ఫలితాల నామ సంవత్సరం ...2017
ఉవ్వెత్తున ఎగసి పడేఉత్సాహం.. ఊపిరులూదుకొనే ఆలోచనలు.. ఉద్భవించే ప్రణాళికలు.. హుషారుగా సాగే ప్రస్థానం... అంతా మంచే జరుగుతుందనే భరోసా... గుండెల నిండా ఆత్మవిశ్వాసం... అదిగదిగో నూతన సంవత్సరం అరుదెంచింది. అందమైన కలల్ని మోసుకొచ్చింది. ఆ కలల ఊయల మీద క్షణ కాలం పాత గురుతులను నెమరు వేసుకుంటే తీయని అనుభూతులు ఎన్నెన్నో...
ప్రపంచ చరిత్రలో సంచలనాల వత్సరం ఈ రెండు వేల పదహారు. భారతావనికి సంబంధించి శుభాశుభమిశ్రమాల సంకలనం, అటు అగ్రరాజ్యంలో ట్రంప్ కార్డు పడినా.. ఇటు మోడీ నోట్ల రద్దుతో ఢీ కొట్టినా ఒక్క విషయం మాత్రం సుస్పష్టం. ప్రజలు, నాయకులు కూడా అనవసర లౌక్యం, మధ్యేమార్గ రాజీ తత్వం కాకుండా తాడోపేడో తేల్చుకోవడానికే సై అంటున్నారు. అంతర్జాతీయ సంబంధాల కంటే దేశీయ అవసరాలు, అవకాశాలే ముఖ్యమన్న ట్రంప్ కి జైకొట్టేసింది అమెరికా. ప్రజాస్వామ్య భారతంలో తొంభైశాతం ప్రజలకు నొప్పి కలిగినా సరే.. తాననుకున్నది చేయాల్సిందే అంటూ మొండిగా ముందడుగు వేశారు మోడీ.
2017 వీటి ఫలితాలను ప్రపంచానికి చవి చూపించబోతోంది. మోడీకి ప్రజాకోర్టులో మొట్టి కాయలు పడతాయా? ట్రంప్ తన దూకుడు కి కళ్లెం వేసి బ్యాక్ జంప్ చేస్తారా? తేల్చాల్సిన సంవత్సరం ఇదే. నోట్ల రద్దు ప్రభావం ఎలా ఉండబోతోంది? సామాన్యుడు ఈ కష్టాన్ని ఎలా తీసుకున్నాడన్న అంశం తొలినాలుగు నెలల్లో జరగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ ఎన్నికల్లోనే తేలిపోనుంది. చివరి నాలుగు నెలల్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ల ఎన్నికలూ రానున్నాయి. ఈ లిట్మస్ టెస్టులో కనుక ప్యాసయితే ఇక మోడీ రథానికి తిరుగే ఉండదు. 2019 ఎన్నికల నాటికి మరింతబలపడటం ఖాయం. ఒకవేళ జాతకం తిరగబడితే పార్లమెంటులో మెజార్టీ ఉన్నప్పటికీ విపక్షాలను నిలువరించడం అంత సులభం కాదు. పార్టీలో, ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న మోడీ, అమిత్ షా ద్వయానికి అసమ్మతి తలనొప్పులు తప్పకపోవచ్చు. ఇంతవరకూ అణుచుకుంటూ వస్తున్న అద్వానీ వంటి అగ్రనాయకుల స్వరాలు శ్రుతిమించే అవకాశాలే ఎక్కువ. అందువల్లనే 2017 ఎన్డీయే ప్రభుత్వానికి మధ్యంతర తీర్పు చెప్పబోతోంది.
కాంగ్రెస్ సహా విపక్షాలు రాజకీయంగా బలహీనపడినస్థితిలో నోట్ల రద్దు వంటి బ్రహ్మాస్త్రాన్ని వారి చేతిలో పెట్టారు ప్రధాని. తనకు తానే సవాల్ విసురుకున్నారు. నల్లధనం, తీవ్రవాదానికి నిధులు, నకిలీ కరెన్సీ వంటి వాటికి విరుగుడు అంటూ చెప్పారు. ప్రజలు నమ్ముతున్నట్లే కనిపించింది. కానీ ఈ కష్టాలు తొందరలో తీరకపోయినా నల్లధనాన్ని వెలికితీయలేకపోయినా అంతే వేగంగా ప్రజలు తిప్పికొడతారు. అదే ప్రజాస్వామ్యంలో గొప్పతనం. అసలే బలహీనపడిన విపక్షాలను మరింత కుంగదీసే రాజకీయ ఎత్తుగడ కూడా నోట్ల రద్దు వ్యూహంలో దాగి ఉందనేది పరిశీలకుల భావన. ఒకవేళ ఆశించిన ఫలితాలు రాకపోతే కనుక అదే నోట్ల రద్దు భస్మాసురహస్తంగా మారి ప్రయోగించిన వాడినే బలితీసుకునే ప్రమాదమూ ఉంది. అందుకే రాజకీయంలో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవంటారు. ఇదంతా నెగిటివ్ కోణం.
పాజిటివ్ దృక్పథంతో ఆలోచిస్తే... బ్యాంకుల్లో సమృద్ధిగా నిధులు చేరి... వృథాగా మూలనపడి ఉండే ధనమంతా చెలామణిలోకి వచ్చి అతి తక్కువ వడ్డీకే అప్పు దొరికి... అందరూ సొంతిల్లు కొనుక్కొనేంత సౌలభ్యం ఏర్పడితే... భారతదేశమే కదా స్వర్గసీమ అన్నట్లుగా మారిపోతుంది. అదే జరగాలని మనసా, వాచా, కర్మణా కోరుకొందాం...శుభం భూయాత్...
- Tags
- 2017