పాలిటిక్స్ లో ములాయం ఫ్యామిలీ మెంబర్స్ నెంబర్ ఎంతో తెలుసా?

ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో ములాయం సింగ్ యాదవ్ ది ప్రత్యేక చరిత్ర. 25 ఏళ్ల క్రితం సమాజ్ వాదీ పార్టీని పెట్టిన ములాయం పార్టీని విజయపంథాన నడిపించారు. అలాంటి ములాయం కుటుంబం చాలా పెద్దది. రాజకీయాల్లోనూ ములాయం కుటుంబసభ్యులు ఎక్కువ మందే ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవులన్నీ వారివే. ముఖ్యమంత్రి నుంచి ఎంపీల వరకూ ములాయం కుటుంబ సభ్యులే. ములాయంతో పాటు ఆయన కుటుంబ సభ్యులనూ యూపీ ప్రజలు ఆదరించారు. గెలిపిస్తూ వస్తున్నారు. ములాయం కుటుంబంలో దాదాపు 17 మందికి పైగానే వివిధ పదవుల్లో ఉన్నారు. ములాయం కుటుంబ సభ్యుల్లో నలుగురు లోక్ సభ్యులుగా ఉండగా, ఒకరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ములాయం సోదరులు, కొడుకులు, కోడళ్లు, మనవళ్లు కూడా పదవులు పొందిన వారిలో ఉన్నారు. ఇప్పుడు తాజాగా ములాయం మరో కోడలు అపర్ణాయాదవ్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె ప్రస్తుత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అపర్ణాయాదవ్ ములాయం రెండో భార్య సాధనా గుప్తా కుమారుడు ప్రతీక్ యాదవ్ భార్య.
బరిలో ములాయం చిన్న కోడలు...
అపర్ణాయాదవ్ కు రాజకీయాలంటే మహా ఇష్టం. పాలిటిక్స్ లోకి రావాలని ఎన్నాళ్లుగానో ప్రయత్నిస్తున్నారు. ఆమె ప్రత్యర్థి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ తో తలపడుతున్నారు. బీజేపీ అభ్యర్ధి రీటా బహుగుణ జోషితో అపర్ణాయాదవ్ ఢీకొంటున్నారు. లక్నో కంటోన్మెంట్ స్థానం సమాజ్ వాదీ పార్టీకి ఎప్పుడూ అచ్చిరాలేదు. అక్కడ ఎస్పీ ఎప్పుడూ గెలవలేదు. అయినా అపర్ణ లక్నో కంటెన్మెంట్ స్థానం నుంచే పోటీ చేస్తానని పట్టుబట్టడంతో ఆమెకు ఆ స్థానాన్ని కేటాయించారు. అపర్ణా యాదవ్ మాజీ జర్నలిస్టు కుతూరు. లక్నోలోని లారెటో కాన్వెంట్ లో చదివిన అపర్ణకు ములాయం కొడుకు ప్రతీక్ యాదవ్ తో వివాహమైంది. అపర్ణ పాలిటిక్స్ లో పీజీ కూడా చేశారు. ఇటీవల కుటుంబంటో వచ్చిన గొడవలు కూడా అపర్ణ వల్లే వచ్చాయన్న వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ స్థానం నుంచి అపర్ణ గెలుస్తారా? లేదా? అని పక్కన బెడితే అపర్ణ ధైర్యానికి ప్రత్యర్ధులు కూడా మెచ్చుకుంటున్నారట. ఎందుకంటే ఆమె కోరుకుంటే మరో సురక్షిత స్థానం దక్కేదట. కాని ఎప్పుడూ గెలవని లక్నో కంటోన్మెంట్ నే ఎంచుకోవడం అపర్ణ ధైర్యానికి నిదర్శనమంటున్నారు. పైగా సీనియర్ రాజకీయ నేతతో పోటీపడటం. ఇంతకీ అపర్ణ ధైర్యం ఏ మేరకు ఫలితమిస్తుందో చూడాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.
- Tags
- అపర్ణ