నేటివిటీకి నో రెస్పాన్స్, ఏపీకి వెళ్లేందుకు సీమాంధ్రుల వెనకడుగు
హైదరాబాద్ ఖాళీ అవుతుందన్నారు. ఇంటి అద్దెలకూ ఎవరూ రానన్నారు. షాపింగ్ మాల్స్ కస్టమర్లు లేక వెలవెల బోతాయన్నారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందన్నారు. ఇవన్నీ రెండున్నరేళ్ల క్రితం సోషల్ మీడియాలో... వచ్చిన వార్తలు..సెటైర్లు.
రాష్ట్రం విడిపోగానే సీమాంధ్రులు మొత్తం ఏపీకి తరలి వెళతారని భావించారు. సీమాంధ్రులను ఆకర్షించడానికి ఏపీ ప్రభుత్వం ఆనేక చర్యలు కూడా చేపట్టింది. ఐటీ కంపెనీలు వస్తాయంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పింది. స్థానికత కోసం 2017 జూన్ 2 వరకూ గడువు విధించింది. ఆలోపు వచ్చే వారే ఏపీలో స్థానికులుగా గుర్తిస్తామని చెప్పింది. కేవలం ప్రభుత్వోద్యోగులే కాకుండా వ్యాపారులు, విద్యార్థులు, కార్మికులకు కూడా స్థానికత కల్పిస్తామన్నారు. ఉద్యోగ అవకాశాల్లోనూ, విద్యాసంస్థల్లోనూ స్థానికత వీరికి వర్తిస్తుందని చెప్పారు. ఎమ్మార్వో నుంచి నేటివిటీ సర్టిఫికేట్ తీసుకోవాలని ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. దీంతో సీమాంధ్రుల్లో ఎక్కువ మంది ఏపికి తరలి వెళతారనుకున్నారు..
ఉద్యోగులు తప్ప....
కాని రెండున్నరేళ్ల కాలం గడిచింది. ఇక స్థానికత కోసం ఏపీ ప్రభుత్వం విధించిన గడువు ఆరు నెలలే ఉంది. ఇప్పటి వరకూ లెక్కలు తీస్తే తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిన వారి సంఖ్య దాదాపు లేదనే చెప్పాలి. ఒక్క ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఏపీకి తరలి వెళ్లారు. ప్రయివేటు, వ్యాపారులు మాత్రం ఎవరూ వెళ్లలేదన్నది ఏపీ రెవెన్యూ రికార్డులు బట్టి తెలిసింది. దానికి అనేక కారణాలున్నాయి. రాష్ట్రం ఏర్పడి రెండున్నరేళ్లు. ఇంకా అభివృద్ధి బాట పట్టలేదు. పరిశ్రమలు కొత్తవీ ఏర్పాటు కాలేదు. ఉపాధి అవకాశాలు లేవు. పైగా హైదరాబాద్ లో ఉన్నన్ని ఉద్యోగ అవకాశాలు అక్కడ లేకపోవడంతో ప్రయివేటు ఉద్యోగులూ అటు వెళ్లేందుకు మొగ్గు చూపడం లేదు. పైగా తెలంగాణ వస్తే సీమాంధ్రులకు భద్రత ఉండదన్న వదంతులు పుట్టించారు. అయితే రెండున్నరేళ్లు గడిచినా భద్రంగా ఉన్నామంటున్నారు సీమాంధ్రులు. పైగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండానే సీమాంధ్రులు భుజానికెత్తుకున్నారు. సీమాంధ్రులకు కేసీఆర్ అంతటి భరోసా నిచ్చారు. దీంతో ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులను సీమాంధ్రులు పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. బతకడానికి వచ్చాం...ఎక్కడైతేనేం. అక్కడికెళితే...బంగారం తినలేం కదా? అన్నది సీమాంధ్రుల భావనగా కనపడుతోంది.
ఉపాధి వెంటనే దొరుకుతుంది......
హైదరాబాద్ లో ఏ పనిచేసుకున్నా రోజుకు రెండు వందల వరకూ సంపాదించుకోవచ్చు. వ్యాపార, వాణిజ్య విభాగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. దీనికి తోడు రెండున్నరేళ్లయినా ఎటువంటి ప్రాంతీయ విభేదాలు తలెత్తలేదు. విద్వేషాలు రగలలేదు. అంతా బాగుంటే అక్కడికి వెళ్లి ఏం బావుకోవాలంటున్నారు సీమాంధ్రులు. మొత్తం మీద ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు తెలంగాణలో ఉన్న సీమాంధ్రులపై పనిచేయాలేదనే చెప్పాలి. తెలంగాణ నుంచి వచ్చి స్థానికత కోసం దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య వేళ్ల మీదే ఉందని ఇటీవల రెవెన్యూ శాఖ ఉన్నతాధికారి సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకొచ్చారు. కానివ్వండి మనమేం చేద్దాం. వచ్చిన వారికి మాత్రం వెంటనే నేటివిటీ సర్టిఫికేట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం సదరు అధికారికి సూచించారట.