తెలుగు రాష్ట్రాల్లో చైనా కు ఇబ్బందులే
రెండు తెలుగు రాష్ట్రాల్లో చైనాకు ఇబ్బందులు తప్పేట్లు లేవు. ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా చైనాకు ఎదురుదెబ్బేనంటున్నారు విద్యారంగ నిపుణులు. ఇంతకీ చైనా అంటే చైతన్య, నారాయణ విద్యాసంస్థలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ ను రద్దు చేయాలని ప్రభుత్వాలు దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చాయి. మెడికల్ సీట్ల భర్తీ కోసం జాతీయ స్థాయిలో నీట్ పరీక్షను నిర్వహిస్తుండటంతో ఇప్పుడు కేవలం ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో సీట్ల కోసమే ఎంసెట్ ను నిర్వహించాల్సి ఉంటుంది. దీనిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు తర్జన భర్జన పడుతున్నాయి. ఎంసెట్ ను రద్దు చేయాలనే దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చాయి.
రుబ్బుడుకు స్వస్తి....
ఎంసెట్ కోచింగ్ కోసం వేలల్లో....లక్షల్లో వసూలు చేస్తున్నాయి ప్రయివేటు విద్యాసంస్థలు. ఇంటర్ సిలబస్ రెండు నెలల్లో కంప్లీట్ చేసి మిగిలిన ఆరు నెలలూ ఎంసెట్ కోచింగ్ పైనే ప్రయివేటు విద్యాసంస్థలు దృష్టి పెడుతున్నాయి. దీంతో ఫీజులు కూడా అధికంగా వసూలు చేస్తున్నారు. శ్రీ చైతన్య, నారాయణ, గాయత్రి వంటి విద్యాసంస్థలు రెండు రాష్ట్రాల్లో వందల కొద్దీ బ్రాంచీలు ప్రారంభించి లక్షలాది మంది విద్యార్ధుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు దండుకుంటున్నాయి. ఎంసెట్ పూర్తిగా ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉండటంతో రోజుకు రెండు టెస్ట్ లు..మూడు అసైన్ మెంట్లు ఇచ్చి విద్యార్థులను రుబ్బిపడేస్తున్నాయి. తల్లిదండ్రులు కూడా మంచి కళాశాలలో ఇంజినీరింగ్ సీటు వస్తుందని భావించి తమ పిల్లలను ఎక్కువ మొత్తంలో ఫీజు చెల్లించి ఇక్కడ పడేస్తున్నారు. అయితే తాజాగా వైద్య విద్యకు వచ్చే ఏడాది నుంచి నీట్ ను తప్పనిసరి చేయడంతో ఇక ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల కోసమే ఎంసెట్ ను నిర్వహించాల్సి ఉంటుంది. అయితే రెండు ప్రభుత్వాలకు నిపుణులందించిన నివేదిక ప్రకారం.. ఈ కోర్సులకు ప్రత్యేకంగా ఎంసెట్ అవసరం లేదని చెప్పేశారు. లక్షల సంఖ్యలో ఇంజినీరింగ్ సీట్లు మిగిలిపోతున్నాయి. ఇంటర్ మార్కుల ఆధారంగా కళాశాలల్లో సీట్లు కేటాయింపు చేస్తే సరిపోతుందని చెప్పడంతో ఎంసెట్ నిర్వహణపై రెండు ప్రభుత్వాలు పునరాలోచనలో పడ్డాయి. ఇటీవల తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కూడా ఎంసెట్ ను రద్దు చేయాలనే యోచనలో ఉన్నట్లు చెప్పేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అదే బాటలో పయనించనున్నట్లు వార్తలందుతున్నాయి. ఎంసెట్ ను నిర్వహించాల్సి రావడం ప్రభుత్వాలకు కూడా భారంగా మారడంతో రద్దు చేసే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఎంసెట్ రద్దయితే అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రయివేటు విద్యాసంస్థలకు ముకుతాడు వేసినట్లే.
- Tags
- ఎంసెట్