ఫిఫ్టీ....ఫిఫ్టీ
ఏపీ ప్రోగ్రెస్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గడచిన ఏడాది నల్లేరు మీద నడకలా సాగింది. రాష్ట్రం విడిపోయాక ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా ఏపీ ముఖ్యమంత్రి రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళుతున్నారు. ఏపీ కొత్త రాజధాని అమరావతికి సమీపంలో ని వెలగపూడిలో తాత్కాలిక సచివాలయాన్ని రికార్డు స్థాయిలో పూర్తి చేయడం....సీమాంధ్ర ఉద్యోగులను ఆంధ్రకు రప్పించడం....పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడం....కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహించడం 2016లో ఏపీ సర్కారు పాలనలో మైలు రాళ్లు. అయితే అంతే స్థాయిలో బాబు పాలనపై విమర్శలూ విన్పించాయి. గత ఏడాది ఆంధ్రప్రదేశ్ పాలనపై తెలుగు పోస్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్
బిజి....బిజీ....
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలోనే మకాం వేసి పాలన సాగిస్తున్నారు. 400 కోట్ల రూపాయల వ్యయంతో తాత్కాలిక సచివాలయాన్ని శరవేగంతో నిర్మించారు. అనుకున్న సమయానికే పనులు పూర్తి చేసి పాలనను ప్రజల వద్దకు చేర్చారు. హైదరాబాద్ లో ఉంటున్న సచివాలయ ఉద్యోగులను నయానా..భయానా నచ్చజెప్పి మరీ వెలగపూడికి రప్పించారు. వారంలో ఆరు రోజులు విజయవాడలోనే ఉంటూ అభివృద్ధి పనులపై నిత్యం సమీక్షలు చేస్తున్నారు. గత ఏడాది బాబు జరిపిన విదేశీ పర్యటనల వల్ల ఇంకా పెట్టుబడులు రాష్ట్రానికి రాకున్నా....త్వరలో వస్తాయన్న ఆశాభావంతో ముఖ్యమంత్రి ఉన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన పార్టనర్ షిప్ సమ్మిట్ కు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఎంఓయూలు కుదిరాయి. అవి ఇంకా గ్రౌండ్ కాకున్నా....త్వరలో ఏర్పాటవుతాయని బాబు భావిస్తున్నారు. ఇక పన్నెండేళ్లకొకసారి వచ్చే కృష్ణా పుష్కరాలను చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన ఘటనలు పునరావృత్తం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రోజూ లక్షల సంఖ్యలో భక్తులు ఘాట్లకు వస్తున్నా....వారు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టులో పెద్ద ముందడుగే పడింది. కేంద్రమే ప్రాజెక్టు పూర్తి వ్యయాన్ని భరించేలా బాబు మంతనాలు సాగించి సాధించారు. నాబార్డు నుంచి ఇటీవలే 1981 కోట్ల రూపాయలు కూడా విడుదయ్యాయి. పుష్కరాలకు ముందే తాను ప్రెస్టేజియస్ గా తీసుకున్న పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేశారు. గోదావరి నీటిని కృష్ణా నదిలోకి మళ్లించారు. ఇక ప్రత్యేక ప్యాకేజీ కింద లక్షల కోట్లు రాష్ట్రానికి వచ్చేలా బాబు లాబీయింగ్ చేశారు. ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీయే బెటరని బాబు విశ్వసించడంతో కేంద్రం నుంచి ప్యాకేజీ ప్రకటన గత ఏడాదే వెలువడింది. ఇక రాజకీయంగా కూడా చంద్రబాబుకు గత ఏడాది కలిసి వచ్చిందనే చెప్పాలి. దాదాపు 23 మంది విపక్ష ఎమ్మెల్యేలకు పసుపు కండువాను కప్పి మరీ తన పార్టీలో చేర్చుకుని బలోపేతమయ్యారు. నిరంతరం టెలికాన్ఫరెన్స్ లు, వీడియోకాన్ఫరెన్స్, సమీక్షలతో ఏపీ సీఎం గత ఏడాదంతా బిజీగా గడిపారు. నోట్ల రద్దు అనంతరం పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్రం నియమించిన ముఖ్యమంత్రుల కమిటీకి చంద్రబాబు కన్వీనర్ గా ఎన్నికయ్యారు.
వివాదాస్పద నిర్ణయాలు.
చంద్రబాబు ఈ ఏడాది విమర్శలూ అంత ఘాటుగానే ఎదుర్కొన్నారు. శాశ్వత రాజధానిని నిర్మించకుండా...తాత్కాలిక రాజధాని నిర్మాణానికి వందల కోట్లు ఖర్చుపెట్టడమేంటన్న ప్రశ్న ఆంధ్రప్రజల నుంచే వినపడింది. అయితే దానికి చంద్రబాబు మాత్రం ఆ భవనాలను కార్యాలయాలకు భవిష్యత్తులో కూడా వాడుకోవచ్చని చెప్పటం విశేషం. ఇక ప్రత్యేక హోదా అంశంలో చంద్రబాబు కొంత ఇరుకున పడ్డారనే అనిపిస్తుంది. హోదా కోసం కేంద్రంతో పోరాడతానని ప్రకటించిన ముఖ్యమంత్రి చివరకు ప్యాకేజీతో రాజీ పడ్డారన్న విమర్శలు విన్పించాయి. ఒకదశలో హోదా ఏమైనా సంజీవినా? అని కూడా ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కావాలని 13 జిల్లాల నుంచి డిమాండ్ విన్పించింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ అధ్యక్షుడు జగన్ లకు ఇది వరంగా పరిణమించింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆక్వా ఫుడ్ పరిశ్రమ ఏర్పాటుపై కూడా అక్కడి ప్రజల నుంచి నిరసనలు కన్పించాయి. కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమం చేస్తున్న ముద్రగడను అరెస్ట్ చేయడంపైనా ఏపీ సర్కారుపై ఆ సామాజిక వర్గం అసంతృప్తితో ఉంది. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం నుంచి ఇప్పటి వరకూ ప్రకటన రాకపోవడం కూడా చంద్రబాబుకు మైనస్ పాయింటే. పార్టీ ఫిరాయింపుల నిరోధకచట్టాన్ని పక్కన బెట్టి విపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై చంద్రబాబు రాజకీయ వ్యూహాన్ని మేధావులు తప్పుపడుతున్నారు. మావోయిస్టుల ఎన్ కౌంటర్ పై కూడా బాబు సర్కార్ ప్రజాసంఘాలు, పౌరహక్కుల సంఘాల నుంచి నిరసనలను ఎదుర్కొంది. పెద్ద నోట్ రద్దు విషయంలో తన సూచననే ప్రధాని పరిగణనలోకి తీసుకున్నారన్న బాబు ప్రకటన కూడా గత ఏడాది వివాదాస్పదమైంది. మొత్తం మీద గత ఏడాది చంద్రబాబు పాలనలో సగభాగం ప్రశంసలు, సగభాగం విమర్శలు విన్పించాయి. 2017లో అమరావతి నిర్మాణ ప్రారంభం, ఏపీ అభివృద్ధి బాటన పయనిస్తుందని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ బాబూ....