Sun Nov 03 2024 14:06:03 GMT+0000 (Coordinated Universal Time)
ప్చ్....చప్ప..చప్ప..గా మోడీ ప్రసంగం
ఏదో అనుకుంటే...ఏదో జరిగింది అన్నట్లుంది ప్రధాని మోడీ ప్రసంగం. మోదీ ప్రసంగంలో వరాలు...తాయిలాలు...మాఫీలు ఉంటాయని నూతన సంవత్సర వేడుకలను పక్కన బెట్టి మరీ 130 కోట్ల మంది భారతీయులు ఆయన ప్రసంగం కోసం టీవీల ముందు అతుక్కుపోయారు. దాదాపు 45 నిమిషాలు ప్రసంగించిన ప్రధాని రాయితీలు మాత్రం ఎలాంటివి ప్రకటించలేదు. నల్ల కుబేరులపై యుద్దం ప్రకటిస్తారని భావించారు. కాని ఆ ఊసే లేదు. బినామీ ఆస్తులపై మోదీ నుంచి సంచలన ప్రకటన వస్తుందని అనుకున్నారు. కాని అలాంటిదేమీ లేదు. బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించే రాయితీలు మాత్రమే ప్రకటించారు. రైతులకు రుణ మాఫీ చేస్తారని ఊహించారు. కాని రెండు నెలల వడ్డీనే మాఫీ చేసి చేతులు దులుపుకున్నారు. ప్రధాని ప్రసంగంపై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే అన్నదాతల ఆశలు అడియాసలే అయ్యాయి. ఇంకో జన్ ధన్ ఖాతాల్లో పదివేల రూపాయలు వేస్తామని చెబుతారని వార్తలొచ్చాయి. దాని ఊసే లేదు. నగరాల్లో, గ్రామాల్లో నిర్మించే గృహాల్లో కేవలం వడ్డీ రాయితీనే ప్రధాని ప్రకటించారు. చిరు వ్యాపారులకు క్రెడిట్ మొత్తాన్ని మాత్రమే పెంచారు. కరెన్సీ నోట్లు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయన్నదీ ప్రధాని ప్రసంగంలో చోటు చేసుకోలేదు. కేవలం తనకు సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పే దిశగానే ప్రసంగం సాగింది. అవినీతి, నల్లధనంపై నిరంతర పోరాటం సాగుతుందని రొటీన్ డైలాగ్ తోనే సరిపెట్టారు. ప్రస్తుతం మోదీ ప్రకటించిన రాయితీలన్నీ బడ్జెట్ లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందేవేనన్నది ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కరెన్సీ కోసం క్యూ లైన్లలో నిలబడి మృతి చెందిన వారికి పరిహారం ప్రకటిస్తారని ఆశించారు. కాని దాని ప్రస్తావనే లేదు. మొత్తం మీద నూతన సంవత్సరం కోట్లాది మంది భారతీయులకు మోడీ షాక్ ఇచ్చారు. మోదీ ప్రసంగం ఆవు వ్యాసంలా సాగింది. కోట్లాది మంది భారతీయుల ఆశలు నిరాశలయ్యాయి. మోదీ ప్రసంగంలో అనేక రాయితీలు చోటు చేసుకుంటాయిని, సంచలన ప్రకటనలు ఉంటాయని మీడియాలో హోరెత్తి పోయింది. సోషల్ మీడియాలో కూడా కొన్ని అంశాలు వైరల్ అయ్యాయి. బీజేపీ పార్టీ కూడా స్పీచ్ పై మంచి మార్కెటింగే చేసింది. కాని అందరి ఆశలపై మోడీ నీళ్లు చల్లారు.
- Tags
- మోడీ
Next Story