నితీశ్ ఎన్డీయే వైపు చూస్తున్నారా?
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అంటే.. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీని తీవ్రస్థాయిలో వ్యతిరేకించిన వ్యక్తి. అయితే తాజాగా దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో నోట్ల రద్దు విషయంలో మాత్రం ఆయన మోదీ ప్రభుత్వ చర్యలను సమర్థిస్తున్నారు. బీహార్ లో ఏలుబడి సాగిస్తున్న తన ప్రభుత్వపు కూటమిలోని ఇతర పార్టీల వైఖరికి భిన్నంగా నితీశ్ మోదీ చర్యను సమర్థిస్తూ ఉండడం గమనార్హం.
బీహార్లో ఉన్న నితీశ్ ప్రభుత్వం ఆయన వ్యక్తిగత కరిష్మా మీద ఆధారపడి విజయం సాధించినదే అయినప్పటికీ.. మహాకూటమి పేరుతో ఉన్న కూటమి ప్రతినిధిగానే ఆయన సీఎం పదవిలో ఉన్నారు. వారి కూటమిలోని కాంగ్రెస్, కీలక భాగస్వామి అయిన లాలూ ప్రసాద్ యాదవ్ నోట్ల రద్దు వ్యవహారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే నితీశ్ మాత్రం జనం కష్టాలు తొలగించేలా కొన్ని చర్యలుంటే బాగుండేదని అంటూనే.. మోదీ సర్కారు మంచి నిర్ణయం తీసుకుందని, తాను వారికి మద్దతిస్తున్నానని అంటున్నారు.
దీన్ని రాజకీయంగా పెద్ద ఉద్యమం చేసేయాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇది సహజంగానే కంటగింపుగా ఉంది. అయితే నితీశ్ తమ మాటలకు లొంగే రకమేమీ కాదని కాంగ్రెస్ కు కూడా తెలుసు. ఇలాంటి నేపథ్యంలో అసలు ఒకప్పట్లో ఎన్డీయే భాగస్వామిగానే ఉన్న నితీశ్ .. ఇప్పుడు తిరిగి ఆ కూటమితో జట్టు కట్టడానికి ఉత్సాహం చూపిస్తున్నారా అనే సందేహాలు కలిగే వరకు పరిణామాలు దారి తీస్తున్నాయి.
నితీశ్ ఇదివరలో ఎన్డీయేలోనే ఉన్నారు. అయితే నరేంద్రమోదీ ప్రధాని కావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయనను ప్రధాని అభ్యర్థి చేయడానికి నిరసనగానే పార్టీనుంచి బయటకు వచ్చారు. మోదీ మీద ఎంత వ్యతిరేకత ఉండేదంటే.. ఆయన గుజరాత్ సీఎంగా ఉండగా.. బీహార్లో వరదల బాధితులకు సాయం కోసం నిధి పంపితే.. దాన్ని తిరస్కరించి తిప్పి పంపారు. అలాంటిది.. ఇప్పుడు నితీశ్ , మోదీ చర్యలను సమర్థించినా నెమ్మదిగా ఆయన ఎన్డీయే కూటమికి చేరువ అయినా.. మోదీకి నైతిక బలం చాలా పెరిగినట్లేనని పలువురు భావిస్తున్నారు.