నియోజకవర్గాల పెంపుపై రెండు రాష్ట్రాల్లోనూ ఆశలే
![నియోజకవర్గాల పెంపుపై రెండు రాష్ట్రాల్లోనూ ఆశలే నియోజకవర్గాల పెంపుపై రెండు రాష్ట్రాల్లోనూ ఆశలే](https://telugu.telugupost.com/wp-content/uploads/sites/2/2016/09/telugupost1.jpg)
2019 సార్వత్రిక ఎన్నికలు జరిగే లోగా.. కేంద్రం ఈ ప్రత్యేకమైన నిర్ణయం తీసుకుంటుందో లేదో గానీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ఆశలు చిగురిస్తున్న వందల మంది నాయకులు మాత్రం.. అసెంబ్లీ సెగ్మెంట్ల సంఖ్య పెరుగుతుందనే విశ్వాసంతో ఉన్నారు. రెండు రాష్ట్రాల్లోని పాలక పార్టీలు కూడా ఈ ఆశ మీదనే మనుగడ సాగిస్తున్నాయా అనిపిస్తోంది. తాజాగా ఈ విషయం చర్చ లోకి రావడానికి కారణం.. తెలంగాణ మంత్రి కేటీఆర్ హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ.. 2019 నాటికి నియోజకవర్గాల సంఖ్య ఖచ్చితంగా పెరుగుతందని చెప్పారు.
జిల్లాల పెంపు ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన ఈ సంగతి కూడా ముడి విప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెరుగుతాయని అన్నారు. నియోజకవర్గాలు పెరగాలంటే రాజ్యాంగ సవరణ అవసరం లేదని, రాజకీయ నిర్ణయం తీసుకుంటే సరిపోతుందని కూడా కేటీఆర్ తెలియబరిచారు.
అయితే ఇదే నియోజకవర్గాల పెంపు గురించి ఒకవైపు కేంద్రంలో మంత్రి వెంకయ్యనాయుడు కూడా నానా కుస్తీలు పడుతున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. ఇలాంటి నిర్ణయం రావాలంటే.. కేంద్రంలో సుదీర్ఘమైన ప్రక్రియ జరగాల్సి ఉంటుంది. సాంకేతికంగా ఆ ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని చిక్కులు ఉన్నాయని, నియోజకవర్గాల సంఖ్య పెంచడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని వెంకయ్యనాయుడు అంటున్నారే తప్ప ఖరారుగా పెరుగుతాయని చెప్పడం లేదు. అదే సమయంలో కేటీఆర్ మాత్రం పెరగడం గ్యారంటీ అని చెప్పేస్తున్నారు.
రెండు రాష్ట్రాల్లోను పాలకపక్షాలు నియోజకవర్గాలు పెరుగుతాయనే ఆశ చూపించి.. విపక్షాల్లోని సిటింగు ఎమ్మెల్యేలు పలువురిని తమ పార్టీల్లో చేర్చుకున్నారు. మరి సంఖ్య పెరగకుండా పాలకపక్షాలకే చిక్కులు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.