేజీల అభివృద్ధికి పీపీపీ విధానంలో శ్రీకారం చుట్టడానికి మరో 100 ఎకరాలు ఖాళీగా ఉంది. దీనిని కూడా అభివృద్ధి చేస్తే భవానీ ద్వీపానికి పరిపూర్ణత వస్తుంది. ఈ ప్రాంతంలో 100 కాటేజీలు, రెస్టారెంట్లకు ప్రతిపాదనలు పెడితే సముచితంగా ఉండేదన్న వాదనలు ఉన్నాయి. లాభదాయకంగా ఉన్న బడ్జెట్ హోటల్స్‌ను పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థకు అప్పగిస్తూ టెండర్లు పిలిచిన పర్యాటక శాఖ నిర్వాకంపై ప్రభుత్వం విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వ హయాంలో.. ఇదే రీతిన మొత్తాన్ని ప్రైవేటు చేతిలో పెట్టాలని చూసినపుడు పెద్దఎత్తున ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. చివరకు ప్రజాందోళనలతో ప్రభుత్వం అప్పట్లో వెనకడుగు వేసింది.
Next Story