పోలవరం సుదీర్ఘ ప్రయాణం
ఏపీ రాజకీయాల్లో పోలవరం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. పోలవరం ఇంకా పూర్తికాలేదు. పనులు జరుగుతున్నాయి. నిర్మాణ పనులు పూర్తి కాకముందే రాజకీయ పార్టీల్లో పోలవరం కాక పుట్టిస్తోంది. పోలవరం నా కల అంటారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నీ కలయితే తొమ్మిదన్నరేళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశావు? అంటారు కాంగ్రెస్ పార్టీ నేతలు. పోలవరాన్ని జగన్ అడ్డుకుంటున్నారనేది టీడీపీ నేతల ఆరోపణలు. పోలవరం ప్రాజెక్టులో పెద్దయెత్తున అవినీతి జరుగుతుందనేని వైసీపీ విమర్శ. ఇంతకీ పోలవరం చంద్రబాబు కలేనా? దీనికి పునాది రాయి వేసిందెవరు? శంకుస్థాపన చేసిందెవరు? ఎవరి హయాంలో ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. ఇది తెలుగు పోస్ట్ ప్రత్యేక కథనం.....
బీజం పడింది.......
పోలవరం ప్రాజక్ట్ ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలతో పాటు విశాఖ జిల్లాకు సాగు, తాగు నీరందుతుంది. విశాఖ నగర తాగునీటి అవసరాలు తీరతాయి. పరిశ్రమలకు అవసరమైన నీరూ దక్కుతుంది. విద్యుత్ ఉత్పత్తితో పాటు జలరవాణా కూడా సాధ్యమవుతుంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ లో నాలుగు జిల్లాల్లో ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీటి కొరతనేదే ఉండదు. అలాంటి ప్రాజెక్ట్ కు బీజం ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోనే పడింది. 1941వ సంవత్సరంలో అప్పటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఈ ప్రాజెక్టుపై ఆలోచన జరిగింది. మద్రాస్ ప్రెసిడెన్సీ చీఫ్ ఇంజినీర్ దివాన్ బహదూర్ వెంకటకృష్ణ అయ్యర్ ఈ ప్రాజెక్టు గురించి తొలిసారి సర్వే చేశారు. దీనికి సంబంధించిన అంచనాలు కూడా అప్పట్లో సిద్దమయ్యాయి. తర్వాత 1980లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి టి.అంజయ్య అదే సంవత్సరం శంకుస్థాపన కూడా చేశారు. దానికి ఇందిరాసాగర్ అని కూడా నామకరణం అప్పట్లో జరిగిపోయింది. తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చిన ఎన్టీరామారావు ఈ ప్రాజెక్ట్ కు శిలాఫలకం వేశారు. అప్పటి నుంచి ప్రతి బడ్జెట్ లో అధికారంలో ఉన్న వారు అరకొర బడ్జెట్ లను కేటాయించుకుంటూ వెళ్లారు. తర్వాత 2004లో ముఖ్యమంత్రి గా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ జలయజ్ఞం కార్యక్రమాన్ని పెద్దయెత్తున చేపట్టారు. దీంతో పోలవరానికి మోక్షం లభించింది. అప్పటి వరకూ యాభై, వంద కోట్లు వెచ్చిస్తూ వచ్చిన ప్రభుత్వాల పనితీరును తప్పుపడుతూ వైఎస్ ఏకంగా 5 వేల కోట్ల రూపాయలను కేటాయించారు. దీంతో పోలవరం కాల్వల నిర్మాణం కూడా పూర్తయింది. అయితే ఈ ప్రాజెక్టుకు ప్రధాన అడ్డంకి ముంపు గ్రామాల సమస్య. ఒడిషా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల అభ్యంతరాలతోనూ ఈ ప్రాజెక్టు నత్తనడకన సాగిందనే చెప్పాలి. అయితే ఒడిషా, ఛత్తీస్ ఘడ్ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న వైఎస్ ప్రభుత్వం ఆ రాష్ట్రాల్లో ముంపు సమస్య ఏర్పడకుండా కరకట్టలను నిర్మిస్తామని హామీ ఇచ్చింది. దానికి సంబంధించిన ప్రాంతాలను, గ్రామాలను గుర్తించి 2005లో అంచనాలను మార్చింది. నిర్వాసితులకు ప్యాకేజీని రూపొందించిన వైఎస్ ప్రభుత్వం పర్యావరణ, కేంద్ర ప్రభుత్వ అనుమతులను పొందింది.
ఓట్ల కోసమే...
రాష్ట్ర విభజన సమయంలో ఈ ప్రాజెక్ట్ ఉమ్మడి జాబితాలో ఒకటయింది. జాతీయ హోదాను దక్కించుకుంది. పోలవరం ముంపు గ్రామాలను ఏపీలో చేరుస్తూ ఆర్డినెన్స్ నూ జారీ చేసింది. పోలవరానికి అయ్యే ఖర్చును తామే పూర్తిగా భరిస్తామంటూ కేంద్రప్రభుత్వం ముందుకొచ్చింది. ఇప్పడు పోలవరం నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. అయితే పోలవరం నాదే అని ఇక్కడ ఎవరూ క్లెయిమ్ చేసుకోవడానికి వీలులేదు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోనే బీజం పడిన ఈ ప్రాజెక్ట్ ఎన్నో అవరోధాలను, అడ్డంకులను అధిగమించి ఇప్పటికి ఈ దశకు చేరుకుంది. కాని రాజకీయ నేతలు మాత్రం తమ స్వార్ధం కోసం...ఓట్ల కోసం పోలవరం ఘనత తమదేనని ప్రకటించుకుంటున్నారు. ఎవరు అడ్డంపడినా పోలవరం ఆగదని అధికారపార్టీకి తెలియంది కాదు. కాని రాజకీయం కోసం అవతలి పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నది రాజకీయ విశ్లేషకులు అంచనా. ధవలేశ్వరం వద్ద నిర్మించిన బ్యారేజీ సర్ ఆర్ధర్ కాటన్ నిర్మించింది. ఆయన బ్రిటీషీయుడైనా ఇప్పటికీ గోదావరి జిల్లా వాసులు ఆయనకు మొక్కుకుంటున్నారు. అంతే తప్ప ఏదో చేసేశామని చెప్పడం....అంతా...నా వాల్లే అని బాకా వేసుకోవడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
- Tags
- పోలవరం