నో లాబీయింగ్....ఓన్లీ పెరఫార్మెన్స్

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. లాబీయింగ్ కు తలొగ్గకుండా తనకున్న సమాచారాన్ని ఉపయోగించుకునే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. మంత్రులు సిఫార్సు చేసినా వాటిని పక్కన పెట్టేసి మరీ ఇంటలిజెన్స్ నివేదికను ఆధారంగా చేసుకునే ఆయన నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తుండటంతో అమాత్యులు సైతం అవాక్కవుతున్నారు. తమ అనుచరులకు నామినేటెడ్ పోస్టులు ఇప్పించుకోవాలన్న మంత్రుల కోరికలు ఫలించకుండా కేసీఆర్ స్వయంగా నిర్ణయం తీసుకుంటుండటంతో ఏమీ చేయలేక పోతున్నారు నేతలు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఎవరి సలహాలు, సూచనలను కూడా సీఎం కేసీఆర్ తీసుకోకపోతుండటంతో ఆశావహులు నిరాశతో మినిస్టర్స్ క్వార్టర్స్ నుంచి వెనుదిరుగుతున్నారు.
సొంతంగా నివేదికలు తెప్పించుకుని....
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆచితూచి నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. దశలవారీగా వీటిని భర్తీ చేస్తున్నారు. కేసీఆర్ నుంచి ఎప్పుడు ప్రకటన వస్తుందో కూడా ముఖ్యమైన నేతలకే సమాచారం ఉండటంలేదు. అన్ని అర్హతలను చూసిన తర్వాతనే కేసీఆర్ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో భర్తీ చేసిన టీఎస్ పీఎస్సీ, ఎస్సీ కార్పొరేషన్, స్పోర్ట్స్ అధారిటీ, ఇరిగేషన్ డెవలెప్ మెంట్, సివిల్ కార్పొరేషన్ ఇలా ఒకటేమిటి? అన్నీ కేసీఆర్ తాను అనుకున్న వ్యక్తుల దరఖాస్తుపై టిక్ పెట్టారు. తాజాగా డెయిరీ డెవలెప్ మెంట్ కార్పొరేషన్, తెలంగాణ వాటర్ రీసోర్సెస్ డెవలెప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవులనూ భర్తీ చేశారు. అది కూడా ఆయన సమాచారం తెప్పించుకుని మరీ పదవులుఇచ్చారట. లాబీయింగ్ ను దరిచేరనివ్వకుండా...ఉద్యమంలో పాల్గొన్న నేతలకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు కేసీఆర్. మొత్తం మీద కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు కొందరు మంత్రులకు రుచించడం లేదు. అయినా మింగలేక...కక్కలేక అన్నట్లు ఉన్నారు మంత్రులు, సీనియర్ నేతలు.