బాబుపై సీనియర్లు గుర్రు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. బయటకు కక్కలేక...మింగలేక లోలోపల మదనపడి పోతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అన్నీ తామై పార్టీని కాపాడుకుంటూ వస్తే...ఇప్పడు అధికారంలోకి వచ్చిన తర్వాత తమను అధినేత పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కష్టకాలంలో ఆదుకుంటే...
తెలుగుదేశంపార్టీలో సీనియర్ నేతలకు కొదవలేదు. ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన నాటి నుంచి పార్టీలోనే కొనసాగుతూ అనేకసార్లు మంత్రి పదవులూ దక్కించుకున్నవారు అనేకమంది ఉన్నారు. వారిలో ముఖ్యంగా గాలి ముద్దు కృష్ణమనాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ప్రతిభాభారతి ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే అనేక మంది ఉన్నారు. అలాగే వైఎస్ హయాంలో అసెంబ్లీలో దీటుగా మాట్లాడి అధికార పక్షాన్ని ఇరుకున పెట్టిన యువనేతలూ లేకపోలేదు. వారిలో ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్ వంటి నేతలు ఉన్నారు. వీరందరిలో ఎవరికీ ఇప్పటి వరకూ మంత్రి పదవులు దక్కలేదు. గాలి ముద్దు కృష్ణమనాయుడు, పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి వారికి పార్టీ అధికారంలోకి రాగానే ఎంఎల్సీ పదవులు దక్కాయి. 2014 ఎన్నికల్లో ఓటమి చెందిన వీరికి పెద్దల సభలో స్థానం కల్పించారు పార్టీ అధినేత.
బుగ్గకారు వస్తుందా..?
ఇప్పడు పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తోంది. ఇంకా రెండున్నరేళ్లు మాత్రమే అధికారం ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తామో ...రామో తెలియదు. బుగ్గకారు ఎక్కేభాగ్యం తమకుందో లేదోనన్న బెంగతో ఉన్నారు సీనియర్లు. పార్టీ మారి వచ్చిన వారికి పెద్ద పీట వస్తూ తమకు మంత్రి పదవులు ఇవ్వడం లేదని వారి అనుచరుల వద్ద బహిరంగంగానే వాపోతున్నారు. కళావెంకట్రావును తీసుకుంటే ఆయన అన్ని పార్టీలు మారి చివరకు ఎన్నికలకు ముందు టీడీపీలో చేరితే ఆయనకు ఏపీ పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టారని చెబుతున్నారు. అలాగే మహిళల కోటా కింద అనుభవం లేని మృణాళిని, పీతల సుజాతలను ఇంకా మంత్రిపదవుల్లో కొనసాగించడమేంటని ప్రశ్నిస్తున్నారు. పక్క రాష్ట్రంలో మహిళలనే మంత్రివర్గంలోకి తీసుకోని విషయం అధినేతకు స్పురణకు రాదా అని అంటున్నారు. మంత్రి పదవుల విషయంలో సామాజిక, కులం, జెండర్ ప్రాతిపదికన తీసుకుంటే ఓట్లు వచ్చి పడతాయా అని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.
లోకేష్ ను బూచిగా చూపి....
మంత్రివర్గ విస్తరణకు చంద్రబాబు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఆయన అన్ని కోణాల నుంచి పరిశీలిస్తున్నారు. అందుకే లోకేశ్ పేరును ఈనేతలు తెరమీదకు తెస్తున్నారు. లోకేశ్ ను మంత్రి చేయాలన్నది వీరి డిమాండ్. లోకేశ్ కోసమన్నా మంత్రివర్గ విస్తరణ చేపడితే..తమకు అందులో స్థానం దక్కుతుందని ఆశపడుతున్నారు....సీనియర్లు. కాని చంద్రబాబు మదిలో ఏముందో...ఎవరికి తెలుసు మరి.
- Tags
- చంద్రబాబు