పన్నీర్ కే బల నిరూపణకు అవకాశమిస్తారా?

తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు ఇప్పడు ఏం చేయబోతున్నారు? దానిపైనే దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. తమిళనాడు రాజకీయమైనా జయ మరణం తర్వాత దేశ వ్యాప్తంగా తమిళనాడులో జరుగుతున్న సంఘటలను ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. పన్నీరు సెల్వం కొద్దిసేపటి క్రితం గవర్నర్ విద్యాసాగర్ రావును కలిశారు. దాదాపు 15 నిమిషాలు గవర్నర్ తో పన్నీర్ భేటీ అయ్యారు. తన రాజీనామా విషయమై పున: పరిశీలించాలని గవర్నర్ ను పన్నీర్ కోరినట్లు తెలిసింది. తనకు మెజారిటీ సభ్యు బలం ఉందని, శశికళ బలవంతంగా ఎమ్మెల్యేలను తరలించుకు పోయారని ఆరోపించినట్లు తెలిసింది. అందుకోసం తనకు అసెంబ్లీలో బలనిరూపణకు ఒకసారి అవకాశమివ్వాలని గవర్నర్ ను పన్నీర్ అభ్యర్ధించినట్లు చెబుతున్నారు. గవర్నర్ ను కలిసి వచ్చిన తర్వాత పన్నీర్ నూతనోత్సాహంతో కన్పించారు. ధర్మమే గెలుస్తుందని, తమిళనాడులో మంచి ప్రభుత్వం ఏర్పడుతుందని మీడియాతో చెప్పారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉన్నట్లు పన్నీర్ మరోసారి పునరుద్ఘాటించారు.
సుప్రీం గైడ్ లైన్స్ ప్రకారం.....
మరోవైపు మరికొద్దిసేపట్లో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ కూడా గవర్నర్ తో భేటీ కానున్నారు. తనను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న విషయాన్ని గవర్నర్ తో చెప్పనున్నారు. దాంతోపాటుగా తనను ఎన్నుకున్నట్లు ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన కాపీని కూడా గవర్నర్ కు శశికళ అందజేయనున్నారు. అయితే గవర్నర్ సంతకాలు పరిశీలించి శశికళకు అవకాశమిస్తారా? తన చేత బలవంతంగా రాజీనామా చేయించారన్న పన్నీర్ వినతిని పరిగణనలోకి తీసుకుంటారా? అన్నది గవర్నర్ విద్యాసాగర్ రావు చేతిలో ఉంది. గవర్నర్ విద్యాసాగర్ రావు న్యాయనిపుణుల సలహా మేరకే అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. అందుకోసమే గవర్నర్ ఎమ్మెల్యేలతో కాకుండా విడివిడిగా ఒక్కొక్కరికే అపాయింట్ మెంట్ ఇచ్చారని చెబుతున్నారు. ఇందులో గవర్నర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను పాటించినట్లు తెలుస్తోంది. ఎస్ఆర్ బొమ్మై కేసులో గతంలో సుప్రీంకోర్టు తీర్పును ఈ సందర్భంగా కొందరు ఉదహరిస్తున్నారు. శాసనసభ్యుల బలం తెలుసుకోవాలంటే అసెంబ్లీయే వేదికన్న సుప్రీంకోర్టు తీర్పును గవర్నర్ ఫాలో అవుతారా అని అన్పిస్తోంది. పదవిలో ఉన్న ముఖ్యమంత్రికి బలం ఉందా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే శాసనసభ యే వేదికని ఇటీవల ఉత్తరాఖండ్ విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. అంటే ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ కు బలనిరూపణ చేసుకునేందుకు అవకాశమిచ్చేందుకే ఎక్కువ చాన్స్ ఉందంటున్నారు న్యాయనిపుణులు.
- Tags
- పన్నీర్