నారాయణ మంత్రం వృథా : చంద్రజోక్యం తప్పలేదు!
అనంత పురం జిల్లా తెలుగుదేశం నాయకుల మధ్య గ్రూపు తగాదాలను పరిష్కరించడానికి, పార్టీ పరువు పోకుండా వారి మధ్య ఐక్యతను సాధించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయోగించిన నారాయణాస్త్రం నీరుగారిపోయింది. చిట్టచివరికి మళ్లీ చంద్రబాబునాయుడే స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. అసలే కొమ్ములు తిరిగిన సీనియర్లు అయిన అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు.. నారాయణ తరహాలో ఓ మంత్రి జోక్యం చేసుకున్నంత మాత్రాన తమ కక్షలకు ఫుల్ స్టాప్ పడదని .. పార్టీ అధినేతకు స్పష్టంగానే సంకేతాలు ఇచ్చారు.
అనంతపురం పరిధిలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి వర్గాల మధ్య కుమ్ములాటలు నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇద్దరూ ఎవరూ కాస్తంతయినా తగ్గేదే లేదన్నట్లుగా తగాదాలను పెంచుకుంటూ పోతున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ దివాకర్ రెడ్డి రోడ్డు మీద కూర్చుని ధర్నా చేయడం వంటివి కూడా జరిగాయి. పరువు బజార్న పడుతున్నదని గుర్తించిన ఎమ్మెల్యే ప్రభాకర చౌదరిని అమరావతికి పిలిపించి మాట్లాడారు. నాయకులు ఎంతటివారైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలంటూ హితబోధ చేశారు. అనంతపురం వ్యవహారాలను చక్కబెట్టేందుకు మంత్రి నారాయణ నేతృత్వంలో ఓ కమిటీని కూడా వేశారు.
ఆ వెంటనే రంగంలోకి దిగిన మంత్రి నారాయణ అనంతపురంలో పర్యటించి నేతల మధ్య అగాధం రచ్చకెక్కడానికి కారణమైన రోడ్ల విస్తరణ పనులను పరిశీలించారు. వారి మధ్య సర్దిచెప్పడానికి తన వంతు ప్రయత్నం చేశారు. రాజీ అనేది తనకు సాధ్యమయ్యే అంశం కాదనిపించిందేమో.. ముఖ్యమంత్రికి ఆ మేరకు నివేదించినట్లు తెలుస్తోంది.
దాంతో చంద్రబాబునాయుడు మళ్లీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. అనంతపురానికి చెందిన నాయకులను శుక్రవారం చంద్రబాబు మళ్లీ అమరావతికి పిలిపించారు. వీరితో భేటీలో ప్రధానంగా ముఠా కక్షల గురించే మాట్లాడినట్లు సమాచారం. డిసెంబరు 2వ తేదీన అనంతపురం పర్యటన కూడా పెట్టుకున్నారు.
చంద్రబాబు సర్దిచెప్పినంత మాత్రాన ఇక్కడి కక్షలు సమసేవి కాదని, పార్టీ మీద నాయకుల విభేదాల ప్రభావం పడకుండా చంద్రబాబు మార్గాలు చూసుకుంటే చాలునని స్థానిక నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.