తమిళ రాజకీయాల్లో వేలుపెట్టిందెవరు?

జల్లి కట్టు..... ద్రవిడ సంఘటిత రాజకీయ శక్తికి అద్దం పట్టిన నిలువెత్తు ఉదాహరణ..... నాలుగే నాలుగు రోజుల్లో కేంద్రం మెడలు వంచి ఆర్డినెన్స్‌కు ఒప్పించిన తమిళుల నేర్పరితనం....ఇప్పుడు దేశం మొత్తం దృష్టిని ఆకర్షించింది. జల్లికట్టు కోసం తమిళ యువత ఇచ్చిన స్ఫూర్తితో ఇతర ఉద్యమాలు కూడా రాజుకుంటున్నాయి. ఇంతకీ తమిళనాడులో అన్ని రాజకీయ పార్టీలు ఎందుకు ఒక్కటయ్యాయి? విభేదాలు మరిచి ఢిల్లీ పెద్దల వెన్నులో చలి పుట్టించడానికి కారణాలేంటి? వీటంతటకీ కారణం ఒకే ఒక వ్యక్తి అని విన్పిస్తోంది. జాతీయ నేత ఒకరు తమిళరాజకీయాల్లో వేలు పెట్టినందునే రాజకీయపార్టీలన్నీ ఏకమయ్యాయని ఇప్పుడు తమిళనాటంతా గుప్పుమంటోంది.
పార్టీలన్నీ ఎందుకు ఏకమవుతాయి?
ఎప్పటి పొంగల్..... ? ఎప్పటి సంక్రాంతి....? పండగ ముగిసిన తర్వాత ఎందుకు జనం రోడ్డెక్కారు.... ఎందుకు ఒక్క తాటిపైకి వచ్చారు.......... అవును జల్లి కట్టు తరతరాల దక్షిణ పథ సంప్రదాయం..... నాగరికత..,ద్రవిడ సంప్రదాయాలను పక్కన పెడితే ఉత్తరాది పేను పెత్తనానికి జల్లికట్టుతో ఝలక్ ఇవ్వడానికి చాలా కారణాలే ఉన్నాయి. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో 70 రోజులకు పైగా చికిత్స పొందిన సమయంలో కూడా ఆమెను హస్తిన పెద్దలు పరామర్శించలేకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. సమాఖ్య వ్యవస్థలో అంతర్భాగంగా ఉన్నా...., దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తరాది పార్టీలకు ఉన్న చిన్నచూపును ఏ మాత్రం సహించని నైజం తమిళ ప్రజలది. ఆ రాష్ట్రంలో అధికారంలో ఏ పార్టీ ఉన్నా..., రాష్ట్ర ప్రయోజనాల దగ్గరకొచ్చేసరికి మాత్రం ఒక్కటైపోతారు. రాజకీయ రణరంగంలో బాహాటంగా కత్తులు దూసుకునే తమిళ పార్టీలు అదే తమ ప్రాంత ప్రయోజనాల దగ్గరకొచ్చేసరికి చిత్రంగా దగ్గరైపోతారు. అదే ఢిల్లీ స్థాయిలో తమిళనాడుకు ఓ గౌరవాన్ని., గుర్తింపును తెచ్చిపెట్టింది. చనిపోయే వరకు ఢిల్లీ పెత్తనాన్ని ఏ మాత్రం ఖాతరు చేయని నాయకురాలిగా జయలలిత నిలిచిపోతారు. ఆమె మరణం తర్వాత జరిగిన పరిణామాలను గమనిస్తే జల్లికట్టు ఉద్యమానికి తమిళ పార్టీలు., పరిశ్రమలు., ప్రముఖులు అంతా ఒక్కటవ్వడం అప్పటికప్పుడు జరిగింది కాదని తెలుసుకోవచ్చు.
తంబిల పవరేంటో చూద్దామా?
నిజానికి జయలలిత మరణం బయటి ప్రపంచానికి వెల్లడించడానికి ముందు తమిళనాడులో రాజకీయాల్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని జాతీయ పార్టీలు భావించాయి. అందుకు తగ్గట్లుగా జాగ్రత్తగా పావులు కదిపేందుకు ఢిల్లీ నుంచి వెళ్ళిన ఓ తెలుగు ప్రముఖుడికి సైతం పరాభావం తప్పలేదట. తమిళ రాజకీయాల్లో వేలు పెట్టి లబ్ది పొందే క్రమంలో తమిళనాడు చీఫ్ సెక్రటరీపై ఆదాయపన్ను శాఖ దాడులు చేయడం., ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి పన్నీర్ సెల్వంను తప్పిస్తారనే ప్రచారాలు., జయలలిత మరణంపై సందేహాలు ఇలా రకరకాల వార్తలు వెలుగులోకి వచ్చాయి. అదే సమయంలో తమిళనాడులో రాజకీయాలు ఒక్కసారి పట్టు తప్పితే మళ్లీ కోలుకోవడం కష్టమని గుర్తించిన పార్టీలన్ని ఒక్కటయ్యాయి. అదే సమయంలో తమిళ సాంప్రదాయక క్రీడ జల్లికట్టుపై సర్వోన్నత న్యాయస్థానం ఆంక్షలు విధించడం వాటికి కలిసొచ్చింది. జల్లికట్టుకు మద్దతుగా లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి ఆందోళనల్లో పాల్గొనడం., ప్రభుత్వం కూడా వారికి మద్దతు పలకడంతో కేంద్రం కంగుతింది. చివరకు జల్లికట్టును అనుమతిస్తూ నాలుగే రోజుల్లో ఆర్డినెన్స్ తీసుకువచ్చినా అల్లర్లు చల్లారకపోవడానికి కారణం కూడా ఉంది. ఆరు నెలలు మాత్రమే చెల్లుబాటులో ఉండే ఆర్డినెన్స్ కంటే శాశ్వతంగా చట్టబద్దత కల్పించాలన్నది తమిల పార్టీల సంకల్పం. అందుకే ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం హడావిడిగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి జల్లికట్టుపై బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించేలా చేశారు. ఇదీ తంబిల పవర్...అంటే... జల్లికట్టులో ఎద్దులను ఎదుర్కొన్న తమిళులు కేంద్రం కొమ్ములు వంచారన్న ప్రశంసలు విన్పిస్తున్నాయి.
- Tags
- తమిళనాడు