పవన్ వెనక్కు లాగాలని చూస్తున్నారెందుకో?
తెలుగు రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నంతకాలమూ.. కొందరు విడిపోవాలని, కొందరు కలిసుండాలని వాదులాడుకున్నంతకాలమూ ఒక ప్రాంతాన్ని తెలంగాణ అని, మిగిలిన ప్రాంతాన్ని సీమాంధ్ర అని పిలుచుకున్నాం. అలా పిలుచుకోకపోతే తేడా తెలిసే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయాయి. తెలంగాణ ఒకటైతే, ఆంధ్రప్రదేశ్ రెండో రాష్ట్రంగా ఉంది. అయితే ఆ రెండో దానిని ఆంధ్రప్రదేశ్ గా గుర్తించడానికి హీరో పవన్ కల్యాణ్ ఒప్పుకునేలా లేదు.
ఆయన తాజాగా తాను నిర్వహించబోయే ప్రత్యేకహోదా పోరాట సభలకు ‘‘సీమాంధ్ర హక్కుల చైతన్య సభ’’ అని నామకరణం చేయడాన్ని చూస్తే అలాగే అనిపిస్తోంది. సీమాంధ్ర అనే పదం ఇప్పుడు జనం వాడుకలోంచే మాయమైపోయిందని అనుకోవాలి. అలాంటి పదాన్ని పట్టుకుని పవన్ కల్యాణ్ ఎందుకు ఊగులాడుతున్నాడో తెలియదు.
పవన్ కల్యాణ్ కంటె ముందునుంచి ప్రత్యేక హోదా డిమాండ్ ను గట్టిగా వినిపిస్తూ రాష్ట్రవ్యాప్త పోరాటాలతో ఇప్పటికే ఒక స్థాయి వరకు తీసుకువెళ్లిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సభలకు ‘‘జై ఆంధ్రప్రదేశ్’’ అని పేరు పెట్టిన నేపథ్యంలో.. దానితో సిమిలర్ గా కనిపించకుండా పవన్ కల్యాణ్ ‘‘సీమాంధ్ర’’ అనే మాట వాడుతున్నారని అనుకోవడానికి కూడా వీల్లేదు. పవన్ కల్యాణ్ ఎందుకో గానీ.. తిరుపతి సభ నాటినుంచి కూడా.. సీమాంధ్ర హక్కులు.. సీమాంధ్ర చైతన్యం అంటూ అదే పదాన్ని పదేపదే వాడుతున్నారు. జనం వాడుకలోంచి కనుమరుగైపోయిన పదం వద్దకు జనాన్ని వెనక్కు లాక్కెళ్లడానికి ఆయన ఎందుకు ప్రయత్నిస్తున్నారో మాత్రం అంతు చిక్కడం లేదు.