బలూచిస్తాన్ : మనకు బ్లాక్మెయిలింగ్ సాధనమా?
జమ్మూ కాశ్మీరు వేర్పాటు వాదం లేదా పాక్ ఆక్రమిత కాశ్మీరు విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు తరచుగా చేస్తూ మనల్ని రెచ్చగొడుతూ ఉండే పాకిస్తాన్ ను కౌంటర్ బ్లాక్మెయిల్ చేయడానికి బలూచిస్తాన్ ఒక సాధనంగా ఉపయోగపడబోతున్నదా? పాకిస్తాన్ నుంచి వేరుపడాలని కోరుకుంటున్న బలూచ్ ప్రాంత వాసుల బలీయమైన కోరిక, వారు భారత్ మాత్రమే తమ ఆశ తీర్చగల దేశంగా పరికిస్తున్న పరిస్థితి, తాజాగా పరిణామాల్లో బలూచిస్తాన్ వేర్పాటు వాద నాయకులు... భారత ప్రధాని నరేంద్రమోదీని హీరోగా అభివర్ణిస్తూ చేస్తున్న ప్రకటనలు ఇవన్నీ వెరసి.. ఇలాంటి అభిప్రాయాన్నే కలిగిస్తున్నాయి. ముందుముందు భారత పాకిస్తాన్ ల మధ్య వైషమ్యాలు ప్రబలడానికి బలూచిస్తాన్ కూడా ఒక కారణం కాగలదనే సంకేతాలు ఇస్తున్నాయి.
కాశ్మీర్ వేర్పాటువాదాన్ని ఎగదోస్తూ.. భారత్ లో అశాంతిని పాదుగొల్పడానికి పాకిస్తాన్ ఎన్ని కుట్రలు చేస్తున్నప్పటికీ.. ఆ దేశం సమగ్రత పరంగా సజావైన స్థితిలో ఉన్నదనుకోవడం పొరబాటు. బలూచిస్తాన్ విషయానికే వస్తే.. పాక్ తమను అణచివేస్తున్నదని, పాకిస్తాన్ ఆగడాలనుంచి తాము తప్పించుకోవాలని, తమకు విముక్తి కావాలని, బలూచ్ ప్రాంత వాసులు కోరుతున్నారు. ఇటీవలి తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో బలూచిస్తాన్ లో ప్రజలు పడుతున్న పాట్ల గురించి ప్రధాని మోదీ ప్రస్తావించినప్పుడు పాకిస్తాన్ ఎంతగా ఆగ్రహించిందో అందరూ గమనించారు. ‘‘తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టడం’’ లాగా ఆ ప్రసంగం వారికి కనిపించింది. మరి వారు కాశ్మీర్ విషయంలో చేస్తున్నది ఏమిటో? అందుకే ప్రధాని మోదీ కూడా మేం కూడా మీ బాటలోకే వస్తే.. మీ దేశమూ ముక్కలవుతుంది జాగ్రత్త అనే సంకేతాలు ఇచ్చారని అనుకోవాలి.
ఆ మాత్రం మాట అన్నందుకే బలూచ్ వాసులు మోదీని నెత్తిన పెట్టుకుంటున్నారు. మోదీ తమ ప్రాంతానికి హీరో అని బలూచిస్తాన్ జాతీయ నేత నయోలా ఖాద్రీ పేర్కొనడం విశేషం. 70ఏళ్లుగా పాక్ ఆగడాలు భరిస్తున్నామని, కానీ తొలిసారిగా మోదీ కారణంగా తమ కష్టాల గురించి ప్రపంచానికి తెలిసిందని వారంటున్నారు. భారత మద్దతుతో తమ స్వాతంత్ర్య పోరాటానికి ఊపు వచ్చిందని ఖాద్రీ అంటున్నారు.
నిజానికి ఖాద్రీ అలా ప్రకటిస్తున్నప్పటికీ.. బలూచ్ స్వాతంత్ర్య పోరాటానికి భారత్ బహిరంగంగా ఇప్పటిదాకా మద్దతిచ్చింది లేదు. అయితే వారే అలా భావిస్తున్నారు. అయితే బలూచిస్తాన్ పరిణామాలు , భారత్ మీద పాకిస్తాన్ మరింత కక్ష పెంచుకోవడానికి మాత్రం ఖచ్చితంగా కారణం అవుతాయి. బలూచ్ లో మోదీకి ఆదరణ పెరిగే కొద్దీ.. పాక్ మరింత దుందుడుకుగా వ్యవహరించినా ఆశ్చర్యం లేదని అంచనాలు సాగుతున్నాయి.