నోటిదూకుడు : ఇద్దరిని అవమానించిన చిద్దూ
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, వివాదాలతో నిత్యం సహవాసం చేయడం.. కేంద్ర మాజీ ఆర్ధికమంత్రి చిదంబరం కు కొత్త కాదు. రాష్ట్ర విభజన సమయంలో కూడా తాము తీసుకున్న విధాన నిర్ణయం అన్న వాదనకు మాత్రమే కట్టుబడకుండా , తెలుగు ప్రాంతాల నాయకులు చేసిన విరుద్ధ పోరాటాల గురించి చులకనగా మాట్లాడిన చరిత్ర కూడా ఆయనకు ఉంది. ఆయన తాజాగా మానిపోయిన మహా గాయాన్ని కెలకడం మాత్రమే కాదు, దేశం గర్వించవలసిన ఇద్దరు వ్యక్తులను దారుణంగా అవమానించారు.
బాబ్రీ కట్టడం కూల్చివేత విషయంలో అప్పటి ప్రధాని పీవీ తీసుకున్న నిర్ణయం రాజకీయ తప్పిదం అంటూ అయన ఇన్నాళ్లు తర్వాత అనడం గమనార్హం. అదే సమయంలో అప్పటి పీవీ కాబినెట్ కు మన్మోహన్ సింగ్ ను ఆర్ధిక మంత్రిని చేయడాన్ని కూడా తప్పు పడుతున్నారు. మన్మోహన్ కు అంత స్సీన్ లేదన్నట్లుగా కూడా కామెంట్ చేసారు.
'నరసింహారావు ఒక విస్మృత కథానాయకుడు' అనే అంశం మీద జరిగిన సదస్సులో వక్తలంతా పీవీ ని మేధోనాయకుడిగా ప్రస్తుతిస్తోంటే .... చిద్దూ మాత్రం ఇలాంటి. పెడసరపు ప్రస్తావన తెచ్చారు. మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా మన్మోహన్ హవా ఉండదని ఆయనకు ఒక నమ్మకం ఉన్నట్లుంది. అలాగే యూపీ ఎన్నికల నేపధ్యంలో, కాంగ్రెస్ పార్టీ తరఫున బాధ్యత తీసుకోకుండా.. దానిని పీవీ వ్యక్తిగత ఖాతాలో రాస్తే ముస్లిం ల వోట్లు పడతాయనే అత్యాశ కూడా ఉన్నట్లుంది. మొత్తానికి చిద్దూ వ్యాఖ్యల పట్ల ఆలోచపరుల్లో మాత్రం ఛీత్కారాలే వినిపిస్తున్నాయి.