నేటికీ ఉద్యమనేతే...
ప్రొఫెసర్ కోదండరామ్. ఉవ్వెత్తున లేచిపడ్డ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఈ పేరు తెలియని వారెవ్వరూ లేరు. ఉద్యమ సమయంలో అన్ని పార్టీలూ ఆయన వెనకే నడిచాయి. కోదండరామ్ ఏ పిలుపు నిచ్చినా అన్ని రాజకీయ పార్టలూ మద్దతునిచ్చాయి. అండగా నిల్చాయి. ప్రొఫెసర్ కోసం తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ఆహ్వానాలందేవి. ఆయన ఒకసారి తమ జిల్లాకు వస్తే చాలు అనుకునేంత రేంజ్ లో ప్రొఫెసర్ గ్రాఫ్ పెరిగింది. ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. నిరసనల్లో మొదటి వరసలో నిలిచారు. అనేకసార్లు అరెస్ట్ అయ్యారు
ప్రజల పక్షాన..
అలాంటి కోదండరామ్ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక ఇంకా ఉద్యమనేతగానే కొనసాగుతున్నారు. ప్రొఫెసర్ గా రిటైరైన కోదండరామ్ ఇప్పడు తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితికి అధ్యక్షులు. నేటికీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలను నిర్వహిస్తున్నారు. భూనిర్వాసితులకు అండగా నిలుస్తున్నారు. విద్యార్థుల పక్షాన పోరాడుతున్నారు. వాస్తవానికి కోదండరామ్ అప్పటి ఉద్యమనేత కేసీఆర్ కు బాగా దగ్గర. కేసీఆర్ దగ్గరుండి మరీ కోదండరామ్ ను జేఏసీ ఛైర్మన్ గా నియమించారు. కోదండరామ్ కు కేసీఆర్ అంతటి విలువనిచ్చేవారు. తెలంగాణ కల సాకారమైన తర్వాత కోదండరామ్ కు రాజ్యసభ సభ్యత్వం దక్కుతుందన్న ప్రచారం జరిగింది. కేసీఆర్ కూడా ప్రొఫెసర్ ను పెద్దల సభకు పంపుతారని అందరూ ఆశించారు. ఉద్యమంలో పోరాడిన వారందరికి పదవులు దక్కుతాయని కేసీఆర్ చేసిన ప్రకటన కూడా ఈ ప్రచారం జరగడానికి కారణం కావచ్చు.కాని రాజ్యసభ సభ్యత్వం కోదండరామ్ కు దక్కలేదు.
మాట్లాడేందుకూ ఇష్టపడని కేసీఆర్
ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో కోదండరామ్ కేసీఆర్ కు కొంత అనుకూలంగానే ఉండేవారు. ముఖ్యంగా ప్రజాసమస్యలను ప్రభుత్వమే పరిష్కరిస్తుందని ఆయన తన సన్నిహితుల వద్ద కూడా చెప్పేవారు. అలాంటి కోదండరామ్ ఏడాది కాలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. ప్రజాసమస్యలపై తక్షణమే స్పందిస్తున్నారు. జిల్లాల వారీగా తెలంగాణ రాజకీయ జేఏసీలను పునర్నియామకం చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ప్రొఫెసర్ సారే అనేక సభల్లో చెప్పారు. ప్రజాసమస్యలపై చర్చించడానికి సీఎం కేసీఆర్ ఇష్టపడటం లేదట. కోదండరామ్ కు సీఎం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదట. నాలుగైదు సార్లు అడిగినా....సీఎంకార్యాలయం తిరస్కరించిందని ఆయన బహిరంగంగానే అనేకసార్లు చెప్పారు. అలాగే ప్రొపెసర్ హరగోపాల్ పరిస్థితి అదే.
గ్యాప్ ఎందుకు?
వాస్తవానికి ప్రొఫెసర్ కోదండరామ్ అంటే తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రత్యేక గౌరవమూ ఉంది. అందర్నీకలుపుకుని పోయే వ్యక్తిగా... ప్రజాసమస్యలపై పోరాటం చేసే నేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి కోదండరామ్ పరిస్థితి ఎన్నికలయ్యాక రివర్స్ అయింది. కేసీఆర్ క్రమంగా కోదండరామ్ ను దూరం పెట్టారు. పైగా టీఆర్ఎస్ నేతలు ఇటీవల ప్రొఫెసర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలకు కూడా దిగుతున్నారు. కోదండరామ్ కాంగ్రెస్ ఏజెంట్ అని ఆరోపించారు కూడా. కాని ప్రొఫెసర్ విమర్శలన్నింటికీ చిరునవ్వుతోనే సమాధానమిస్తున్నారు. కోదండరామ్ ను పక్కన పెట్టడానికి ప్రధాన కారణం విద్యుత్ జేఏసీ నేత రఘు అని చెబుతున్నారు. తెలంగాణకు విద్యుత్తు కొనుగోలు కోసం ఛత్తీస్ ఘడ్ తో చేసుకున్న ఒప్పందాన్నిరఘు వ్యతిరేకించారు. బహిరంగంగానే ప్రభుత్వ వైఖరిని రఘు తప్పుపట్టారు. అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారని...విద్యతు సంస్థలకు ఇది నష్టమని కూడా రఘు వాదించారు. ఇందుకు ప్రొఫెసర్ మద్దతు పలికారు. అప్పటి నుంచే కేసీఆర్ కోదండరామ్ ను దూరం పెట్టినట్లు చెబుతున్నారు.
కొసమెరుపు: ఇప్పటికే తెలంగాణ రాజకీయ జేఏసీలో ఉన్న ముఖ్య నేతలందరికీ కేసీఆర్ పదవులు కట్టబెట్టారు. నేతల్లో ముఖ్యులందరూ కోదండరామ్ ను వదలివెళ్లారు. ఇప్పడు ప్రొఫెసర్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. పాపం తెలంగాణ వచ్చినా ప్రొఫెసర్ గారికి ఉద్యమబాట తప్పలేదన్న చమత్కారాలూ విన్పిస్తున్నాయి.
- Tags
- కోదండరామ్